close
BETA SITE

అప్పు ఇవ్వండి 


రాజధాని నిర్మాణం కోసం ప్రజలకు చంద్రబాబు పిలుపు 
బ్యాంకుల కంటే రెండు, మూడు శాతం అధికంగా వడ్డీ చెల్లిస్తాం 
బాండ్ల జారీకి త్వరలో విధివిధానాలు సిద్ధం చేస్తాం 
పరిపాలిస్తున్న వారే... దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారా? 
మేమిచ్చిన యూసీలపై ప్రధానే సమాధానమివ్వాలి 
భాజపా, వైకాపా, జనసేనలను మరోసారి అఖిలపక్షానికి పిలుస్తాం 
రాకుంటే ప్రజలకు వారు సమాధానం చెప్పాలి 
దిల్లీకి వెళ్లి ప్రతి ఒక్క నాయకుడ్ని కలుస్తా 
సుపరిపాలన గురించి నాకు చెబుతారా? 
అసెంబ్లీలో నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు 
ఈనాడు - అమరావతి 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అప్పు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. డబ్బులున్న వారు దాన్ని బ్యాంకుల్లో దాచుకోకుండా ప్రభుత్వానికి అప్పిస్తే అందుకు ప్రతిగా వారికి బాండ్లు జారీ చేస్తామని ప్రకటించారు. వీటిని తీసుకున్న వారికి బ్యాంకులు ఇస్తున్న దానికంటే అదనంగా రెండు లేదా మూడు శాతం అధికంగా వడ్డీ చెల్లిస్తామన్నారు. దీనిపై త్వరలోనే విధివిధానాలు సిద్ధం చేస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన అఖిలపక్షాల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై బుధవారం ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. ‘‘ ప్రవాసాంధ్రులు, రాష్ట్ర ప్రయోజనాలను కోరుకునే ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలి. సమీకరణ పద్ధతిలో రైతులు భూములిచ్చిన తరహాలోనే...రాజధాని నిర్మాణానికి అప్పులివ్వాలి. ఎవరికి తోచిన విధంగా వారు రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి. విభజన చట్టం, హామీల అమలు కోసం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఏప్రిల్‌ 6వ తేదీ వరకూ నల్లబ్యాడ్జీలు ధరించాలి. ఉద్యోగులు అదనపు గంటలు పనిచేసి వినూత్న రీతిలో నిరసన తెలపాలి. విద్యార్థులు చదువుకుంటూనే రోజుకో గంట రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి. త్వరలో దిల్లీ వెళ్లి...ప్రతి ఒక్క నాయకుడిని కలుస్తాను. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేందుకు సహకరించాలని వారిని కోరుతాను. రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రయోజనాల సాధనకు కేంద్రంపై పోరాడాలని...’’ సీఎం చంద్రబాబు కోరారు.

ప్రధానమంత్రి స్పష్టత ఇవ్వాలి 
దేశాన్ని పాలిస్తున్న జాతీయ పార్టీయే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందా? ఇదేం పద్ధతి? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భాజపాపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజకీయాల్లో వ్యతిరేకించడం సహజమని, దేశానికి నష్టం చేయడం మాత్రం మంచి పద్ధతి కాదని ఆయన నిప్పులు చెరిగారు. ‘‘ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న భాజపాకు తాత్కాలికంగా రాజకీయంగా లాభాలు రావచ్చేమో... శాశ్వతంగా దేశానికి నష్టం జరుగుతుంది. కేంద్రమిచ్చిన నిధులన్నింటికీ వినియోగపత్రాలు సమర్పించినా...అవి ఇవ్వలేదని భాజపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధానమంత్రి స్పష్టత ఇవ్వాలి. వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఇచ్చిన రూ.350 కోట్లను ఎందుకు వెనక్కి తీసుకున్నారో ప్రధానే సమాధానం చెప్పాలి. ఆయనకు తెలియకుండా ఇది జరిగితే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. తెలిసే జరిగితే కారణమేంటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రధానిదే. లోక్‌సభ సమావేశాలు సజావుగా జరగడానికి ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదో చెప్పాలి. లోక్‌సభలోకి ఒక్క నిమిషం...ఇలా రావడం..అలా వెళ్లిపోవడం తప్ప సభా సజావుగా జరగడానికి ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించడంలేదు. సమస్యలపై చర్చించాలి. సమాధానం చెప్పాలి అనే ఆలోచనే లేదు.

వారి ఉచ్చులో చిక్కుకోవద్దు 
విభజన చట్టం, హామీల అమలుకు అహింస, శాంతియుతంగానే పోరాడాలి. ఈ పోరాటంలో మనం హింసకు పాల్పడితే రాష్ట్రం అభివృద్ధి కాకూడదన్న ఆలోచనతో ఉన్న కేంద్రానికి ఆనందంగా ఉండొచ్చు. కొందరు నాయకులు కూడా పోరాటాన్ని హింసాత్మకం చేయాలని చూస్తుంటారు. అలా జరిగి పరిశ్రమలు రాకూడదని, అభివృద్ధి ఆగిపోవాలనేది వారి కోరిక. అలా జరగడానికి వీల్లేదు. పోరాటం చేసే క్రమంలో కొందరు రెచ్చగొట్టేందుకు, దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారి ఉచ్చులో చిక్కుకోవద్దు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం మాట్లాడుతుంటే భాజపా రాయలసీమ డిక్లరేషన్‌ అంటోంది. అప్పుడే రాష్ట్రంపైన అంత అక్కసు ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌ బాగుపడటం వారికి ఇష్టం లేదా?

పోలవరంపై ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించరు 
పోలవరంపైన ఆరోపణలు చేసి రాజకీయలబ్ధి పొందాలనుకుంటే ప్రజలు క్షమించరు. రైతులు ఆగ్రహిస్తే ఆరోపణలు చేసే వారేమవుతారో వారే ఊహించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసమే మేం ఎన్డీయే నుంచి బయటకొచ్చేసినట్లు అమిత్‌ షా చెప్పారు. అదే నిజమైతే మేం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకుంటే మాకు 10, 15 సీట్లు అధికంగా వచ్చేవి.  కేంద్రం ఇచ్చిన నిధులకు మనం సమర్పించిన వినియోగపత్రాలను ఎమ్మెల్యేలందరికీ ఇస్తాం. వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.

ఏదో ఒక రోజు నిందలు వేస్తారని తెలిసే.. జాగ్రత్తగా ఉన్నాం 
నిధుల మళ్లింపు అలవాటేనని మన ప్రభుత్వంపైన ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం అడిగిన నమూనాలోనే లెక్కలన్నీ పూర్తి వివరాలతో పంపించమని ఆదేశించా. ఏ పద్దు కింద ఇచ్చారో దానికే ఖర్చు చేయమని చెప్పా. రాబోయే రోజుల్లో కేంద్రం కావాలనే మనల్ని తప్పుపట్టే అవకాశం ఉంది. ఏదో ఒక విధంగా డబ్బులు ఇవ్వకుండా చేసేందుకు ప్రయత్నిస్తుందని ముందు నుంచే అప్రమత్తం చేశా. ఏదో ఒక రోజు ఇలా నిందలు మోపుతారనే ముందే తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాం.

ప్రత్యేక హోదా అడిగితే ఎస్‌పీవీ ఇస్తామంటారా? 
నేను ప్రత్యేక హోదా గురించి అడిగితే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) పెట్టుకోమంటారా? మీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి వచ్చేలా డబ్బులిస్తాం తీసుకోమంటారా? అందుకా మిమ్మల్ని ప్రత్యేక హోదా అడిగింది? ఈశాన్య రాష్ట్రాల తరహాలోనే 90:10 నిష్పత్తిలో నిధులివ్వండి. పారిశ్రామిక ప్రొత్సాహకాలు ఇవ్వమంటే అవి ఇవ్వకుండా ఎస్‌పీవీ పెట్టుకోమంటారా? మీకు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మేం ఎస్‌పీవీ ఏర్పాటు చేసుకోవాలా?

అప్పటికీ... ఇప్పటికీ ఎందుకీ తేడా? 
కొన్నాళ్ల కిందట ప్రధానమంత్రి ఫోన్‌ చేసి ఆస్తానా నగరానికి ఓ బృందాన్ని పంపించి రాజధాని నిర్మాణం కోసం అధ్యయనం చేయించమని చెప్పారు. చాలా ఆనందం కలిగింది. అలాంటి వారు ఇప్పుడు గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రాజధానికి రూ.2,500 కోట్లు సరిపోవా? అంటున్నారు. అప్పటికీ, ఇప్పటికీ వారి మాటల్లో ఎందుకీ తేడా? తెలుగు వారికి మంచి రాజధాని అవసరం లేదనేది వారి దురుద్దేశం.

ఆంధ్రప్రదేశ్‌ పక్షానా ఉంటారా? కేంద్రం పక్షానా ఉంటారా? 
 

పోరాటంలో తామే ముందున్నామని చెప్పే వైకాపా, ఇప్పటికే అన్ని ఇచ్చేశాం, హామీలు నెరవేర్చేశామంటున్న భాజపా, తామేదో చేస్తామని చెబుతున్న జనసేన తప్ప... మిగతా అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశానికి వచ్చాయి. ఆ మూడు పార్టీలు ఎందుకు రాలేదు. సమయం లేదా? ఆలోచనలు వేరేగా ఉన్నాయా? రాష్ట్రానికి న్యాయం చేయడం మీకు ఇష్టం లేదా? సమాధానం చెప్పాలి. ప్రభుత్వంపై దాడి చేయడానికి వారు ఉపయోగపడ్డారే తప్ప రాష్ట్రానికి న్యాయం చేయడానికి కాదు. మంగళవారం నాటి సమావేశానికి హాజరుకాని ఆ మూడు రాజకీయ పార్టీలను కూడా వచ్చే సమావేశానికి పిలుద్దామని అఖిలపక్ష సమావేశంలో కొందరు సూచించారు. మరో సమావేశానికి ఆ మూడు పార్టీలను కూడా పిలుస్తాం. అవసరమైతే ఇద్దరు మంత్రుల్ని పంపించి ఆహ్వానిస్తాం. అప్పటికీ రాకపోతే మాత్రం ఆ పార్టీలే ప్రజలకు సమాధానం చెప్పాలి. మంగళవారం నాటి సమావేశానికి హాజరుకాని ఆ పార్టీలకు లాలూచీ రాజకీయాలు కావాలా? తెదేపా అధ్యక్షుడిగా నేను వారిని పిలవలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిలిచా. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను ఆశించే, ప్రజాస్వామ్యంపైన గౌరవం ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా హాజరవ్వాలి. అభిప్రాయభేదాలు ఉండటం సహజం. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని చెప్పినప్పుడు రాష్ట్రంలో నాయకులుగా చలామణీ అవుతున్న వారు, తమ రాజకీయ పార్టీలకు మనుగడ ఉండాలనుకుని కోరుకునే వారు ఎందుకు అఖిలపక్ష సమావేశానికి రావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ పక్షానా ఉంటారా? కేంద్రం పక్షానా ఉంటారా? అనేది వారే తేల్చుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై చేస్తున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలే తప్ప లాలూచీ పడటం సరి కాదు.

మీకు చెడు కలలు వస్తున్నాయి...ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు 
నేనేదో కలగంటున్నానని అమిత్‌ షా అంటున్నారు. చెడు కలలు వస్తున్నది వారికే. ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో మీరు (కేంద్ర ప్రభుత్వం, భాజపాను ఉద్దేశించి) లేరు. మేం చేస్తున్న ధర్మపోరాటంలో ఎప్పటికైనా గెలుపు మాదే. కేంద్రం తన సొంత డబ్బులేమి మనకివ్వడం లేదు. మనం కూడా పన్నులు కడుతున్నాం. నిధులు పొందడం మనహక్కు. ఎదురుదాడి చేసిన వారెవరూ బాగుపడలేదు. అలా చేసి పుండు మీద కారం చల్లొద్దు. ఏం అనుభవం ఉందని సుపరిపాలన గురించి అమిత్‌షా నన్ను ప్రశ్నిస్తారు. రాష్ట్రంలో సుపరిపాలన లేదంటారా? దాని గురించి నాకు చెబుతారా? మీకేమి అనుభవం ఉందని సుపరిపాలన గురించి మాట్లాడుతున్నారు. నాపైన బురదజల్లడానికి ప్రయత్నిస్తారా? నాయకుల్ని బలహీనపరుస్తారా? ఎంత దుర్మార్గం. ఎదురుదాడి చేసిన  వారెవరు బాగుపడలేదు. చేతనైతే మా మనసులు గెలుచుకోండి. తెలుగువారిని  అవమానించడం వల్లే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారని  ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల పార్లమెంటులో చెప్పారు. అలాంటిది ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ అవమానం చేస్తున్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.