close
BETA SITE

ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదు 

కేంద్రం చాలా హామీలను పరిష్కరించలేదు 
  ట్విట్టర్‌లో వివిధ వర్గాల ప్రశ్నలకు  మంత్రి ¸కేటీఆర్‌ జవాబులు 

ఈనాడు, హైదరాబాద్‌: తనకు ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా సంతోషంగా ఉన్నానని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గురువారం ఆయన మూడు గంటలపాటు ట్విట్టర్‌లో వివిధ వర్గాల వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పార్వతీశం అనే వ్యక్తి ‘మీలాంటి వారు తెలంగాణకే పరిమితం కావద్దు. మీలాంటి డైనమిక్‌ లీడర్‌ దేశానికి అవసరం. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలి’ అని ట్వీట్‌ చేశారు. దీనికి కేటీఆర్‌ పైవిధంగా సమాధానమిచ్చారు. కేటీఆర్‌ కేంద్ర మంత్రి పదవికి అన్ని అర్హతలున్న వ్యక్తి అని మరొకరు చెప్పగా.. తాను రాష్ట్రానికి ఎంతో చేయాల్సి ఉందని సమాధానమిచ్చారు. తనకు రాజకీయ లక్ష్యాలేవీ లేవని, అసాధ్యమనుకున్న తెలంగాణను కేసీఆర్‌ సాధించడాన్ని గర్వంగా భావిస్తానని చెప్పారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీల్లో చాలా అమలు చేయలేదన్నారు. మెట్రో రైలు, ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన నవంబరు 28 చరిత్రాత్మక దినమని చెప్పారు.
* తెలంగాణలో ఆటోమైబైల్‌ పరిశ్రమల స్థాపనకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. 
* హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఎయిమ్స్‌ ఏర్పాటుపైనా కేంద్ర మంత్రి జైట్లీ హామీ ఇచ్చారని, దానికి బడ్జెట్‌ కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. 
* కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికే పలుసార్లు తాము కేంద్రాన్ని కోరామని మరో ప్రశ్నకు జవాబిచ్చారు. 
* వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో డేటా ఎనలటిక్స్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. 
* హైదరాబాద్‌లో రహదారులకు మరమ్మతులు చేయాలని, అన్ని రోడ్లపై కాలిబాటలు (పేవ్‌మెంట్లు) ఉండాలని సందీప్‌ అభ్యర్థించారు. దీనిపై దృష్టి సారించామని, ఇప్పటికే హెదరాబాద్‌ మెట్రో కారిడార్‌లో పేవ్‌మెంట్లను నిర్మించామన్నారు. 
* త్వరలో నగరాల్లో భూరికార్డుల నవీకరణ ప్రక్రియ చేపడతామన్నారు. 
* తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌నే కాక అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది. మెట్రో రైలు పాతబస్తీకి కూడా వస్తుంది.
* ఏటా పాఠశాలలో రుసుములు పెంచుతున్నారు. మా పిల్లలకు చదువు చెప్పించగలనా లేదా అన్న సందేహం కలుగుతోంది. దీనిపై దృష్టిపెట్టాలని వీవీ శివ అనే వ్యక్తి ట్విట్టర్‌లో వాపోయారు. ఇది సమస్యేనని, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి దీనిపై దృష్టి సారించారని కేటీఆర్‌ చెప్పారు. 
నాకు అపాయింట్‌మెంట్‌ ఎప్పుడిస్తారు 
- భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌
ప్రజలందరినీ మీరు కలుస్తున్నారు.. ట్విట్టర్‌లోనూ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కలిసేందుకు నాకు ఎప్పుడు అవకాశం ఇస్తారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ట్విట్టర్‌లో కేటీఆర్‌ను ప్రశ్నించారు. త్వరలోనే కలుద్దామని కేటీఆర్‌ ఆయనకు సమాధానమిచ్చారు. 

కోహ్లి, ఒబామాలకు అభిమానిని 
* రాహుల్‌ ద్రవిడ్‌, కోహ్లి, రోహిత్‌శర్మ నేను అభిమానించే క్రికెటర్లు. 
* కేసీఆర్‌ కాకుండా నేను అధికంగా ఇష్టపడే నాయకుడు బరాక్‌ ఒబామా 
* కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండడమే నా లక్ష్యం.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.