close
BETA SITE

తాజావార్తలు

భారత్‌కు తీవ్ర ముప్పు.. రాఫెల్‌ ఎంతో అవసరం

వాయు సేనాధిపతి బీఎస్‌ ధనోవా

భారత్‌కు తీవ్ర ముప్పు.. రాఫెల్‌ ఎంతో అవసరం

దిల్లీ: భారత్‌కు తీవ్ర ముప్పు ఉందని, దాన్ని ఎదుర్కొనేందుకు రాఫెల్‌ లాంటి యుద్ధ విమానాలు ఎంతో అవసరం అని అంటున్నారు వాయు సేనాధిపతి మార్షల్‌ బీఎస్‌ ధనోవా. ప్రత్యర్థి దేశాలకు అనుగుణంగా మన దేశ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చెప్పారు. ‘భారత వైమానిక దళం ఫోర్స్‌ స్ట్రక్చర్‌ 2035’ సెమినార్‌లో పాల్గొన్న ధనోవా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఈ ప్రపంచంలో ఏ దేశమూ భారత్‌ స్థాయిలో ముప్పును ఎదుర్కోవట్లేదు. మన పొరుగుదేశాలు ఖాళీగా కూర్చోవట్లేదు. చైనా లాంటి దేశాలు తమ వాయుసేనను ప్రాధాన్యతానుసారంగా ఆధునీకరిస్తున్నాయి. ప్రత్యర్థుల ఉద్దేశాలు రాత్రికి రాత్రే మారుతుంటాయి. వాటి సాయుధ బలాన్ని అంచనా వేసి దాన్ని ఎదుర్కొనే విధంగా మన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ధనోవా తెలిపారు.

ఈ సందర్భంగా రాఫెల్‌ ఒప్పందం గురించి కూడా ధనోవా ప్రస్తావించారు. వాయుసేన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకే ప్రభుత్వం రాఫెల్‌ యుద్ధ విమానాలు, ఎస్‌-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తోందని తెలిపారు.

రాఫెల్‌ ఒప్పందంపై గత కొంతకాలంగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంతో ధనోవా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్‌ నుంచి 36 యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చ ఏడాది నుంచి ఈ విమానాలను ఫ్రాన్స్.. భారత్‌కు అందించనుంది. అయితే ఈ ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీన్ని బయటపెట్టాలని గత కొంతకాలంగా కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వంపై భారీ స్థాయిలో విమర్శలు చేస్తోంది.