close
BETA SITE

ఇంటింటా ఆరోగ్య సర్వే 

ప్రాథమిక సమాచార సేకరణ 
ముందుగా రోగనిర్దారణ పరీక్ష 
పల్లెలు, పట్నాల్లో శిబిరాలు 
ఏప్రిల్‌లో కంటి పరీక్షలు 
అత్యుత్తమ వైద్యసేవలపై యూకే, కెనడాల్లో అధ్యయనం 
జులై-ఆగస్టుల్లో అందరికీ వైద్య పరీక్షల ప్రక్రియ 

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాధి వచ్చాక చికిత్స అందించడం కంటే ముందస్తుగా వ్యాధిని కనుగొనడం, తద్వారా ఆదిలోనే రోగానికి చికిత్స అందించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా సమగ్ర వైద్య పరీక్షల పథకానికి శ్రీకారం చుట్టింది.  కుటుంబంలో వ్యక్తుల వారీగా ఆరోగ్య సమాచారాన్ని ఇంటింటి సర్వే ద్వారా సేకరించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. పల్లెలు, బస్తీల్లోనూ వైద్యశిబిరాలు నిర్వహించి వాటిల్లో ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఎవరికైనా వ్యాధి నిర్ధారణ జరిగి మరిన్ని పరీక్షలు అవసరమైతే ప్రభుత్వాసుపత్రికి తరలిస్తారు. అన్ని పరీక్షలను ఉచితంగానే చేస్తారు.

ముందుగా నేత్ర వైద్యం 
సమగ్ర వైద్యపరీక్షలను ఒకేసారి నిర్వహించాలని ముందుగా భావించినా అది ఆషామాషీ వ్యవహారం కాదని వైద్య అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో ఏప్రిల్‌ రెండోవారంలో ముందుగా కంటి పరీక్షలను నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇందుకోసం 700 మంది ప్రైవేటు నేత్ర వైద్య సాంకేతిక నిపుణుల సహకారాన్ని కూడా తీసుకోనున్నారు. కేవలం కళ్లద్దాలు ఇస్తే సమస్య పరిష్కారమయ్యే వారికి వారం, పది రోజుల్లోపు అద్దాలు సమకూర్చుతారు. శస్త్రచికిత్స అవసరమైతే సమీపంలోని నేత్ర వైద్యశాలల్లో ప్రభుత్వ ఖర్చుతో చికిత్స ఇప్పిస్తారు. రాష్ట్రమంతటా నేత్ర వైద్యశిబిరాలు నిర్వహించడానికి సుమారు 90 రోజులు పడుతుందని వైద్యవర్గాల అంచనా. సమగ్ర వైద్య పరీక్షలకు వైద్యపరికరాలు, మానవ వనవరులు, పక్కా ప్రణాళిక అవసరమవడంతో దీనికి మరికొంత సమయాన్ని తీసుకోనున్నారు.

నివారణకు పెద్దపీట 
ముందుగా జబ్బును గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. పేదలు కూడా వైద్య పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సమగ్ర వైద్య పరీక్షల పథకానికి రూపకల్పన చేశారు. ఏప్రిల్‌ రెండోవారంలో కెనడా, యూకేల్లో పర్యటించే అవకాశాలున్నాయి. అక్కడ పరిశీలన అనంతరం పక్కా ప్రణాళికలను రూపొందించి జులై-ఆగస్టు నెలల్లోపు రాష్ట్రవ్యాప్తంగా అందరికీ సమగ్ర వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

-లక్ష్మారెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

వైద్యపరీక్షల్లో ప్రధానంగా దృష్టిపెట్టే అంశాలివి.. 
అధిక రక్తపోటు మధుమేహం రక్తహీనత కొలెస్ట్రాల్‌ మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు క్యాన్సర్‌ ఎముకల్లో బలహీనత శ్వాస సమస్యలు వినికిడి లోపం దంత సమస్యలు పోషకాహార లోపం ధూమపానం, మద్యపాన అలవాట్లు ఆహారపు అలవాట్లు (ఉప్పు, నూనె, పచ్చళ్ల వాడకం కూడా) మానసిక ఒత్తిడి.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.