close
BETA SITE

మాయగాళ్లు.. ఎక్కడైనా తిప్పేస్తారు 

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2017 అదిరే ప్రదర్శనతో టీమ్‌ ఇండియా ఫైనల్‌ చేరినా.. ఓ లోటు,  ఓ లోపం, ఓ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. స్పిన్‌ జోడీ అశ్విన్‌, జడేజాలది మరిచిపోదగ్గ ప్రదర్శన. ఆ టోర్నీ వాళ్లకు పీడకలే. ప్రభావ శూన్యంగా మారిన ఈ జంట ఉపఖండం బయట భారత స్పిన్‌ మంత్రం పారదని రుజువు చేయాలని కంకణం కట్టుకున్నట్లు కనిపించింది. పూర్తిగా తేలిపోయిన  ఈ జోడీ 71 ఓవర్లలో దాదాపు ఆరు రన్‌రేట్‌తో పరుగులిచ్చి కేవలం ఐదు వికెట్లే పడగొట్టింది.

కానీ ఆరు నెలల్లో ఎంత మార్పు? 
ఓ యువ మణికట్టు స్పిన్‌ జోడీ విదేశీ గడ్డపై భారత స్పిన్‌ ముఖచిత్రాన్నే మార్చేసింది. గిరాగిరా తిప్పేస్తూ అద్భుత విజయాలకు బాటలు వేస్తోంది. పేస్‌ పిచ్‌లకు పెట్టింది పేరైనా దక్షిణాఫ్రికాలో సంచనలన ప్రదర్శనతో ఐదు వన్డేల్లో 30 వికెట్లు పడగొట్టిన కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ ద్వయం.. విదేశీగడ్డపై వన్డే సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన (స్వదేశంలో కూడా) చేసిన భారత స్పిన్‌ దళంగా రికార్డు సృష్టించింది. సీనియర్‌ స్పిన్నర్ల   ప్రపంచకప్‌ ఆశలకు చెక్‌ పెడుతూ, టెస్టు స్థానాలకూ పెను సవాలు విసురుతూ.. భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తోంది.

ఈనాడు క్రీడావిభాగం: విశ్రాంతి పేరుతో సీనియర్‌ స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాలను పక్కన పెట్టడం ఏ క్షణాన మొదలెట్టారో తెలియదు కానీ.. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత స్పిన్‌ దశ తిరగడం కూడా మొదలైంది. కుల్‌దీప్‌-చాహల్‌ జోడీ.. వాళ్లకు దాదాపుగా శాశ్వత విశ్రాంతినిట్లే! శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, శ్రీలంకతో సిరీస్‌ల్లో సత్తా చాటిన కుల్‌దీప్‌, చాహల్‌ సెలక్టర్ల విశ్వాసాన్ని నిలబెట్టారు. ఎలా వేస్తారో తెలియదు. ఎక్కడ వేస్తారో తెలియదు. ఎటుపడి ఎటు తిరుగుతుందో తెలియదు. బ్యాట్స్‌మెన్‌కు వాళ్ల మణికట్టు బౌలింగ్‌ ఓ పెద్ద మిస్టరీ. అంచనా వేయడం.. అర్థం చేసుకోవడం కష్టమవుతోంది. ఎదురుదాడి చేయలేక, డిఫెన్స్‌ ఆడలేక వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత భారత్‌ ఆడిన ప్రతి వన్డేలోనూ ఈ ఇద్దరు లేదా ఇద్దరిలో ఒకరైనా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 26 మ్యాచ్‌ల్లో వీళ్లిద్దరు ఏకంగా 73 వికెట్లు పడగొట్టారు. అన్నీ ఓ ఎత్తయితే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ఓ ఎత్తు. ఎందుకంటే ఉపఖండం బయట గతంలో ఏ భారత స్పిన్నర్లూ విజృంభించని విధంగా వీరు విజృంభించారు. గిర్రున తిరిగే పిచ్‌లు కాకున్నా.. బౌన్స్‌ను ఉపయోగించుకుని ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. అత్యంత కట్టుదిట్టంగా, పొదుపుగా బౌలింగ్‌ చేసిన ఈ జంట ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో 4.92 ఎకానమీ రేట్‌తో ఏకంగా 30 వికెట్లు పడగొట్టింది. గతంలో ఏనాడూ భారత స్పిన్నర్లు సొంతగడ్డపై కూడా ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో ఇన్ని వికెట్లు పడగొట్టలేదు. కుల్‌దీప్‌ 16 తీస్తే.. చాహల్‌ 14 తీసుకున్నాడు. సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు పూర్తయినా దక్షిణాఫ్రికా వీళ్లను అర్థం చేసుకోలేకపోతోందంటే.. కుల్‌దీప్‌, చాహల్‌ మణికట్టు మాయ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎటాక్‌ ఎటాక్‌: క్రికెట్‌కు భారత్‌ ఎందరో మేటి స్పిన్నర్లను అందించి ఉండొచ్చు. కానీ ఉపఖండం బయట వారి రికార్డు అంత గొప్పగా లేదు. కానీ ఈ యువ చైనామన్‌, లెగ్‌ స్పిన్‌ జోడీ అసాధారణ ప్రదర్శనతో ఆ రికార్డులను సరి చేసే పనిలో పడింది. పరుగులను నియంత్రించడంపై కాకుండా, అందీ అందకుండా బంతులేస్తూ నిరంతరం వికెట్ల కోసం ప్రయత్నించడమే కుల్‌దీప్‌, చాహల్‌ విజయ రహస్యం. తక్కువ వేగంతో గాల్లో ఎక్కువసేపు బంతిని ఉంచుతూ బ్యాట్స్‌మెన్‌ను అయోమయానికి గురి చేస్తున్నారు. అదే సమయంలో బంతి మరీ ఫుల్‌ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. మణికట్టు స్పిన్నర్లు కావడంతో.. పిచ్‌ ఎలా ఉన్నా సహజంగానే బంతిని తిప్పగలుగుతున్నారు. కళ్లు చెదిరే గూగ్లీలతో బ్యాట్స్‌మెన్‌ గుండెల్లో గుబులు రేపుతున్నారు. ముఖ్యంగా పేస్‌, ఫ్లైట్‌లో వైవిధ్యం వారిని అత్యంత ప్రమాదకర స్పిన్నర్లుగా మారుస్తోంది. దక్షిణాఫ్రికా పిచ్‌లపై బౌన్స్‌ కూడా వారికి ఉపయోగపడింది. కెప్టెన్‌ కోహ్లి మద్దతు వారిలో ఆత్మవిశ్వాసాని పెంచుతోంది. అందుకే ఎప్పుడైనా ఎదురుదాడికి గురైనా ఎటాకింగ్‌ బౌలింగ్‌ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. వాళ్లు ప్రధానంగా మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీయడం, రన్‌రేట్‌ను బాగా తగ్గించడం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తోంది. ‘‘ఎప్పుడూ వికెట్ల కోసమే ప్రయత్నించమని చెప్పాం. వికెట్ల కోసం ప్రయత్నిస్తే.. బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బంది కలిగేలా సరైన ప్రాంతాల్లో బంతులేస్తారు. వారికి ఎక్కువుసార్లు డిఫెన్సే ఆడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దూరంగా బంతులేస్తూ, పరుగులను నియంత్రించడానికి ప్రయత్నిస్తే బ్యాట్స్‌మెన్‌కు సింగిల్స్‌ తీసే అవకాశం దక్కుతుంది. కుల్‌దీప్‌, చాహల్‌ల విజయానికి పూర్తిగా వాళ్లే కారకులు. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేశారు. బ్యాట్స్‌మెన్‌కు ప్రతి బంతినీ సవాల్‌గా మార్చారు. వాళ్ల నైపుణ్యం అసాధారణం. ఇంతకుముందు నేనెప్పుడూ ఇంత పదునైన స్పిన్‌ను బౌలింగ్‌ను చూడలేదు’’ అని కోహ్లి చెప్పాడు. సారథి విశ్వాసాన్ని ఇంతగా చూరగొన్న ఈ కుర్రాళ్లు తమ అమ్ముల పొది నుంచి ఇంకెన్ని అస్త్రాలు తీస్తారో.. ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

2019 ప్రపంచకప్‌.. ఇక టీమ్‌ ఇండియా ప్రధాన లక్ష్యం ఇదే. టోర్నీ జరిగేది.. భారత స్పిన్నర్లు విఫలమైన ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన ఇంగ్లాండ్‌లోనే. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండనుంది. దక్షిణాఫ్రికాలో కుల్‌దీప్‌, చాహల్‌ల అద్వితీయ ప్రదర్శన.. ఈ టోర్నీలో భారత్‌ బలాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ఇంగ్లాండ్‌లో పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలంగా ఏమీ ఉండవు. కానీ సత్తా చాటడానికి తమకు గిరగిరా తిరిగే పిచ్‌లే అవసరం లేదని ఈ మణికట్టు స్పిన్‌ ద్వయం ఇప్పటికే నిరూపించింది. కాబట్టి ఈ జోడీ ఇంగ్లిష్‌ నేలపైనా విజయాలనందిస్తుందని జట్టు నమ్మడం అతి విశ్వాసమేమీ కాదు.

ఈ సిరీస్‌లో చాహల్‌, కుల్‌దీప్‌ 
తొలి వన్డే : 20-0-79-5 
రెండో వన్డే : 14.2-1-42-8 
మూడో వన్డే : 18-1-69-8 
నాలుగో వన్డే : 11.3-0-119-3 
ఐదో వన్డే : 19.2-0-100-6
* దక్షిణాఫ్రికా ఐదు వన్డేల్లో కుల్‌దీప్‌, చాహల్‌ జంట 4.92 ఎకానమీ రేట్‌తో 30 వికెట్లు పడగొట్టింది. సొంతగడ్డపైనైనా, విదేశాల్లోనైనా ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో భారత స్పిన్నర్ల అత్యుత్తమ ప్రదర్శన ఇదే.  తర్వాతి అత్యుత్తమం 27 వికెట్లు. 2006లో స్వదేశంలో ఇంగ్లాండ్‌పై ఆరు వన్డేల్లో ఆ ప్రదర్శన చేశారు.
‘‘నైపుణ్యాన్ని తీసేస్తే వారిలో ఏమీ లేదు. భయపెట్టేలా కనిపించరు. కళ్లలోకి చూస్తూ భయపెట్టలేరు. కానీ మాయ చేస్తారు. ఇంత తేలిగ్గా ఔటయ్యానేంటి అనుకుంటూ, ఆయోమయానికి గురవుతూ బ్యాట్‌్్సమన్‌ మైదానం నుంచి నిష్క్రమిస్తే ఆశ్చర్యం లేదు’’ 

 - హర్ష భోగ్లే

‘‘కుల్‌దీప్‌, చాహల్‌ ఎంత గొప్ప స్పిన్నర్లో దక్షిణాఫ్రికన్లు గ్రహించలేకపోయారు. వాళ్ల బౌలింగ్‌లో మా వాళ్ల బ్యాటింగ్‌ చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఒక్క ఆమ్లా తప్ప ఎవరూ సరిగా ఆడలేకపోయారు’’

- కెప్లర్‌ వెసల్స్‌, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
Ad Space

దేవ‌తార్చ‌న

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.