close
BETA SITE

పంచాయతీరాజ్‌ చట్ట సవరణను ఖండిస్తున్నాం 

అడ్వొకేట్‌ జనరల్‌ రాజీనామా  సర్కార్‌కు చెంపపెట్టు 
ఏప్రిల్‌ 1 నుంచి రెండో విడత బస్సుయాత్ర: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పంచాయతీరాజ్‌ చట్టంను సవరించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు తీసుకురావడం నీతిమాలిన చర్య అని ధ్వజమెత్తారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి చేపట్టబోయే రెండో విడత ప్రజాచైతన్య బస్సుయాత్రలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఖూనీ చేస్తోందో ప్రజలకు వివరిస్తామని..ఇదే యాత్ర ప్రధాన ఉద్దేశమని ఉత్తమ్‌ తెలిపారు. బస్సుయాత్ర నిర్వహణ కమిటీ సమావేశం.. ఛైర్మన్‌ షబ్బీర్‌అలీ అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో జరిగింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. మొదటి షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 1న రామగుండం నుంచి ప్రారంభమై 10న వెంకటాపూర్‌లో యాత్ర ముగించాల్సి ఉండగా...తాజా షెడ్యూల్‌ ప్రకారం 10న వర్థన్నపేటలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంతో రెండో విడత యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తారు. మూడు రోజుల విరామం తర్వాత బస్సుయాత్రను తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్‌ సమావేశాల వరకు ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయడంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసిన పరిణామాలు, తదనంతరం న్యాయస్థానంలో జరుగుతున్న సంఘటనలను ప్రజలకు కూలంకుషంగా వివరించడమే బస్సుయాత్ర ప్రధాన ఉద్దేశమని చెప్పారు. కోర్టుకు వీడియో ఫుటేజీ ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందని..అడ్వొకేట్‌ జనరల్‌ రాజీనామా చేయడం సర్కార్‌కు చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. షబ్బీర్‌అలీ మాట్లాడుతూ...ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చేలా బిల్లు తీసుకువచ్చి..పేద విద్యార్థులకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన ఓయూ విద్యార్థులను జైల్లో పెట్టి ఈ బిల్లు తీసుకురావడం దారుణమన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.