close
BETA SITE

గాంధీజీకి వీరాభిమానిని 

చంద్రబాబు నా హీరో: కమల్‌

ఈనాడు డిజిటల్‌, చెన్నై: ప్రముఖ నటుడు, విలక్షణ కథానాయకుడు కమల్‌హాసన్‌ తన రాజకీయ ప్రస్థానానికి తమిళనాడులోని రామేశ్వరంలో బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం ఎనిమిది గంటలకు రామేశ్వరంలోని దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం నివాసానికి చేరుకున్నారు. కలాం సోదరుడు మహమ్మద్‌ ముతు మీర లెబ్బాయ్‌కు చేతి గడియారం కానుకగా ఇచ్చి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం స్థానిక మత్స్యకారులు, వారి సంఘాల నాయకులతో సమావేశమై వినతులు స్వీకరించారు. అనంతరం వారిని మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నాలుగేళ్లుగా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మత్స్యకార సంఘాల నాయకులు కమల్‌కు వివరించారు. పెద్దసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని కమల్‌హాసన్‌కు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా ఆయనకు కటౌట్లు, బ్యానర్లతో అభిమానులు పెద్దసంఖ్యలో స్వాగతం పలికారు. అనంతరం మూడు గంటలకు పరమకుడిలోని తాను చదువుకున్న పాఠశాలను సందర్శించారు. స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ... 45 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చానన్నారు. ప్రాంతంలో చిన్న మార్పులున్నా, మనుషుల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. ఇకపై సినీతారను కాదని, అసలు సిసలు రాజకీయ నాయకుడినని పేర్కొన్నారు. అందరి ఇళ్లల్లో దీపాన్ని అవుతానని, రక్షణగా నిలిచి వెలుగులు విరజిమ్మేలా చేయాలని అభ్యర్థించారు.
రాష్ట్రవ్యాప్త యాత్ర ప్రారంభం తర్వాత పాత్రికేయుల సమావేశంలో కమల్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి ఫోనులో తనతో మాట్లాడారని చెప్పారు. ఆ సందర్భంగా ప్రజలకు ఏం చేయాలనే విషయాలపై సలహాలు ఇచ్చారని, ఇతర అంశాల గురించి ఆందోళన చెందవద్దని సూచించారని పేర్కొన్నారు. ఆయన తన హీరో అని వ్యాఖ్యానించారు. తాను మహాత్మాగాంధీ వీరాభిమానినని చెప్పారు. విభిన్న రాజకీయాల నుంచి మంచిని మాత్రమే తీసుకుంటానన్నారు. రాజకీయం, సినిమాలకు మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండదని చెప్పారు. రాజకీయాల పరంగా బాధ్యత ఎక్కువని అభిప్రాయపడ్డారు.

రియాలిటీ షోతో... 
సరిగ్గా ఏడాది క్రితం కమల్‌హాసన్‌ రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ ఊహించలేదు. అప్పటివరకు ఆయనకు ఎవరన్నా ఆ ప్రశ్న వేసినప్పుడు తనకు రాజకీయాలు ఇష్టం లేవన్నారు. బిగ్‌బాస్‌ రియాలిటీ షో ద్వారా తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో రాజకీయ రంగం వైపు అడుగులు పడ్డాయి. ఈ క్రమంలో పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యాత్ర ప్రారంభానికి ముందుకు స్వయంగా రాష్ట్రంలోని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌, నామ్‌తమిళర్‌ కట్చి అధ్యక్షుడు సీమాన్‌, ఇతర నాయకులతో సమావేశమై అందరినీ ఆశ్చర్యపరిచారు.

రజనీ వైపు చూపు... 
కమల్‌ పార్టీ ప్రకటన పూర్తయిన నేపథ్యంలో అందరి చూపు మరో నటుడైన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌వైపు మళ్లింది. ఏకకాలంలో వెండితెరపై పోటీపడి నటించిన వీరిద్దరు అటూఇటుగా ఒకే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. సినిమాల తరహాలోనే రాజకీయాల్లోనూ వారి ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.