close
BETA SITE

తాజావార్తలు

ఆహా.. ఓహో.. హైదరాబాద్‌ ఆతిథ్యం

ప్రతిష్ఠాత్మక ప్రపంచ స్థాయి సదస్సులకు వేదిక‌
ఈనాడు.నెట్‌ ప్రత్యేకం

ఆహా.. ఓహో.. హైదరాబాద్‌ ఆతిథ్యం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో రాజధాని హైదరాబాద్‌ విశ్వనగరిగా మారేందుకు వడివడిగా అడుగులు వేసింది. వివిధ అంతర్జాతీయ, జాతీయ మహా సభలు, సదస్సులకు ఆతిథ్యమిచ్చింది. తన అద్వితీయ వైవిధ్యంతో ఆకట్టుకుంది. అతిథుల మదిలో చిరస్మరణీయ ముద్ర వేసింది. ఇక ప్రపంచ తెలుగు మహా సభలు, అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు, ప్రపంచ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సులను అంగరంగ వైభవంగా నిర్వహించి అంతర్జాతీయ యవనికపై తెలంగాణ సత్తా చాటి చెప్పింది.

జిలుగు వెలుగుల తెలుగు సభలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సభలివి. 2017 డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు అంగరంగ వైభవంగా ఈ సాహితీ వేడుక జరిగింది. 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, 42 దేశాలు, తెలంగాణలోని 31 జిల్లాల నుంచి 8 వేల మంది ప్రతినిధులు ఈ మహా యజ్ఞంలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. రోజూ 20 చొప్పున జరిగిన సదస్సులకు భాషాభిమానులు పోటెత్తారు. సినిమా, రాజకీయ సభలను మించి సాహిత్య ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. తొలి రోజు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఈ సభలను ప్రారంభించారు. ముగింపు సభలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అథితిగా హాజరయ్యారు. తెలుగు ప్రముఖులను స్మరిస్తూ.. ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అంటూ అచ్చ తెలుగు పదాలతో సాగిన ఆయన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక మహా సభల్లో నిర్వహించిన పద్య, గద్య సాహితీ సదస్సులు, చర్చలు, అవధానాలు, వాదాలు, సంవాదాలు అందరినీ అలరించాయి. ప్రతినిధుల ప్రసంగాలు కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. తెలుగు వారి అక్షర వైభవాన్ని చాటిచెప్పాయి. నోరూరించే తెలుగు వంటకాల గురించి ఇంక చెప్పేదేముంది. అతిథులకు కల్పించిన మౌలిక, వసతి సదుపాయాలు అత్యద్భుతం.

ఆహా.. ఓహో.. హైదరాబాద్‌ ఆతిథ్యం

అతివకు అగ్ర తాంబూలం.. జీఈఎస్‌ 17
‘అతివకు అగ్ర తాంబూలం.. అందరికీ సంపద’ నినాదంతో జరిగిన అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల శిఖరాగ్ర సదస్సుకు హైదరాబాద్‌ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. 2017 డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు జరిగిన ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ప్రారంభించారు. మోదీ, ఇవాంక ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఈ సదస్సు జరగడం ప్రత్యేకం. ప్రపంచ దేశాల పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు ఒకే చోట చేరతారనే ఉద్దేశంలో హైదరాబాద్‌ నగరం పెట్టుబడులకు అనుకూలమని చాటి చెప్పేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేసింది. దాదాపు 1500 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సుకు 10,400 మంది భద్రతా సిబ్బంది పనిచేశారు. ఇందులో పాల్గొన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్లో 30 ఏళ్లు అంతకన్నా తక్కువ వయసున్న వారే 31.5 శాతం. ఇక మహిళల శాతం 52.5. అఫ్గానిస్థాన్‌, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ తదితర 10 దేశాలు పూర్తిగా మహిళా ప్రతినిధులనే పంపించాయి. మొత్తం 150 దేశాల నుంచి ప్రతినిధులు రాగా అందులో 127 దేశాల బృందాల్లో మహిళా పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు ఉన్నారు. ‘ముత్యాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో మీరే (యువ వాణిజ్యవేత్తలు) సంపద.. స్వాప్నికులు, సృజన శీలురు, వాణిజ్యవేత్తలు, అకుంఠిత దీక్షా దక్షతలున్న నాయకులు’ అని ఇంవాంక చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మరెన్నో సదస్సులకు హైదరాబాద్‌ ఆతిథ్యమిచ్చింది.

ఆహా.. ఓహో.. హైదరాబాద్‌ ఆతిథ్యం

పురస్కారాల వెల్లువ
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవడం విశేషం. ఎక్కువగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకే ఇవి దక్కడం గమనార్హం. బెంగళూరులో 2015లో జరిగిన ఓ కార్యక్రమంలో లైఫ్‌స్టైల్‌ మ్యాగజైన్‌ రిట్జ్‌-సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ ‘అత్యంత స్ఫూర్తిదాయక ఈ ఏటి మేటి వ్యక్తి’ పురస్కారాన్ని కేటీఆర్‌ స్వీకరించారు. స్కోచ్‌ 49వ సదస్సులో 2017కు గాను ‘ఈ ఏడాది ఉత్తమ ఐటీ మంత్రి’గా పురస్కారం అందుకున్నారు. ఇక బిజినెస్‌ వరల్డ్‌ మీడియా సంస్థ కేటీఆర్‌కు లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారానికి ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారతీయ ఆహార, వ్యవసాయ మండలి నాయకత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఆయనను విధాన నాయకత్వ విభాగం కింద ఎంపిక చేసింది. సీఎం కంటి చికిత్స నేపథ్యంలో ఈ పురస్కారాన్ని వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్వీకరించారు.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.