close
BETA SITE

ప్రైవేట్‌గా విశ్వవిద్య 

ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల బిల్లుకు సభ ఆమోదం 
అంతర్జాతీయ పోటీని తట్టుకునేందుకే: కడియం 

ఈనాడు, హైదరాబాద్‌ : ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పోటీని తట్టుకోవాలంటే ఉన్నత విద్యలో ప్రైవేట్‌ భాగస్వామ్యం ఉండాలనే ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు అవకాశమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. వాటిల్లో ప్రవేశపెట్టే విభిన్న  కోర్సుల వల్ల మన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు. ‘ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపన, నియంత్రణ బిల్లు-2018’ను సభ ఆమోదించింది. ఈ సందర్భంగా శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో పలువురు సభ్యుల ప్రశ్నలు, సందేహాలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూనే...బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందిస్తూనే ప్రైవేట్‌వర్సిటీలకు అనుమతి ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసమే 25 శాతం సీట్లు తెలంగాణవాసులకు దక్కేలా నిబంధన విధించామని చెప్పారు. దేశవ్యాప్తంగా కేరళ, గోవా, జమ్మూకశ్మీర్‌ తప్ప మిగిలిన 26 రాష్ట్రాల్లో ప్రైవేట్‌వర్సిటీలు ఉన్నాయని గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ 11 విశ్వవిద్యాలయాలు వస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా అందరినీ ఆకర్షిస్తున్న నగరం హైదరాబాద్‌ అని, నగరంలో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు నెలకొల్పితే మన విద్యార్థులు అంతర్జాతీయ పోటీని తట్టుకొని నిలబడతారన్నారు. దేశంలో 830 విశ్వవిద్యాలయాలుండగా అందులో 282 ప్రైవేట్‌ వర్సిటీలని చెప్పారు. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలకు లోబడి ఆ వర్సిటీలు విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుందని సృష్టంచేశారు. ఏర్పాటయ్యే వాటికి ప్రభుత్వం భూములు ఇవ్వడం లేదని చెప్పారు. నిబంధనలు రూపొందించుకునే సమయంలో మీ సలహాలు తీసుకుంటామని అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి అన్నారు. స్థలాలు, ఎండోమెంట్‌ నిధి తదితర వాటిపై వివరంగా చర్చించి నిబంధనలు తయారు చేస్తామన్నారు.

ప్రభుత్వ వర్సిటీల పటిష్ఠతే లక్ష్యం: రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే మౌలిక వసతుల కల్పనకు రూ.420 కోట్లు ఇచ్చామని, 1061 ఆచార్యుల ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతి ఇచ్చామని, త్వరలోనే ప్రకటనలు వెలువడతాయన్నారు. జూన్‌, జులై నాటికి పూర్తి చేస్తామన్నారు. భాజపా పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌లో 31, మధ్యప్రదేశ్‌లో 24, రాజస్థాన్‌లో 46 ఉన్నాయని, అవన్నీ భాజపా హయాంలో వచ్చినవేనన్నారు. జాతీయస్థాయిలో ఒకలా...ఇక్కడ మరో విధంగా భాజపా విధానం ఉంటుందా అని మండిపడ్డారు. ఓయూ విద్యార్థులపై తమకు కక్ష ఎందుకు ఉంటుందని.. లక్ష్మణ్‌ తన వాఖ్యలను విరమించుకోవాలన్నారు.

సామాజిక రిజర్వేషన్లపై సమాధానం కరవు: పలువురు ప్రతిపక్ష సభ్యులు సామాజిక రిజర్వేషన్లు ఎందుకివ్వడం లేదని పలుమార్లు ప్రశ్నించినా మంత్రి కడియం సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.