close
BETA SITE

అభ్యర్థుల ఎంపికలో అధిష్ఠాన నిర్ణయమే శిరోధార్యం 

నేతలు తలోమాట మాట్లాడనవసరం లేదు 
కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత జానారెడ్డి

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలోనూ అధిష్ఠాన నిర్ణయమే శిరోధార్యమని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం, ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలు తలోమాటా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించిన తెరాసకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇటీవల కాంగ్రెస్‌ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై విలేకరులు ప్రశ్నించారని అందుకు తాను సమాధానమివ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అనేక మంది అర్హులు ఉన్నారని, అందులో నేను ఒక్కడిని మాత్రమేనని వివరించినట్లు పేర్కొన్నారు. తెరాస గెలుస్తుందని, కాంగ్రెస్‌ ఓడిపోతుందని ‘దరువు’ అనే సామాజిక మీడియా సంస్థ వక్రీకరించి దుష్ప్రచారం చేసిందని, దీనిపై కేసు నమోదు చేయడమే కాకుండా కోర్టులో కేసు వేస్తున్నట్లు చెప్పారు. బస్సు యాత్రల సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారనే విషయంపై సమాధానమిస్తూ.. దీనిపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు, తన మధ్య పూర్తి సమన్వయం ఉందని.. భేదాభిప్రాయాలు లేవన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఇతర పార్టీల పొత్తుల అంశాన్ని హైకమాండ్‌ నిర్ణయిస్తుందన్నారు. రైతుబంధు పథకం ఆరోగ్య శ్రీని మించింది కాదని చెప్పారు. కౌలు రైతులకు పెట్టుబడి దక్కకపోవడం బాధాకరమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జరిగిన అవినీతిపై బాధ్యులు ఎవరైనా.. చర్యలు తీసుకోవాలి కానీ, ఆరు నెలలకోసారి బెదిరించే రీతిలో మాట్లాడటంలో పస లేదన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.