close
BETA SITE

2 నుంచి ప్రైవేట్‌ కళాశాలల తనిఖీ 

నిబంధనలు పాటించకుంటే అనుమతులు రద్దు 
డిగ్రీ తరహాలో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు పరిశీలిస్తాం: కడియం 
రూ.287 కోట్లతో చెరువుల అభివృద్ధి: కేటీఆర్‌ 
ఈనాడు - హైదరాబాద్‌

‘విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని...నిబంధనలను కూడా పాటించడం లేదని గత ఏడాది హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 194 కార్పొరేట్‌, ప్రైవేట్‌ కళాశాలలను తనిఖీ చేసి నోటీసులిచ్చాం... కొన్ని కళాశాలలు వేసవి సెలువుల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నాయి. అందుకే ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి మళ్లీ ఇంటర్‌బోర్డు బృందాలతో దాడులు చేయించబోతున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఎంసెట్‌, జేఈఈ, నీట్‌ లాంటి పరీక్షలకు తప్ప ఇంటర్‌ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఈసారి దొరికితే అనుమతులు రద్దు చేస్తామన్నారు. కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలల్లో అధిక రుసుములు, నిబంధనలు పాటించకపోవడంపై ప్రశ్నోత్తరాల్లో ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2017-18లో శ్రీచైతన్య పాఠశాలలు 104, నారాయణ పాఠశాలలు 54 ఉన్నాయని, అలాగే 71 శ్రీచైతన్య, 86 నారాయణ జూనియర్‌ కళాశాలలున్నాయన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండు యాజమాన్యాలకు ఒక్క కొత్త కళాశాలకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. ఇప్పటివరకు హాస్టళ్లకు నిబంధనలు లేవని, వచ్చే ఏడాదికి (2018-19 విద్యా సంవత్సరం) నిబంధనలు రూపొందించామని చెప్పారు. డిగ్రీకి దోస్త్‌ ద్వారా ఆన్‌లైన్‌ ప్రవేశాలను జరిపినట్లు ఇంటర్‌మీడియట్‌ ప్రవేశాలకు కూడా పరిశీలిస్తామని కడియం శ్రీహరి వెల్లడించారు.

త్వరలో చెరువుల ప్రక్షాళన పనులు 
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 20 చెరువుల ప్రక్షాళన, పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి పనులను చేపట్టనున్నామని పులపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రశ్నోత్తరాల్లో సభ్యుల ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ మొదటి దశలో 20 చెరువులను రూ.287.93 కోట్లతో ప్రక్షాళన చేయనున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1234 రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమలున్నాయని, వాటిని తరలించాలంటే ఓఆర్‌ఆర్‌ బయట సీఈటీపీ నిర్మించాలన్నారు. మరో మూడు నెలలలోపు 100 పరిశ్రమలను బయటకు పంపిస్తామన్నారు. 2017 సెప్టెంబరులో హుస్సేన్‌ సాగర్‌లో బీఓడీ స్థాయిలు తగ్గాయని, అయితే ఆతర్వాత పైపులైన్‌ కుంగడం వల్ల సాగర్‌లోకి మురుగునీటిని మళ్లించాల్సి వచ్చిందని, దాంతో పరిస్థితి మొదటికొచ్చిందన్నారు. పైపులైన్‌ బలోపేతానికి ఇప్పటికే గ్లోబల్‌ టెండర్లు పిలిచామన్నారు. నిబంధనలు పాటించని 13 పరిశ్రమలను పీసీబీ మూసివేసిందని చెప్పారు. చెరువుల రక్షణ, పర్యవేక్షణకు 150 మంది సిబ్బందిని నియమిస్తున్నామని, వారికి ప్రత్యేక దుస్తులు కూడా ఇస్తున్నామన్నారు. వినాయక చవితిని దృష్టిలో ఉంచుకొని మట్టి విగ్రహాల కోసం ధూల్‌పేటలో కార్మికులకు స్వచ్ఛంద సంస్థలతో అవగాహన కల్పిస్తున్నామన్నారు. నదులపై వంతెనల నిర్మాణం గురించి అడిగిన ప్రశ్నకు  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానమిస్తూ గోదావరి, కృష్ణ, మంజీర, మానేరు నదులపై రూ.752.75 కోట్లతో 11 వంతెనలను చేపట్టామన్నారు.  సింగరేణి గనులపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిస్తూ వచ్చే సంవత్సరంలో ఆరు భూగర్భ, 7 బహిరంగ బొగ్గు గనులను ప్రారంభిస్తామని చెప్పారు.


ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో స్థానిక రిజర్వేషన్లు ఎక్కడా లేవు 
మనమే 25 శాతం చట్టంలో చేర్చాం 
భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏ రిజర్వేషన్లు లేవు: మంత్రి కేటీఆర్‌ 

దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఎక్కడా స్థానిక రిజర్వేషన్లు లేవని, తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాల కోసం ఇక్కడ ప్రారంభించే విశ్వవిద్యాలయాల్లో 25 శాతం రిజర్వేషన్లను చట్టంలో చేర్చామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలను పెద్దఎత్తున ప్రోత్సహించింది భాజపానేనని, ఆ పార్టీ పాలిత 21 రాష్ట్రాల్లో ఏ రిజర్వేషన్లు అమలు కావడం లేదని, ఇక్కడి నేతలు విశ్వవిద్యాలయాలను వ్యతిరేకిస్తూ, రిజర్వేషన్ల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బుధవారం శాసనసభ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘భాజపాది ద్వంద్వ వైఖరి. ఏపీలోనూ ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఎక్కడా రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. తెలంగాణ నేతలు మాత్రం ప్రైవేటు విశ్వవిద్యాలయాలను వ్యతిరేకించారు. ఇలా రాష్ట్రానికో మాదిరి భాజపా వ్యవహరిస్తోందని నిరూపించారు.  ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, రిజర్వేషన్లకు భాజపా నేతలు ముడిపెట్టడం హాస్యాస్పదంగా ఉంది. సామాజిక న్యాయంలో తెలంగాణ దేశంలో ముందంజలో ఉంది. పార్లమెంటులో మా ఎంపీలు ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల కోసం రాజీలేని పోరు సాగిస్తున్నారు. భాజపా గోడమీది పిల్లి మాదిరిగా వ్యవహరిస్తోంది.

వాటితో మేలే: ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తుంది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. వాస్తవాలు తెలుసుకోకుండా భాజపా, ఇతర పార్టీలు విమర్శలు చేయడం మానుకోవాలి’ అని కేటీఆర్‌ సూచించారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.