close
BETA SITE

తాజావార్తలు

గురుద్వారా నుంచి వార‌సుడొచ్చాడు...

గురుద్వారా నుంచి వార‌సుడొచ్చాడు...

అది 2012.. దిల్లీలోని ప్రముఖ క్రికెట్‌ అకాడమీలో క్రికెట్‌ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. అందులో పద్నాలుగేళ్ల తమ కొడుకును చేర్పించాలని దాదాపు 200 కి.మీ దూరం నుంచి ఓ కుటుంబం వచ్చింది. ఆ శిబిరంలో ఆ కుర్రాడికి చోటైతే దక్కింది. కానీ ఎక్కడ బస చేయాలి? ఆ కుర్రాడికి తోడెవరుండాలి? దిల్లీలో అద్దె ఇల్లు తీసుకుని ఉందామంటే ఆర్థిక స్థోమత సరిపోదు. మరేం చేయాలి..?

అప్పుడా కుటుంబానికి కనిపించిన ఆశ.. గురుద్వారా. ఆ కుటుంబం పరిస్థితి చూసి అక్కడ ఆశ్రయమిస్తే.. అక్కడే బస చేస్తూ అకాడమీలో శిక్షణ సాగించాడా కుర్రాడు. తల్లి కూడా గురుద్వారాలో ఉంటూ భక్తుల సేవకు అంకితమైతే.. అతనేమో తండ్రి కలలకు ప్రాణం పోసేందుకు శ్రమించాడు.

2018 ఐపీఎల్‌..  సన్‌రైజర్స్‌తో దిల్లీ మ్యాచ్‌. బలమైన బౌలింగ్‌ దళంగా పేరున్న సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ను తుత్తినియలు చేస్తూ ఓ ఆటగాడు రెచ్చిపోయాడు. చూస్తుండగానే ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు  చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా  రికార్డు సృష్టించాడు.

పై రెండు సందర్భాల్లో ప్రస్తావించింది ఒకరి గురించే. అతనే ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో   అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న యువ సంచలనం రిషబ్‌ పంత్‌

ఓవైపు ధనాధన్‌ బ్యాటింగ్‌.. మరోవైపు వికెట్ల వెనుక చురుకైన కీపింగ్‌తో భారత క్రికెట్‌ భవిష్యత్‌ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు 20 ఏళ్ల రిషబ్‌ పంత్‌. కెరీర్‌ చరమాంకంలో ఉన్న మహేంద్ర సింగ్‌ ధోనికి ఇతనే సరైన వారసుడన్నది విశ్లేషకుల మాట. ధోని ఉండగానే అతడికి పోటీ ఇచ్చే ఆట ఆడుతున్న పంత్‌.. అతను వీడ్కోలు చెప్పిన తర్వాత ఆ స్థానాన్ని కచ్చితంగా భర్తీ చేయగలడన్న అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి. గురుద్వారాలో ఉంటూ క్రికెట్‌ శిక్షణ తీసుకుని ప్రస్తుత స్థాయికి చేరే క్రమంలో

పంత్‌ జీవితంలో ఎన్నో మలుపులు.. 
పంత్‌ స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ గ్రామం. పంత్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్‌ అంటే పిచ్చి. అతని ఆసక్తిని గమనించిన తండ్రి ప్రోత్సహించాడు. అతడిని క్రికెటర్‌ను చేయడం కోసం కష్టపడ్డాడు. పద్నాలుగేళ్ల వయసులో దిల్లీలో ప్రముఖ క్రికెట్‌ అకాడమీ సొన్నెట్‌లో శిక్షణ కోసం పంత్‌ను తీసుకెళ్లాడు. ఆర్థిక స్థితి సహకరించని నేపథ్యంలో తెలిసినవాళ్ల సూచన మేరకు కొడుకును గురుద్వారాలో చేర్పించాడు. అతడికి తోడు కోసం భార్యను కూడా అక్కడే ఉంచాడు. పంత్‌ పగలు అకాడమీలో శిక్షణ తీసుకుంటూ.. రాత్రుల్లో గురుద్వారాలో గడిపేవాడు. ఇలా కొన్నాళ్ల సాధన తర్వాత పంత్‌ ఆటలో ప్రతిభ చూపించాడు. దిల్లీ వాతావరణం కూడా అలవాటైంది. భయం పోయింది. దీంతో అతడి తల్లి తమ గ్రామానికి వెళ్లిపోయింది. ఆటగాడిగా కూడా అవకాశాలు రావడంతో పంత్‌ దిల్లీలో గది అద్దెకు తీసుకొని సాధన సాగించాడు. అండర్‌-14, అండర్‌-16 విభాగాల్లో రాజస్థాన్‌ తరపున ఆడిన పంత్‌.. దిల్లీ నుంచి రూర్కీకి అక్కడి నుంచి రాజస్థాన్‌కు ఇలా తిరుగుతుండేవాడు. తర్వాత రంజీల్లో దిల్లీ తరపున ఆడే అవకాశం రావడంతో రిషబ్‌ దశ తిరిగింది. అండర్‌-19 ప్రపంచకప్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.

ఆ బాధను దిగమింగి: గత ఏడాది ఐపీఎల్‌ సీజన్లో పంత్‌ దిల్లీ తరపున ఆడిన సంగతి తెలిసిందే. అయితే సీజన్‌ మధ్యలో వాళ్ల నాన్న రాజేంద్ర పంత్‌ చనిపోయాడు. ఈ విషయం తెలిసి కుంగిపోయిన పంత్‌ తండ్రి అంత్యక్రియలకు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత బెంగళూరుతో దిల్లీ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. తండ్రి చనిపోయిన బాధకు తోడు అనారోగ్యంతో శస్త్రచికిత్స చేసుకొని మంచాన పడ్డ తల్లి పరిస్థితి కూడా అతడిని కుంగదీసింది. అయితే తను పెద్ద క్రికెటర్‌ అయితే చూడాలన్న నాన్న మాటలను గుర్తుకు తెచ్చుకున్నాడు. తన తండ్రి కలలను నిజం చేసేందుకు బాధను దిగమింగుకున్నాడు. బెంగళూరుతో మ్యాచ్‌ ఆడాడు. 57 పరుగులతో సత్తాచాటి ఆ ఇన్నింగ్స్‌ను తండ్రికి అంకితమిచ్చాడు.

మన

మిస్టర్‌ 360.. దక్షిణాఫ్రికా మేటి బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ను అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు. పంత్‌ను ‘భారత మిస్టర్‌ 360’ అనొచ్చు. ఈ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో.. ముఖ్యంగా సన్‌రైజర్స్‌తో పోరులో పంత్‌ విశ్వరూపాన్ని చూశాక కలిగిన అభిప్రాయమిది. ఆ మ్యాచ్‌లో మైదానం నలు వైపులా పరుగులు రాబడుతూ అతను సాగించిన విధ్వంసం అలాంటిలాంటిది కాదు. చివరి ఓవర్లలో ఉత్తమ బౌలర్‌గా చెప్పుకొనే భువనేశ్వర్‌ బౌలింగ్‌ను ఊచకోత కోసిన తీరును ఎవరు మర్చిపోగలరు? మిస్టరీ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న రషీద్‌ను అనామక బౌలర్‌గా మారుస్తూ అతను కొనసాగించిన పరుగుల దండయాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏబీ లాగే వినూత్న షాట్లతో విస్మయపరిచాడు పంత్‌. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో అద్భుత రీతిలో చెలరేగిన రిషబ్‌.. 14 మ్యాచ్‌ల్లో 173.60 స్ట్రైక్‌రేట్‌తో 684 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాక అత్యధిక వ్యక్తిగత స్కోరు (128 నాటౌట్‌), అత్యధిక సిక్సర్లు (37), అత్యధిక ఫోర్లు (68) రికార్డులు అతని పేరు మీదే ఉన్నాయి.

శైలి వీరూది.. వారసత్వం ధోనీది

కొట్టే వీలున్న ప్రతి బంతినీ బాదాలనే ఆలోచనతో బ్యాటింగ్‌ చేసేవాళ్లలో ముందు వీరేంద్ర సెహ్వాగ్‌ పేరు గుర్తుకొస్తుంది. ఢిల్లీకే ఆడుతున్న పంత్‌ కూడా అదే తరహా. మొదట్నుంచి అతడి ఆట దూకుడుగానే ఉండేది. డిఫెన్స్‌ ఆడడం కంటే బంతిని బాదడమే ఇష్టం. 2016 రంజీ సీజన్లో దిల్లీ తరపున ఆడిన పంత్‌ ఝార్ఖండ్‌పై 48 బంతుల్లోనే శతకం బాది రంజీల్లో అత్యంత వేగంగా శతకం చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అదే ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌లో పంత్‌ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఆ ప్రపంచకప్‌లో నేపాల్‌పై 18 బంతుల్లోనే అర్ధశతకం బాది టోర్నీ చరిత్రలోనే అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో అతడి దూకుడెలా సాగిందో తెలిసిందే. మునుపటితో పోలిస్తే నిలకడ సాధించడం పంత్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే అవకాశాల్ని బాగా మెరుగుపరిచింది. కొన్నాళ్ల కిందటి వరకు భారత జట్టులో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ధోని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అన్న సందిగ్ధత ఉండేది. పంత్‌ ఇటీవలి ఆట చూశాక ఆ సందిగ్ధతకు తెరపడ్డట్లే కనిపిస్తోంది. వికెట్‌ కీపింగ్‌లోనూ పంత్‌ సత్తా చాటుకున్నాడు. వికెట్ల వెనుకు చురుకుదనం చూపించాడు. ధోని ఉండగానే అతడికి పోటీ ఇచ్చే స్థాయికి చేరాడు పంత్‌. ధోని వచ్చే ఏడాది ప్రపంచకప్‌ వరకు కొనసాగేలాగే ఉన్నాడు. అతడికి తోడుగా పంత్‌ రిజర్వ్‌ వికెట్‌ కీపర్‌గా ఎంపికవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈలోపు పంత్‌ ఇదే నిలకడ కొనసాగిస్తే అతడికి గ్లవ్స్‌ అప్పగించి ధోని నిష్క్రమించొచ్చు!


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.