close
BETA SITE

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జాతీయ రికార్డు 


మంత్రి హరీశ్‌రావు వెల్లడి 

గజ్వేల్‌, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం రెండేళ్లలో నిర్మించి తెలంగాణ ప్రభుత్వం జాతీయ రికార్డు సృష్టించబోతోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బుధవారం నిర్వహించిన తెరాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ సాధించుకున్నామని, ఇప్పుడు అవన్నీ సాధిస్తున్నామన్నారు. రేయింబవళ్లు వేగంగా సాగుతోన్న ప్రాజెక్టు పనులు చూసి దిల్లీ ఇంజినీర్ల బృందం విస్తుపోయిందని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో అన్ని రాష్ట్రాలు ఇటువైపే చూస్తున్నాయన్నారు. గొర్రెల పంపిణీ పథకాన్ని కర్ణాటక కాంగ్రెస్‌ మంత్రి రేవణ్ణ అభినందిస్తే, హరితహారానికి దిల్లీ మంత్రి కితాబు ఇచ్చారన్నారు. గజ్వేల్‌ మండలం కోమటిబండలోని మిషన్‌భగీరథ పథకాన్ని చూసిన బిహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ ఇక్కడి అభివృద్ధిని ఎంతగానో మెచ్చుకున్నారన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు దడ మొదలైందన్నారు. 24 గంటల విద్యుత్తు ఇస్తామంటే అదో విచిత్రమేనని అసెంబ్లీలో జానారెడ్డి ఎద్దేవా చేశారని, ఇచ్చి చూపిస్తే తెరాస కార్యకర్తగా నడుస్తానని ప్రకటించారన్నారు. ప్రభుత్వం ఇప్పుడు నిరంతర విద్యుత్తు అమలు చేస్తోందని, జానారెడ్డి ప్రకటనను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ల ఛైర్మన్లు నర్సారెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి పాల్గొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.