close
BETA SITE

అదరహో..అంబటి 

శతకంతో చెలరేగిన రాయుడు 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చెన్నై ఘనవిజయం 

చెన్నై లక్ష్యం 180.. బౌలింగ్‌ చేస్తుంది సన్‌రైజర్స్‌! లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఈ సీజన్లో వాళ్లకు మామూలు రికార్డు లేదు.. 120 కన్నా తక్కువ స్కోర్లను కూడా రక్షించుకున్నారు. ఇక 180 పరుగులంటే వాళ్లెలా విజృంభిస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ అంబటి రాయుడు (100 నాటౌట్‌; 62 బంతుల్లో 7×4, 7×6) సన్‌రైజర్స్‌ బౌలర్లను ఉతికారేశాడు. అలా ఇలా బాదలేదు.. శతక బాదేశాడు. కళాత్మక విధ్వంసం సృష్టిస్తూ కళ్లుచెదిరే శతకంతో చెన్నైకు అద్భుత విజయం అందించాడు. అతనితో పాటు వాట్సన్‌ (57; 35 బంతుల్లో 5×4, 3×6) చెలరేగడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను  8 వికెట్లతో చిత్తు చేసిన చెన్నై (12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు)  పట్టికలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.
పుణె
అంబటి రాయుడు చెలరేగిన వేళ చెన్నైకో అద్భుత విజయం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ను ఎడాపెడా ఉతికిన రాయుడు.. జట్టుకు అలవోక విజయాన్ని అందించాడు. ఆదివారం మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (79; 49 బంతుల్లో 10×4, 3×6), విలియమ్సన్‌ (51; 39 బంతుల్లో 5×4, 2×6) టాప్‌ స్కోరర్లు. రాయుడు, వాట్సన్‌ మెరుపులతో లక్ష్యాన్ని చెన్నై 19 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
ఊపిరాడనీయలేదు..: 180 పరుగుల ఛేదనలో రాయుడు ప్రత్యర్థికి ఊపిరాడనీయలేదు. ఈ ఐపీఎల్‌లో గొప్ప బౌలింగ్‌ దళంగా పేరుపడిన సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించాడు. భువి బౌలింగ్‌లో సిక్స్‌తో మొదలు పెట్టిన అంబటి.. ఇక ఆగలేదు. పరుగులు ఇవ్వడంలో పిసినారులైన షకిబ్‌, రషీద్‌ఖాన్‌, కౌల్‌ బౌలింగ్‌నైతే ఉతికేశాడు. కౌల్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌తో అర్ధసెంచరీ చేసుకున్న రాయుడు.. రషీద్‌కూ ఓ సిక్స్‌ వడ్డించాడు. ముఖ్యంగా షకిబ్‌ను లక్ష్యంగా చేసుకుని రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. వ్యక్తిగత స్కోరు 80ల్లోకి వచ్చాక కాస్త నెమ్మదించిన అతను..జట్టు విజయానికి మరో రెండు పరుగులు అవసరం అనగా.. భువి బౌలింగ్‌లో సింగిల్‌ తీసి 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 
సూపర్‌ వాట్సన్‌: రాయుడు ఆద్యంతం అలరించినా.. ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చింది మాత్రం షేన్‌ వాట్సనే. భారీ సిక్స్‌లు బాదిన అతను.. చెన్నై రన్‌రేట్‌ను పరుగెత్తించాడు. మూడు ఓవర్లో సందీప్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు అందుకున్న షేన్‌.. 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు అయితే అర్ధసెంచరీ తర్వాత అతను రనౌట్‌ కావడం, రైనా (2) స్వల్ప స్కోరుకే ఔట్‌ కావడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే కెప్టెన్‌ ధోని (20 నాటౌట్‌; 14 బంతుల్లో 1×4, 1×6) తోడుగా ప్రశాంతంగా ఆడిన రాయుడు జట్టును విజయతీరాలకు చేర్చాడు. 
మెరిసిన ధావన్‌, విలియమ్సన్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడింది. రెండు ఓవర్లకు ఆ జట్టు స్కోరు 6 పరుగులే. దీనికి తోడు ఓపెనర్‌ హేల్స్‌ (2) ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐతే ధావన్‌, కెప్టెన్‌ విలియమ్సన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీలు చిక్కినప్పుడల్లా చక్కని షాట్లు ఆడిన ఈ జోడీ.. రన్‌రేట్‌ను మెల్లగా పెంచింది. వాట్సన్‌ బౌలింగ్‌లో వరుసగా ఫోర్‌, సిక్స్‌తో దూకుడు పెంచిన విలియమ్సన్‌.. ఆ తర్వాత హర్భజన్‌ బౌలింగ్‌లో బౌలర్‌ తల మీదుగా మరో సిక్స్‌ బాదాడు. ధావన్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో 15 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ 130/1తో బలమైన స్థితిలో నిలిచింది. కానీ ఓవర్‌ తేడాతో ధావన్‌, విలియమ్సన్‌ ఔట్‌ కావడం ఆ జట్టు లయను దెబ్బ తీసింది. రెండో వికెట్‌కు ధావన్‌-విలియమ్సన్‌ జోడీ 123 పరుగులు జత చేసింది. చివర్లో హుడా (11 బంతుల్లో 21) ధాటిగా ఆడడంతో సన్‌రైజర్స్‌ మెరుగైన స్కోరు సాధించింది.
రాయుడుకు ఎవరి బౌలింగైనా ఒకటే
అంబటి రాయుడిని జట్టులోకి తీసుకోవాలని వేలానికి ముందే నిర్ణయమైపోయిందని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అన్నాడు. ‘‘ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభానికి ముందే రాయుడిని జట్టులోకి తీసుకోవాలనుకున్నా. ఎందుకంటే అతని సామర్థ్యం గురించి నాకు తెలుసు. అతను ఎవరి బౌలింగ్‌నైనా గొప్పగా ఎదుర్కొంటాడు. చాలా జట్లు స్పిన్‌ ద్వారా ప్రత్యర్థి ఓపెనర్లను కట్టడి చేయాలనుకుంటాయి. రాయుడు పెద్ద హిట్టర్‌లాగా కనిపించకపోయినా అతను భారీ షాట్లు ఆడతాడు’’ అని ధోని తెలిపాడు. 
ఈ శతకం మామకు అంకితం:  సన్‌రైజర్స్‌పై అద్భుత రీతిలో చెలరేగి అజేయ శతకం సాధించిన సీఎస్కే ఓపెనర్‌ అంబటి రాయుడు ఈ శతకాన్ని తన మేనమామకు అంకితం చేశాడు. రాయుడు మేనమామ మెండు సత్యనారాయణ ఆదివారం ఉదయం మరణించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
1
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడం ఇదే తొలిసారి. 
రాయుడికి ఇదే తొలి ఐపీఎల్‌ సెంచరీ. ఈ ఐపీఎల్‌లో నమోదైన మొత్తం నాలుగో శతకం ఇది. అతడి కంటే ముందు గేల్‌, వాట్సన్‌, రిషబ్‌ పంత్‌ సెంచరీ చేశారు.
‘‘టీ20ల్లో ఓపెనింగ్‌ స్థానం చాలా ముఖ్యమైంది. ఈ స్థానంలో ఆడడాన్ని ఆస్వాదిస్తున్నా. ఓపెనింగ్‌ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. 4 రోజుల క్రికెట్లో రాణిస్తే  ఏ స్థానంలో అయిన బ్యాటింగ్‌ చేయగలం’’
- రాయుడు
సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) హర్భజన్‌ (బి) బ్రావో 79; హేల్స్‌ (సి) రైనా (బి) చాహర్‌ 2; విలియమ్సన్‌ (సి) బ్రావో (బి) శార్దూల్‌ 51; మనీష్‌ పాండే (సి) విల్లీ (బి) శార్దూల్‌ 5; హుడా నాటౌట్‌ 21; షకిబ్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179; 
వికెట్ల పతనం: 1-18, 2-141, 3-141, 4-160; 
బౌలింగ్‌: చాహర్‌ 4-0-16-1; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-32-2; విల్లీ 2-0-24-0; హర్భజన్‌ 2-0-26-0; వాట్సన్‌ 2-0-15-0; బ్రావో 4-0-39-1; జడేజా 2-0-24-0
చెన్నై ఇన్నింగ్స్‌: వాట్సన్‌ రనౌట్‌ 57; రాయుడు నాటౌట్‌ 100; రైనా (సి) విలియమ్సన్‌ (బి) సందీప్‌శర్మ 2; ధోని నాటౌట్‌ 20; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: (19 ఓవర్లలో 2 వికెట్లకు) 180; 
వికెట్ల పతనం: 1-134, 2-137; 
బౌలింగ్‌: సందీప్‌శర్మ 4-0-36-1, భువనేశ్వర్‌ 4-0-38-0; రషీద్‌ఖాన్‌ 4-0-25-0; షకిబ్‌ 4-0-41-0; కౌల్‌ 3-0-40-0

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
Ad Space

దేవ‌తార్చ‌న

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.