close

తాజా వార్తలు

అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పే

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం వ్యాఖ్యలు

కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆర్థికశాఖ మాజీ మంత్రి పి. చిదంబరం మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఒకవేళ అదే జరిగి ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు తప్పదని హెచ్చరించారు. ఆర్‌బీఐ-కేంద్రం మధ్య ఇటీవల నెలకొన్న వివాదం నేపథ్యంలో చిదంబరం ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

‘ప్రభుత్వానికి ద్రవ్యలోటు భయం పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖర్చులు కోసం రూ. లక్ష కోట్లు కావాలని ప్రభుత్వం ఆర్‌బీఐని డిమాండ్‌ చేసింది. అంత డబ్బు ఇచ్చేందుకు కేంద్ర బ్యాంకు గవర్నర్‌ నిరాకరించడంతో ఆయనపై ఇంతకుముందు ఎన్నడూ విధించని నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అంటే బలవంతంగా ఆర్‌బీఐ గవర్నర్‌ నుంచి డబ్బు తీసుకోవాలని చూస్తోంది. అయినా కూడా గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ తన మాట మీదే నిలబడతారని ఆశిస్తున్నా’ అని చిదంబరం అన్నారు.

ఇలాంటి సమయంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ముందు రెండే రెండు మార్గాలున్నాయని.. అయితే కేంద్రానికి డబ్బులు ఇవ్వాలి లేదా రాజీనామా చేయాలి అని చిదంబరం అన్నారు. ఈ రెండింటిలో ఏది జరిగినా దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ విపత్తు తప్పదని ఆయన హెచ్చరించారు. అంతేగాక.. ఆర్‌బీఐ బోర్డులో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి మద్దతు పలికేవారేనని చిదంబరం ఈ సందర్భంగా ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్నవారినే ప్రభుత్వం ఆర్‌బీఐ బోర్డులో కూర్చోబెట్టిందని.. తద్వారా సమావేశాల్లో తమ ప్రతిపాదనలను నెగ్గించుకోవాలని కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు.

 


తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు