close
BETA SITE

ఏపీ కమల దళపతిగా కన్నా 

ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా సోము వీర్రాజు 
నియమించిన అమిత్‌ షా

ఈనాడు, దిల్లీ: భాజపా ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌ బాధ్యతలను సోము వీర్రాజుకు అప్పగించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా వీరిద్దరినీ ఈ రెండు పదవుల్లో నియమించినట్లు భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
తెదేపా ఎన్డీయే నుంచి వైదొలిగిన తర్వాత రాష్ట్రంలోని భాజపాకు కొత్త అధ్యక్షుడి నియామకంపై భాజపా అధిష్ఠానం దృష్టి సారించింది. అందులో భాగంగా గత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నుంచి ఏప్రిల్‌ 16వ తేదీన రాజీనామా తీసుకొంది. కాపు సామాజికవర్గానికి ఆ పదవిని కట్టబెట్టాలని తొలినుంచీ భావించారు. అందులో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ పేర్లు తెరమీదికి వచ్చాయి. కంభంపాటి రాజీనామా చేసిన వారంలోపే కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందన్నంత హడావుడి జరిగింది. కానీ దాన్ని సాగదీయడంతో ఓపిక నశించిన కన్నా ఏప్రిల్‌ చివరి వారంలో వైకాపాలో చేరడానికి సిద్ధమయ్యారు. అనారోగ్యకారణంగా ఆసుపత్రిపాలుకావడంతో అది ఆగిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా ఆయన్నే భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.


తొలినుంచీ కాపులపైనే దృష్టి: ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన పార్టీలు రెండు బలమైన సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మూడో బలమైన సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని భాజపా అధిష్ఠానం భావించింది. అందులో భాగంగానే కాపు సామాజికవర్గానికే అధ్యక్షపదవి కట్టబెట్టాలని నిర్ణయించి వడపోతలు చేసింది. తొలుత మాణిక్యాలరావుకు ఇవ్వాలనుకున్నా ఆయన తప్పుకొని సోము వీర్రాజు పేరును ప్రతిపాదించారు. అయితే సోము వీర్రాజును పార్టీలోని కొన్నివర్గాలు బలంగా వ్యతిరేకించడంతో పార్టీ అధిష్ఠానం కన్నా లక్ష్మీనారాయణవైపు దృష్టిసారించింది. అయితే కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎలా ఇస్తారంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తడంతో నియామకం సందిగ్ధంలో పడింది. ఈలోపు రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ దిల్లీలో మకాంవేసి తనవంతు ప్రయత్నాలు చేసుకున్నారు. తెదేపాను పూర్తిస్థాయిలో ఇరుకునపెట్టే వారికే అధ్యక్షపదవి కట్టబెట్టాలని అధిష్ఠానం నిర్ణయించుకోవడంతో ఆ జాబితాలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులే మిగిలారు. కన్నా కంటే సోము వీర్రాజు పార్టీలో సీనియర్‌ కావడం, గోదావరి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఇద్దరికీ సముచిత స్థానం కల్పించామన్న భావన కల్గించడానికి ఒకరికి అధ్యక్ష బాధ్యతలు, మరొకరికి ప్రచార కమిటీ కన్వీనర్‌ బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికలకు ముందే దీనిపై ఒక అవగాహనకు వచ్చినప్పటికీ అధికారికంగా వెల్లడిస్తే అక్కడి తెలుగువారికి ఏ సంకేతాలు వెలువడుతాయోనన్న ఉద్దేశంతో ఆ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆగారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.