close
BETA SITE

నిరంతర విద్యుత్తుపై రేవంత్‌ది దుష్ప్రచారం 


చర్చకు రావాలన్న బాల్క సుమన్‌, పల్లా, భానుప్రసాద్‌


ఈనాడు, హైదరాబాద్‌: ‘‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుపై రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలి. మేం ముగ్గురం వస్తాం. నువ్వు ఉత్తమ్‌, జానారెడ్డి, షబ్బీర్‌అలీలను తీసుకొని రా!  నువ్వు చెప్పిన లెక్కలు నిజమయితే మేం ముక్కు నేలకు రాస్తాం. తప్పని తేలితే నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి’’ అని  తెరాస ఎంపీ బాల్క సుమన్‌, ప్రభుత్వవిప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లు రేవంత్‌రెడ్డికి సవాల్‌ చేశారు. బుధవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి రాకతో కాంగ్రెస్‌ కార్యాలయం గోబెల్స్‌ భవన్‌గా మారిందన్నారు. విద్యుత్తు రంగాన్ని ముంచిన ఘనత కాంగ్రెస్‌దేనంటూ విద్యుత్తు కొరత, కోతలతో కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణ వచ్చాక ఈ సమస్యలన్నీ పరిష్కారమై, రాష్ట్రంలో విద్యుత్తు వెలుగులను విరజిమ్ముతోందని చెప్పారు.  ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తరఫున అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారన్నారు.
ఎక్కడికి రావాలో చెప్పండి: రేవంత్‌రెడ్డి 
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు రంగంపై బహిరంగ చర్చకు రావాలన్న తెరాస ఎంపీ బాల్క సుమన్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు తాము చర్చకు సిద్ధమని.. ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పక్షాన తనతోపాటు ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లు వస్తామన్నారు. అక్రమ వ్యాపారాలు, చీకటి విద్యుత్తు ఒప్పందాలు, అబద్ధపు ప్రచారాలన్నింటినీ బయటపెడ్తామన్నారు.బుధవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన విద్యుత్తు ఒప్పందాలు, కొనుగోళ్లు, చెల్లింపులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాలకు కేంద్రం రూ.2.20లకు విద్యుత్తు సరఫరా చేస్తామని చెప్పినా..అధిక ధరలకు ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

సంపత్‌లాంటి వారిని తెరాసలో చేర్చుకోం: గువ్వల బాలరాజు 
ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌లాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాసలో చేర్చుకునేది లేదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం చేయిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న మంత్రి హరీశ్‌రావుపై విమర్శించే అర్హత సంపత్‌కు లేదన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.