close
BETA SITE

జాతీయ పార్టీలకు అధికారం కల్ల 

ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయి 
భాజపా, కాంగ్రెస్‌ల పెత్తనం చెల్లదు 
మమత కాంగ్రెస్‌ కూటమిలో చేరరనే అనుకుంటున్నా 
తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెల్లడి 
ప్రగతి భవన్‌లో ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌సోరెన్‌ భేటీ 
జాతీయ రాజకీయాలు, కొత్త కూటమి ఏర్పాటుపై చర్చ 
ఈనాడు - హైదరాబాద్‌ 


 

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు అధికారంలోకి రావడం అసాధ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలకు పెత్తనం అప్పగించే బదులు ప్రాంతీయ పార్టీలే రాజ్యాధికారం సాధించేందుకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌, భాజపాయేతర కూటమినే ప్రజలు ఆదరిస్తారని, దీనికి అనుగుణంగా కార్యాచరణ ఉండాలని చెప్పారు. ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. కేసీఆర్‌ ఆహ్వానం మేరకు ఆయన కుటుంబ సమేతంగా హైదరాబాద్‌కు వచ్చారు. వారికి తన నివాసంలో కేసీఆర్‌ కుటుంబసమేతంగా సాదర స్వాగతం పలికారు. విందు అనంతరం నేతలిద్దరూ జాతీయ రాజకీయాలు, కొత్త కూటమి ఏర్పాటుపై రెండు గంటల పాటు చర్చించారు. కేసీఆర్‌ ఈ సందర్భంగా హేమంత్‌ తండ్రి శిబు సోరెన్‌ను ప్రశంసించారు. తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిప్రదాతల్లో ఆయన ఒకరని తెలిపారు. ఆయన వారసునిగా హేమంత్‌ నడుస్తున్నారని కితాబిచ్చారు. ‘‘ప్రజల ఆకాంక్షలను చాటడంలో ప్రాంతీయ పార్టీలే ముందున్నాయి. వాటికి స్పష్టమైన అజెండా ఉంటుంది. జాతీయ పార్టీలు కప్పదాటు ధోరణితో వ్యవహరిస్తుండడంతో  దేశంలో వాటి ప్రాబల్యానికి కాలం చెల్లుతోంది. ఏదో ఒక పార్టీతో పొత్తు లేకుండా జాతీయ పార్టీల మనుగడే ఉండడం లేదు. వచ్చే ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు మెజారిటీ స్థానాలు రావు. ప్రాంతీయ పార్టీలపై అవి ఆధారపడతాయి. జాతీయ పార్టీలకు అవకాశం ఇవ్వడం కంటే ప్రాంతీయ పార్టీలే అధికారం చేపట్టేందుకు ప్రయత్నించాలి. జాతీయ పార్టీల పాలనలో దేశం ముందుకు సాగడం లేదు. రాష్ట్రాలు అభివృద్ధిని సాధిస్తున్నా కేంద్రాల సహకారం లేదు. సొంత పార్టీల అభివృద్ధే ధ్యేయంగా అవి పనిచేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి.

ఆ రెండింటిదీ ఒకే ధోరణి 
సుదీర్ఘ రాజకీయ అనుభవంలో వీటన్నింటిపైనా అధ్యయనం చేశాను. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నాను. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వ తీరును పరిశీలిస్తున్నా. కాంగ్రెస్‌, భాజపాలది ఒకే ధోరణి. దేశ సమగ్రాభివృద్ధి ధ్యేయంగా అవి పనిచేయడం లేదు. రాష్ట్రాల్లో పాగా వేయాలన్న కాంక్ష తప్ప వాటిని అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం లేదు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నా భాజపా నుంచి ఏ మాత్రం సాయం అందడం లేదు. పన్నుల వాటా మినహా ఏ మాత్రం నిధులివ్వకుండా వివక్ష చూపుతోంది. ప్రధానిని కలిసి విన్నవించినా ఫలితం లేదు. కాంగ్రెస్‌ పార్టీ కూడా రాష్ట్రాల అధికారాల గురించి ప్రయత్నించడం లేదు. రాజకీయ ప్రయోజనాలే దానికి ప్రధానంగా మారాయి. దేశమంటే ఈ రెండు పార్టీలే కాదు ప్రబలమైన మరో శక్తి ఉందని నిరూపించడానికే కొత్త కూటమి ఆలోచనకు అంకురార్పణ చేశాను. ఈ ఆలోచన వెల్లడించగానే స్పందించినందుకు ధన్యవాదాలు. త్వరలోనే దిల్లీలో కూటమి ఏర్పాటు సన్నాహక సమావేశం నిర్వహిద్దాం. దీనికి భాజపా, కాంగ్రెస్‌మినహా అన్ని పార్టీలను ఆహ్వానిద్దాం. మమతాబెనర్జీ కాంగ్రెస్‌ కూటమితో కలుస్తారని భావించడం లేదు. దిల్లీలో జరిగే సమావేశంలో ఎవరు ఎటువైపో అన్నదానిపై చర్చిద్దాం. ఇదిసుదీర్ఘ ప్రయాణం. లక్ష్యసాధనపై అడుగులు వేద్దాం’’ అని కేసీఆర్‌ అన్నారు.

ఆ సమావేశంలో పాల్గొంటా: సోరెన్‌ 
దేశంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుకు కేసీఆర్‌ చొరవ అభినందనీయమని హేమంత్‌ సోరెన్‌ అన్నారు. దీనికి సంపూర్ణ మద్దతిస్తున్నట్లు చెప్పారు. ‘జాతీయ పార్టీలు అధికారమే తప్ప దేశ ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు. కూటమి ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. ఝార్ఖండ్‌ ప్రజలు దీనికి మద్దతు ఇస్తారు. దిల్లీ సమావేశానికి హాజరవుతాను. కూటమి కార్యకలాపాల్లో పాల్గొంటాను’ అని హేమంత్‌ చెప్పారు. సమావేశం అనంతరం సీఎం వారికి వీడ్కోలు పలికారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.