close
BETA SITE

ప్రైవేట్‌ వర్సిటీల్లో సామాజిక రిజర్వేషన్లు ఏవీ? 


పార్లమెంట్‌లో కొట్లాడుతూ ఇక్కడ తిలోదకాలిస్తారా: భాజపా 
ఈ బిల్లును విరమించుకోవాలని విపక్షాల డిమాండ్‌ 
అసెంబ్లీ నుంచి భాజపా, తెదేపా, సీపీఎం వాకౌట్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు రాజ్యాంగబద్ధమైన సామాజిక రిజర్వేషన్లు లేకపోవడంపై శాసనసభలో బుధవారం చర్చ వాడీవేడిగా జరిగింది. అత్యధిక శాతం ఎస్పీ, ఎస్టీ, బీసీ జనాభా ఉన్న రాష్ట్రంలో రిజర్వేషన్లు లేకుంటే పేదలకు తీవ్ర నష్టం తప్పదని భాజపా, తెదేపా, సీపీఎం సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తమకు రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారమివ్వాలని పార్లమెంట్‌ను స్తంభిపంజేస్తూ...మరో వైపు ఇక్కడ రిజర్వేషన్లు లేకుండా బిల్లును పెట్టడమంటే ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించాయి. వెంటనే ఈ బిల్లును విరమించుకోవాలని, పలు సవరణలు చేయాలని డిమాండ్‌ చేశాయి. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆ మూడు పార్టీలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశాయి.చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు బిల్లులోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ప్రపంచస్థాయి విద్య సాధ్యం కాదా?: లక్ష్మణ్‌ 

అంతర్జాతీయస్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకే ప్రైవేట్‌వర్సిటీలని ప్రభుత్వం చెబుతోంది. అది ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా సాధ్యమా కాదా?అని భాజపానేత లక్ష్మణ్‌ నిలదీశారు. మౌలిక వసతులు, సిబ్బంది కొరత వల్ల విద్యాప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. 1600 ఆచార్యుల ఖాళీలుంటే నాలుగేళ్లుగా ఎందుకు భర్తీ చేయలేకపోయారని ప్రశ్నించారు. రుసుములు నిర్ణయం యాజమాన్యాలకే వదిలేశారని, సామాజిక రిజర్వేషన్లు లేవని మాట్లాడారు. రిజర్వేషన్లు కావాలని పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్న మీరు...ఇక్కడ వాటిని ఎందుకు వదిలేశారన్నారు. బడా కంపెనీల కోసమే ఈ నిర్ణయమా? అని మాట్లాడారు. వర్సిటీలకు రూ.420 కోట్లు కేటాయించి...రూ.142 కోట్లకు బీఆర్‌ఓ ఇచ్చి...చివరకు ఖర్చు చేసింది రూ.50 కోట్లా? ఎందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంపై కక్ష సాధింపు అని ప్రశ్నించారు. భాజపా పక్షనేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తొందరపాటుతో బిల్లు పాసు చేస్తే రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు అవకాశం లేకుండా పోతుందని, ఈ బిల్లును సెలెక్టు కమిటీకి పంపించాలని డిమాండ్‌ చేశారు. మన వర్సిటీలను పక్కనబెట్టి ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించడం మంచిది కాదని తెదేపా ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు.  రియల్టర్లు, బడా వ్యాపారులు వర్సిటీలు పెడతారని, ప్రైవేట్‌లో ఇష్టారాజ్యంగా మార్కులు వేస్తారని, దానివల్ల చివరకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మూతపడతాయన్నారు. సంపన్నులకు మేలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని సీపీఎం సభ్యుడు సున్నంరాజయ్య చెప్పారు. ఈ నిర్ణయాన్ని  విరమించుకోవాలన్నారు. రుసుముల నియంత్రణ, ఎండోమెంట్‌ నిధి కనీసం రూ.100 కోట్లు ఉండాలని తెరాస సభ్యుడు జలగం వెంకట్రావు మాట్లాడారు. విదేశీ విద్యానిధి తరహాలో 25 శాతం కోటా కింద చేరే వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలని సూచించారు.

రెండు కేటగిరీలు ఉండాలి: అక్బరుద్దీన్‌ 

విశ్వవిద్యాలయాల్లో కూడా మైనారిటీ, నాన్‌ మైనారిటీ కేటగిరీలుగా విభజించాలని అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడారు. గతంలో ఐఎస్‌బీకి స్థలం ఇస్తున్నందున 25 శాతం రాష్ట్ర విద్యార్థులకు సీట్లు ఉండాలని డిమాండ్‌ చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఎవరైనా మనవాళ్లు ఉన్నారా? ప్రైవేట్‌ వర్సిటీలకు కూడా స్థలాలను ప్రభుత్వమే ఇస్తుందా అని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాలకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వ విద్యాసంస్థలను మాత్రం నిర్లక్ష్యం చేయరాదన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.