close
BETA SITE

పెద్దల సభకు వెళ్లేదెవరో? 

ఏప్రిల్‌లో ఖాళీకానున్న రాజ్యసభ స్థానాలు అయిదు 
చిరంజీవి, రేణుక, దేవేందర్‌, సీఎం రమేష్‌, రాపోలు పదవీ విరమణ 
తెరాస, తెదేపాలకు చెరో రెండు, వైకాపాకి ఒకటి!

ఈనాడు, దిల్లీ: తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నవారిలో అయిదుగురు వచ్చే ఏప్రిల్‌ 2న పదవీ విరమణ చేయబోతున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి చిరంజీవి, రేణుకాచౌదరి, టి.దేవేందర్‌గౌడ్‌, తెలంగాణ నుంచి సీఎం రమేష్‌, రాపోలు ఆనంద భాస్కర్‌లు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో ఎంపికైన వీరిలో ముగ్గురు కాంగ్రెస్‌ వారు కాగా, ఇద్దరు తెదేపా సభ్యులు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారినందున కాంగ్రెస్‌ సభ్యులెవ్వరూ తిరిగి పెద్దల సభకు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ నుంచి తెరాస, ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెదేపా ఇద్దరేసి సభ్యులను పంపించే అవకాశాలున్నాయి. ఒక వైకాపా సభ్యుడికి అవకాశం దక్కనుంది. ఏపీలో వైకాపా నుంచి తెదేపాకు శాసనసభ్యుల వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షానికి ఆ ఒక్కటైనా దక్కుతుందా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తనను అధిష్ఠానం మళ్లీ కొనసాగిస్తుందని సీఎం రమేష్‌ నమ్ముతున్నారు. తెదేపాలోకి మరో అయిదారుగురు వైకాపా ఎమ్మెల్యేలు వలసవచ్చే అవకాశం ఉన్నందున ఏపీ నుంచి మిగిలిన రెండు స్థానాలూ తెదేపాకే దక్కుతాయని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అదే జరిగితే అందులో ఏ సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తారనే చర్చ ఎంపీల్లో ప్రారంభమైంది.
గొంతు వినిపించేనా? 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పదవికి అభ్యర్థులను ఎంపిక చేయాలన్నా సామాజిక, ప్రాంతీయ సమతూకం పాటిస్తారు కాబట్టి ఈ అంశంలో సరైన నిర్ణయం తీసుకుంటారని నేతలు నమ్ముతున్నారు. అయితే అభ్యర్థుల దక్షత కంటే సమీకరణాలకు పెద్దపీట వేస్తుండటంతో సభలో గొంతెత్తి మాట్లాడేవారు కరవవుతున్నారన్న విమర్శా వినిపిస్తోంది. రాజకీయ పరిస్థితులు, పార్లమెంటుకు వచ్చే బిల్లుల లోతుపాతులను అర్థం చేసుకొని తెదేపా తరఫున సభలో మాట్లాడేవారు ఇటీవలి కాలంలో తగ్గుతూ వస్తున్నారన్న అభిప్రాయం పార్లమెంటులో ఉంది. దీనివల్ల సంక్లిష్ట అంశాల్లో ఆ పార్టీ గొంతు గట్టిగా వినపడని పరిస్థితి నెలకొంది. ఈసారి అభ్యర్థుల ఎంపిక సమయంలో చంద్రబాబు రాజకీయ సమీకరణాలతోపాటు, అభ్యర్థుల దక్షతనూ పరిగణనలోకి తీసుకోవాలన్న వాదన వస్తోంది. ఖాళీ కాబోయే స్థానాలకు ఫిబ్రవరి చివరి వారంలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటినుంచే ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణనుంచి ఖాళీ అయ్యే రెండు స్థానాలను తెరాస సులభంగా గెలుచుకొనే అవకాశం ఉండటంతో తీవ్ర పోటీ నెలకొననుంది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.