close
BETA SITE

తాజా వార్తలు

ప్రజలారా.. మళ్లీ మోసపోకండి: విజయశాంతి

ప్రజలారా.. మళ్లీ మోసపోకండి: విజయశాంతి

మహబూబ్‌నగర్‌: తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో తెరాసకు ఓటు వేసి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి మోసపోయారని, మళ్లీ ఆయనను గెలిపించి మోసపోవద్దని కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. నాలుగున్నరేళ్ల lపాలనలో సీఎం ప్రజలను దోచుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికల్లో గెలుస్తుందని.. తద్వారా ప్రజలకు మేలు చేస్తామనుకున్నామన్నారు. ఉద్యమం నాటి కేసీఆర్‌ వేరని.. అధికారంలో ఉన్న కేసీఆర్‌ వేరని ఆమె వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో తెరాస వైపు గాలి వీచిందని, ఉద్యమంలో ఆయన పనిచేశారు గనక ఎవరు అధికారంలోకి వస్తే ఏంటి? ఆయన పాలన చూద్దామని ఇన్నాళ్లూ ఎదురుచూస్తే.. ఈ నాలుగున్నరేళ్లలో దోపిడీ చేశారని దుయ్యబట్టారు. సీఎంగా ఉండి కేసీఆర్‌ ప్రతిపక్ష నేతలపై పరుష పదజాలం వాడుతున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు.

ప్రజలు ఓట్లేసింది కేసీఆర్‌ కుటుంబం కోసం కాదని, ప్రజా సంక్షేమం కోసమన్నారు. తెలంగాణ ప్రజల అభిమానం, వారి అభివృద్ధే తమకు ముఖ్యమన్నారు. తెలంగాణరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. లోపం ఎక్కడుందని నిలదీశారు. రైతులకు చేయాల్సినంత మేలు చేయలేదు కాబట్టే వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఎన్ని తీసుకొచ్చినా రైతుల గుండెల్లో మాత్రం కేసీఆర్‌కు చోటులేదన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కాంగ్రెస్‌ తెచ్చినప్పటికీ దాన్ని సక్రమంగా విద్యార్థులకు చెల్లించడంలేదన్నారు. ఉద్యోగం వస్తే తమ తల్లిదండ్రులను పోషించుకుంటానని ఆశతో ఎదురుచూస్తున్న యువతకు కూడా నిరాశే ఎదురవుతోందని చెప్పారు. కేసీఆర్‌ పరిపాలన తనకు ఇప్పటికీ అర్థంకాలేదన్నారు. కేజీ టు పీజీ విద్య అని చెప్పి ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేయించడం ఘోరం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో కూర్చొని పాలిస్తున్నారు తప్ప ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకోవడంలేదన్నారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రజలు ప్రగతి భవన్‌కు వెళ్దామన్నా అనుమతించడంలేదని విమర్శించారు. ప్రాజెక్టులు, బతుకమ్మ చీరల విషయంలో ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారన్నారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ప్రజలు మోసపోవద్దని.. కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని విజయశాంతి ప్రజలను కోరారు.


Tags :

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

 

రాజకీయం

 

జనరల్‌

 

సినిమా

 

క్రైమ్

 

స్పోర్ట్స్

 

బిజినెస్‌

 

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు