close
BETA SITE

తాజావార్తలు

చివరికి మిగిలింది... కటకటాలు.. కన్నీళ్లు! 

ఉపాధ్యాయుడి హత్య కేసులో ఇద్దరి అరెస్టు 
భార్య, ఆమె ప్రియుడే నిందితులు 

క్షణిక సుఖం మాయలో చిక్కుకోవడంతో ఓ ఇల్లాలి గాజుల చేతికి బేడీలు పడ్డాయి. పసుపు కుంకుమలు పణంగా పెట్టి.. కట్టుకున్న భర్తను కర్కషంగా కడతేర్చడంలో ప్రధాన పాత్ర పోషించి.. ఇద్దరు కుమారుల జీవితాలను గాలికి వదిలి.. నేడు ఆమె కటకటాల పాలైంది. మాతృదినోత్సవం రోజునే ఈ తల్లి ఇలా చట్టం ముందు నిందితురాలిగా నిల్చోవడం బాధాకరం!
ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు... తనకు నిక్షేపంలా భార్య, ఇద్దరు పిల్లలున్నా... పరాయి స్త్రీ ఆకర్షణకు లోనై.. వివాహేతర సంబంధం ఉచ్చులో చిక్కి.. ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసి చట్టం ముందు నేడు నిందితుడిగా నిల్చున్నాడు. కట్టుకున్న భార్య, పిల్లలను సమాజంలో తలెత్తుకు తిరగనీయకుండా చేశాడు. ఇతడి తప్పిదానికి ఓ వ్యక్తి ప్రాణం, నలుగురు పిల్లల జీవితాలు, ఇద్దరు మహిళల బతుకులు బలయ్యాయి.

బంగారుపాళ్యం: బంగారుపాళ్యం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వడ్డివానిచెరువు సమీపంలో తవణంపల్లె మండలం చెర్లోపల్లెకు చెందిన ఉపాధ్యాయుడు వాసుదేవన్‌(36)ను శనివారం సుమోతో ఢీకొట్టి ఆర్‌ఎంపీ వైద్యుడు రమేష్‌(44) హతమార్చిన విషయం పాఠకులకు విధితమే. ఈ కేసులో నిందితులు చిత్తూరు తేనెబండకు చెందిన రమేష్‌, హతుడు ఉపాధ్యాయుని భార్య రమాదేవి(32)ని ఆదివారం అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ చౌడేశ్వరి చెప్పారు. ఆమె కథనం మేరకు వివరాలు... తవణంపల్లె మండలం చెర్లోపల్లెకు చెందిన వాసుదేవన్‌ కొత్తూరు గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇతని భార్య రమాదేవి, నిందితుడు రమేష్‌కు సంవత్సరకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు తన భార్యతో వివాహేతర సంబంధం వదులుకోవాలని రమేష్‌ను హెచ్చరించాడు. అయినా నిందితుడు ఖాతరు చేయలేదు. దీంతో ఉపాధ్యాయుడు నిందితుడి భార్యకు ఈ విషయాన్ని తెలియ చేశాడు. ఈ క్రమంలో మూడునెలలుగా రమేష్‌, రమాదేవి కలుసుకోకుండా కట్టుదిట్టం చేశారు.

అడ్డు తొలగించుకోవాలని... 
తమ ఆనందానికి అడ్డు పడుతున్న వాసుదేవన్‌ను ఎలాగైనా హతమార్చి, ఆ తర్వాత తాము పెళ్లి చేసుకోవాలని రమేష్‌, రమాదేవి నిర్ణయించుకున్నారు. అదును కోసం వేచి చూశారు. శనివారం వాసుదేవన్‌ బంగారుపాళ్యం మండలంలోని బేరిపల్లెలో చెల్లెలు ఇంటికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై పయనం అయ్యాడు. ఈ పక్కా సమాచారాన్ని హతుడి భార్య రమాదేవి తన ప్రియుడు రమేష్‌కు తెలిపింది. ఇదే సరైన సమయంగా భావించిన నిందితుడు రమేష్‌ వడ్డివానిచెరువు మార్గంలో సుమోతో కాపు కాశాడు. ఉపాధ్యాయుడు దగ్గరకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఎదురెళ్లి ఢీ కొట్టాడు. ఉపాధ్యాయుడు గాయాలకు గురై.. పారిపోయి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు మళ్లీ వాహనంతో ఢీ కొట్టాడు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు వాసుదేవన్‌ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు రమేష్‌, రమాదేవి పారిపోయి పెళ్లి చేసుకొనేందుకు ఆదివారం కేజీ సత్రం బస్టాండు వద్ద వేచి ఉండగా పలమనేరు రూరల్‌ సీఐ మధుసూదనరావు అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పలమనేరు రూరల్‌ సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.