close
BETA SITE

సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోవాలి 


రాష్ట్రపతిని అభ్యర్థించిన విపక్షాలు 

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సారథ్యంలో పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుసుకున్నారు. ఎస్సీఎస్టీల చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు దళితుల్లో ఓ రకమైన అభద్రతాభావానికి కారణమైందని వారు తెలిపారు. అందుకే, ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని ప్రతిపక్షనేతలు రాష్ట్రపతిని అభ్యర్థించారు. రాష్ట్రపతి స్పందన సానుకూలంగా ఉన్నట్లు రాహుల్‌ గాంధీ ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. రాహుల్‌ సారథ్యంలో రాష్ట్రపతిని కలిసిన వారిలో బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఎం, ఎస్పీ, డీఎంకె తదితర పార్టీల నాయకులున్నారు. 
ఈనెల 20న ఎస్సీఎస్టీల చట్టం కింద తక్షణ అరెస్టుకు సంబంధించిన నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం గమనార్హం.

ఎన్‌సీఎస్‌సీ అభ్యర్థన: షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌(ఎన్‌సీఎస్‌సీ)కు చెందిన ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుసుకుంది. ఎస్సీఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు  తాజా తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సమీక్ష పిటిషన్‌ను వేయాలని సూచించింది.

మీడియాపై విరుచుకుపడ్డ రాహుల్‌: వాస్తవాలను వక్రీకరించి, తనపై మీడియా ద్వేషాన్ని వండి వార్చుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. తనపై అబద్ధాలను అల్లడం ద్వారా వారు జీవనోపాధి పొందుతుండటం- తనకు లభించిన గౌరవంగా పేర్కొన్నారు. ‘‘17 మీడియా సంస్థలు డబ్బుల కోసం రాహుల్‌కు వ్యతిరేకంగా నివేదికలను సిద్ధం చేసినట్లు తమ శూలశోధనలో వెల్లడైంది’’- అని కోబ్రాపోస్ట్‌ వెబ్‌సైట్‌ చెప్పిన విషయాన్ని ఆయన ఊటంకించారు.  ‘‘కోబ్రాపోస్ట్‌ శూలశోధనపై ప్రధాన మీడియా మౌనం దాల్చడం వాటి విశ్వసనీయతను ప్రశ్నిస్తోంది’’ అని ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

ప్రధానిని కలిసిన ఎన్డీయే ఎంపీలు 
ఎన్డీయేకు చెందిన ఎస్సీఎస్టీ ఎంపీలు బుధవారం నాడిక్కడ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. ఎస్సీఎస్టీలపై దురాగతాల నిరోధక చట్టం నిబంధనలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు నేపథ్యంలో లోక్‌జనశక్తి పార్టీ సారధి రామ్‌ విలాస్‌ పాసవాన్‌, కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లోత్‌ల సారథ్యంలో వీరంతా కలిసి ప్రధానితో మాట్లాడారు. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలను బలహీనపరచేలా ఉన్న సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధానితో విస్తృతంగా చర్చించినట్లు పాసవాన్‌ ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.