close
BETA SITE

గ్రామ సురాజ్యం 

పంచాయతీ రిజర్వేషన్‌ పదేళ్లు 
ప్రత్యక్ష పద్ధతిలో.. పార్టీరహితంగానే సర్పంచి ఎన్నిక 
మంత్రి స్థానే అప్పీలేట్‌ అథారిటీ 
సర్పంచి, ఉపసర్పంచికి కలిపి చెక్‌పవర్‌ 
పెరగనున్న బాధ్యతలు 
కొత్తగా కోఆప్షన్‌ సభ్యుల నియామకం 
గ్రామ అవసరాల కోసం ప్రత్యేక పన్ను విధించుకోవచ్చు 
పోటీచేసేవారికి కనీస విద్యార్హతలు అక్కరలేదు 
తెలంగాణ పంచాయతీరాజ్‌ బిల్లులో పలు ముఖ్యాంశాలు 
ఈనాడు - హైదరాబాద్‌ 

తెలంగాణలో పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్లు ఇక ఇప్పటి మాదిరిగా అయిదేళ్లు కాకుండా పదేళ్ల పాటు (రెండు దఫాలు) అమలులో ఉంటాయి. పంచాయతీ సర్పంచి ఎన్నికలు ఎప్పటి మాదిరిగానే ప్రత్యక్ష పద్ధతిలో పార్టీ రహితంగా నిర్వహిస్తారు. సర్పంచిపై కలెక్టర్‌ తీసుకొనే చర్యలను ప్రస్తుతం పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సమీక్షించి తుది నిర్ణయాన్ని తీసుకొంటుండగా.. ఇక ముందు అటువంటి బాధ్యతల కోసం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ కొత్తగా ఉనికిలోకి వస్తుంది. చెక్కుపై సంతకాలు చేసే అధికారం ప్రస్తుతం సర్పంచి, కార్యదర్శికి కలిపి ఉండగా.. ఇక కార్యదర్శి స్థానంలోకి ఉప సర్పంచి వస్తారు. పంచాయతీల్లోనూ ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులుంటారు. పంచాయతీ కార్యనిర్వహణ అధికారాలు పంచాయతీ పాలకమండలికే లభిస్తాయి. భవన నిర్మాణానికి 15 రోజుల్లోగా అనుమతి ఇవ్వాల్సిందే. ఇటువంటి అనేక కొత్త అంశాలతో తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం కొద్ది రోజుల్లో మనుగడలోకి రాబోతోంది. గ్రామసభను ఇక ప్రతి రెండు నెలలకు ఒక సారి చొప్పున నిర్వహించాలి. ఇలా ఏడాదికి ఆరు సార్లు సభలను ఏర్పాటు చేయటమే కాకుండా కనీసం చివరి రెంటిండిని మహిళలు, వృద్ధుల అంశాలకు ప్రత్యేకించాలి. ఇలా తెలంగాణ నూతన పంచాయతీరాజ్‌ చట్టం ఇప్పటి చట్టం కంటే వినూత్నంగా ఉండబోతోంది. దీనికి సంబంధించిన బిల్లును       ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. సభలో చర్చ తర్వాత.. అవసరమైతే కొన్ని సవరణలతో ఇది చట్టంగా అమలులోకి వస్తుంది. పంచాయతీలతో పాటు మండల, జిల్లాపరిషత్‌ల విధులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, కొత్తగా ఏర్పాటయ్యే అప్పలేట్‌ ట్రైబ్యునల్‌ విధులు, బాధ్యతలను చట్టంలో నిర్వచించారు. కొత్త చట్టం ప్రకారం పంచాయతీల బాధ్యతలు మరింతగా పెరిగాయి. బాధ్యతను విస్మరించే వ్యక్తులపై నిర్ధిష్ట చర్యలుంటాయి. కార్యనిర్వహణ అధికారాలు పంచాయతీ పాలకవర్గానికే లభిస్తాయి. కార్యదర్శి సబార్డినేట్‌గా వ్యవహరిస్తారు. అతని బాధ్యతలు మరింత విస్తృతమయ్యాయి. అతను రోజూ ఉదయం పంచాయతీలో పర్యటించి సమస్యలు తెలుసుకొంటూ పరిష్కరిస్తుండాలి. అతను అదే గ్రామంలో నివాసించాలి. నిబంధనలను కాలరాసి అపరిశుభ్రత, స్థలాల ఆక్రమణకు పాల్పడేవారికి ఇక పంచాయతీ బాగానే జరిమానాలు వేస్తుంది. ఎన్నికల్లో పోటీచేసేవారికి కొన్ని రాష్ట్రాల్లో అనుసరిస్తున్నట్టుగా కనీస విద్యార్హతలను పెట్టబోతున్నారంటూ ప్రచారం జరిగినప్పటికీ.. ప్రభుత్వం ఇప్పటి మాదిరిగానే విద్యార్హతలు లేకున్నా పోటీకి అవకాశం కల్పించదలచింది. చిన్న పంచాయతీల ఎన్నికలను పార్టీ గుర్తులపై నిర్వహించటంపై సర్కారు కొంత కసరత్తు చేసినప్పటికీ చివరికి ఎప్పటి మాదిరిగానే పార్టీ రహిత ఎన్నికలకే మొగ్గు చూపించింది. బిల్లులోని

మరికొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. 
పదేళ్ల రిజర్వేషన్‌ అనేది కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మాత్రమే మొదలవుతుంది. అంతే తప్ప ఇప్పటికే అయిదేళ్ల క్రితం రిజర్వు అయి ఉన్న స్థానాలకు మరో అయిదేళ్లపాటు అదే రిజర్వేషన్‌ను పొడిగించటం ఉండదు. 
ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా గ్రామసభకు తప్పనిసరిగా కోరం ఉండాలి. ఉదాహరణకు 500 ఓటర్లు ఉన్నచోట కనీసం 50 మంది సభ్యులు సభకు హాజరై ఉండాలి. ప్రతి గ్రామసభకు వీడియో తీయటంతో పాటు సభలోని నిర్ణయాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. 
గ్రామపంచాయతీ ట్రైబ్యునల్‌ కొత్తగా ఉనికిలోకి వస్తుంది. దీనిలో ముగ్గురు సభ్యులుంటారు. ఇక్కడికి వచ్చే కేసులను మూడునెలల్లోగా..గరిష్ఠంగా ఆరునెలల్లోగా పరిష్కరిస్తారు. దీనికి స్టే ఆర్డర్లను ఇచ్చే అధికారం ఉండబోదు. 
నిర్ణీత వ్యవధిలోగా పంచాయతీ అకౌంట్లను ఆడిట్‌ చేయించకపోతే సర్పంచి, కార్యదర్శి తమ పదవులను కోల్పోక తప్పదు. కనీసం నెలకోసారి పాలకవర్గం సమావేశం కావాలి. ఇళ్ల స్థలాల లేఅవుట్‌కు అనుమతి కోరుతూ వచ్చిన దరఖాస్తును వారం రోజుల్లోగా సాంకేతిక మంజూరీ విభాగానికి పంపాలి. అలా పంపకపోతే యాంత్రికంగా అక్కడికి పంపినట్టే లెక్కలోకి వస్తుంది. సాంకేతిక విభాగం అన్ని అంశాలను పరిశీలించి 30 రోజుల్లోగా పంచాయతీకి ఆ విషయం తెలియజేయాలి. పంచాయతీ ఆ విషయాన్ని మరో ఏడు రోజుల్లోగా లే అవుట్‌ యజమానికి చెప్పాలి. ఇటువంటి పనుల కోసం ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి ఇస్తుంది. 
300 చదరపు గజాల్లో 10 మీటర్లకు మించని గ్రౌండ్‌ ప్లస్‌ టు వరకు భవన నిర్మాణానికి పంచాయతీ అనుమతి ఇవ్వొచ్చు. పంచాయతీ 15 రోజుల్లోగా ఏ నిర్ణయాన్నీ తీసుకోకుంటే దానికి  అనుమతి లభించినట్లే లెక్క. 
మంచినీటి వనరులు, డ్రైన్లు తదితరాల మరమ్మతులకు నిధుల ఆవశ్యకత ఏర్పడినప్పుడు ఇళ్లు, ఇతర ఆస్తులపై పంచాయతీ ప్రత్యేక పన్నును విధించి వసూలు చేయవచ్చు. పంచాయతీలు విధించే పన్నులపై ప్రభుత్వ అనుమతితో మండల పరిషత్‌ సర్‌ఛార్జిని వసూలు చేయవచ్చు. 
పంచాయతీలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చూస్తూ ఇక ఆరు బయలు మలవిసర్జన అనేది లేకుండా చూడటం పంచాయతీ విధి. చెత్త నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి కంపోస్టు ఎరువులను తయారు చేయాలి. శ్మశానాలను ఏర్పాటు చేయాలి. పంచాయతీ పరిశుభ్రంగా ఉంటూ పచ్చదనంతో కలకలలాడుతుండాలి. గ్రామాభివృద్ధికి చెందిన అయిదేళ్ల ప్రణాళికలను పంచాయతీ తయారు చేయాలి. 
ప్రస్తుత గ్రామ పంచాయతీలన్నీ కొత్త చట్టం కిందకు వస్తాయి. కొత్త పంచాయతీలు ఏర్పాటైనప్పుడు..వాటి పరిధిలోని ఆస్తులు, రుణ బాధ్యతలు వంటివన్నీ వాటికే చెందుతాయి.గ్రామ పంచాయతీలో ముగ్గురు సభ్యులను నామినేట్‌ చేసుకోవచ్చు. 
పంచాయతీ తీర్మానాలు సక్రమంగా లేవని భావించినట్లైతే వాటిని రద్దు చేసే అధికారం పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు ఉంటుంది. ప్రతి పోలీసు అధికారి తన పరిధిలోని పంచాయతీకి, అక్కడి అధికారులు, సిబ్బందికి సహకరించాలి.

పంచాయతీలకు ఇక పుష్కలంగా నిధులు: మంత్రి జూపల్లి కృష్ణారావు 
పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు ఇంకా వివిధ మార్గాల్లో పుష్కలంగా నిధులు అందబోతున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పంచాయతీల కోసం తొలిసారిగా రూ.1200 కోట్లను ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపర్చిందని, ఇది కాకుండా భగీరథ ద్వారా తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తున్నందున మంచినీటి కోసం పెడుతున్న ఖర్చు పంచాయతీలకు ఆదా అవుతుందని ఆయన చెప్పారు. నిరంతర విద్యుత్తును ఇస్తున్నందున ఆ మేరకు కూడా పంచాయతీలకు గతంలోకంటే రాబడులు పెరుగుతాయన్నారు.పంచాయతీ రాజ్‌ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత విలేకర్లతో ఆయన మాట్లాడారు. కొత్త చట్టం వల్ల పంచాయతీల విధులు, బాధ్యతలు బాగా పెరుగుతాయని, నిధుల వినియోగంలో పారదర్శకత ఏర్పడుతుందని చెప్పారు. తప్పు చేసినవారిపై జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకొంటారని, తదుపరి అప్పీలు కోసం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. తప్పు చేసినట్టు తేలితే శిక్షలు కూడా తీవ్రంగానే ఉంటాయన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.