close
BETA SITE

కాంగ్రెస్‌లోకి నాగం జనార్దన్‌రెడ్డి! 

రెండ్రోజుల క్రితం రాహుల్‌తో భేటీ అయినట్లు సమాచారం 
అదేబాటలో కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భాజపాలో ఉన్న ఆయన..కొద్దికాలంగా ఆ పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో భాజపా నుంచి జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపీగా, ఆయన కుమారుడు నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి..ఇద్దరూ ఓడిపోయారు. అప్పటి నుంచి జనార్దన్‌రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. భాజపా కార్యక్రమాలకూ హాజరుకావడం లేదు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్‌ నుంచి సానుకూల స్పందన రావడంతో ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. తాజాగా రెండు రోజుల క్రితం దిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్‌ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు జనార్దన్‌రెడ్డిని రాహుల్‌ దగ్గరకు తీసుకువెళ్లినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు నాగం ఆసక్తి చూపిస్తున్నారని...రాహుల్‌ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు తెలిసింది. మార్చి 18 తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయి. దీనిపై నాగంను సంప్రదించగా..నియోజకవర్గంలో తన అభిమానులు కాంగ్రెస్‌ పార్టీలో చేరమని కోరుతున్నారన్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. ఇదిలాఉండగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన తెదేపా మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీత దంపతులు సైతం కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం వారిద్దరూ దిల్లీకి వెళ్లి కొప్పుల రాజును కలిశారని..గురువారం రాహుల్‌గాంధీతో సమావేశం అవుతారని తెలిసింది. గురువారం ఉదయానికల్లా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం దిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. దయాకర్‌రెడ్డి దంపతులు దేవరకద్ర, మక్తల్‌ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని, రాహుల్‌గాంధీ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే వారు కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది.
 

నేడు టీపీసీసీ సేవాదళ్‌ సదస్సు 
టీపీసీసీ సేవాదళ్‌ ఒకరోజు సదస్సును గురువారం నిర్వహిస్తున్నట్లు సేవాదళ్‌ చీఫ్‌, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు ఇందిరాభవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, తదితరులతో పాటు పార్టీ ముఖ్యనాయకులు హాజరవుతారన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.