close
BETA SITE

నల్ల రిబ్బన్లతో నిరసన 


ఆందోళనలో ముఖ్యమంత్రి, శాసనసభాపతి కూడా 
కేంద్ర వైఖరిని నిరసిస్తూ నినాదాలిచ్చిన ఉద్యోగ సంఘాలు 
విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ 

ఈనాడు అమరావతి: అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి బుధవారం విధులకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందంటూ నిరసన తెలిపారు. శాసనసభ సమావేశాలకు మంత్రులు, శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు నలుపు రిబ్బన్లు ధరించి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు కూడా జేబులకు నల్ల రిబ్బన్లు పెట్టుకుని సమావేశాలకు హాజరయ్యారు. శాసనసభ, సచివాలయ సిబ్బంది, పలువురు ఉన్నతాధికారులు కూడా అదే తరహాలో నిరసన తెలిపారు. భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మినహా మిగతా ఎమ్మెల్యేలంతా నలుపు రిబ్బన్లతో సమావేశాల్లో పాల్గొన్నారు. తెదేపా శాసనసభాపక్ష కార్యాలయ సిబ్బంది పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నల్ల రిబ్బన్లు అందజేశారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ బుద్ధా వెంకన్న నలుపు రంగు దుస్తులు, బూట్లు ధరించి వచ్చారు. రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఏపీ జేఏసీ-అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గొల్లపూడిలోని ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయంలోని రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, ఆయుష్‌, ఆర్థిక-గణాంక తదితర కార్యాలయాల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని, కేంద్రం మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ జేఏసీ అమరావతిలోని 94 ఉద్యోగ సంఘాలకు చెందినవారు, రెవెన్యూ సిబ్బంది ఏప్రిల్‌ 6 వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు కొనసాగించాలని వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు అంజిప్రసాద్‌రావు, ఎం.వి.రమణ, బి.పుల్లయ్య, కళాధర్‌, అమరనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.