close
BETA SITE

‘స్థానికం’లో కాంగ్రెస్‌ హవా 

కర్ణాటకలో 1003 వార్డుల్లో గెలుపొంది సత్తా చాటిన పార్టీ 
రెండు, మూడు స్థానాల్లో నిలిచిన భాజపా, జేడీఎస్‌

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు; తుమకూరు (కర్ణాటక), న్యూస్‌టుడే: కర్ణాటకలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన సత్తా చాటింది. శాసనసభ ఎన్నికల్లో ఆధిక్యం కనబరచిన భాజపాను వెనక్కు నెట్టి ముందువరుసలో నిలిచింది. తొలి విడతలో 2,662 వార్డులకు నిర్వహించిన ఈ ఎన్నికలకు సంబంధించి సోమవారం వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్‌ 1,003 స్థానాల్లో విజయభేరీ మోగించింది. 917 స్థానాలు గెలుచుకుని భాజపా రెండోస్థానంతో సరిపుచ్చుకుంది. జనతాదళ్‌(సెక్యూలర్‌/జేడీఎస్‌) 377 వార్డుల్లో విజయం సాధించి గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. ఇతరులు 364 చోట్ల గెలుపొంది తమ బలిమిని చాటుకున్నారు. బీఎస్పీ ఒక్క స్థానంతో సరిపుచ్చుకుంది.

పొత్తులు పొడవాల్సిందే 
తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా, జేడీఎస్‌ల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టని ఓటర్లు మళ్లీ పొత్తులతో కూడిన అధికారానికి దారి చూపారు. రాష్ట్రంలో 30 జిల్లాలకుగాను గత నెల 31న 21 జిల్లాల్లోని 105 పట్టణ సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. తొలివిడతలో నిర్వహించిన ఈఎన్నికల్లో మొత్తం 2,662 వార్డులలో 9,121మంది అభ్యర్థులు బరిలో దిగారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్‌, జేడీఎస్‌ అవసరమున్న చోట్ల పొత్తులు కుదుర్చుకోగా, గెలుపు తథ్యమనుకున్న చోట ఒంటరిపోరుకు దిగాయి. ఇటీవల భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమైన కొడగు జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేదు.

భాజపాకు అధికారం అందని ద్రాక్ష 
మైసూరు, తుమకూరు, శివమొగ్గ మహానగరపాలికెలతో పాటు నగరసభల్లో భాజపా ఏకైక పెద్ద పార్టీగా అవతరించినా అధికారం దక్కే అవకాశం కనిపించడంలేదు. గత విధానసభ ఎన్నికల ఫలితాల మాదిరిగానే అధికారాన్ని దక్కించుకునే స్థాయి మెజార్టీ దక్కని భాజపాకు నిరాశే మిగిలింది. శివమొగ్గలో మాత్రం 35 స్థానాలకు 20 సీట్లు గెలుచుకున్న భాజపా మిగిలిన రెండు చోట్ల జేడీఎస్‌, కాంగ్రెస్‌ మైత్రి కారణంగా అధికారాన్ని కోల్పోనుంది. పాత మైసూరు ప్రాంతంలోని హాసన, మండ్య, తుమకూరుల్లో జేడీఎస్‌, కరావళి, ఉత్తర కర్ణాటకల్లో భాజపాలు తమ ప్రాభవాన్ని కొనసాగించగా, మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ గెలుపు సాధించింది.

శరీరాలపై బొబ్బలెక్కి, మంటలు 

హానగర పాలికెలో ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో సంబరాలు జరుపుకొంటున్న కాంగ్రెస్‌ కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు రసాయనిక ద్రవం చిమ్మడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం తుమకూరులో జరిగింది. దాదాపు 35 నుంచి 40 మందిపై ఈ ద్రవం పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ద్రవం పడిన కొద్దిసేపటి తరువాత శరీరం బొబ్బలెక్కి, మంటలు రావడంతో భయంతో ప్రభుత్వ ఆసుపత్రికి పరుగు తీశారు. సుమారు 15మంది గాయపడ్డారు. 16వ వార్డులో గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఇనాయిత్‌ ఉల్లాఖాన్‌ మద్దతుదారులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు విజయోత్సవం జరుపుకొంటుండగా, ఓ వ్యక్తి తన చేతిలోని ప్లాస్టిక్‌ సీసాలో ఉన్న రసాయనిక ద్రవాన్ని వారిపై చిలకరించాడు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.