close
BETA SITE

తాజావార్తలు

సరస్వతి చెప్పిందనే హత్య చేయించా.. 

పోలీసుల విచారణలో వెల్లడించిన ప్రియుడు శివ 
బెంగుళూరులోనే హతమార్చేందుకు మరో గ్యాంగ్‌తో ఒప్పందం 

సరస్వతి చెప్పిందనే హత్య చేయించా.. 

విజయనగరం: నవ వరుడు యామక గౌరీశంకర్‌ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సరస్వతి ప్రియుడు మడ్డు శివ అలియాస్‌ ఆది పోలీసులకు పట్టుబడటంతో నివ్వెరపోయే ఘటనలు వెల్లడయ్యాయి. ఈ మేరకు వివరాలను ఎస్పీ జి.పాలరాజు ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 7న గరుగుబిల్లి మండలం ఐటీడీఏ పార్కు సమీపంలో నవ వరుడు గౌరీశంకర్‌ హత్యకు గురయ్యాడు. ఇందులో ఆయన భార్య సరస్వతితో పాటు విశాఖపట్నంకు చెందిన మరో నలుగురి (సుపారి గ్యాంగ్‌)ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోగా, తాజాగా ప్రధాన సూత్రధారి సరస్వతి ప్రియుడు శివను కూడా అరెస్టు చేశారు. విజయవాడలో తలదాచుకున్న ఇతడ్ని మరో చోటికి వెళ్లిపోయే ప్రయత్నంలో ఉంటుండగా పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. ఆరా తీస్తున్న కొద్ది ఏ తరహాలో పథకం రచించారో ఊహకందడం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరింత లోతుగా విచారిస్తే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, అందరినీ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ పి.సౌమ్యలత, సీఐలు రాంబాబు, రామకృష్ణ, మోహన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.
పథకం ఏమిటంటే..? 
లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్లకు దూరమైపోతాం..పైగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని, గౌరీశంకర్‌నే అడ్డు తొలగిస్తే సరిపోతుందని నిర్ణయించుకున్నారు. సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దింపి మనమే చంపించేసి ఆ నెపం దారి దోపిడీ దొంగలపై తోసేస్తే అందరూ నమ్మేస్తారని అనుకున్నారు. అందుకు అనువైన ప్రదేశం తోటపల్లి జలాశయానికి వెళ్లే నిర్మానుష్య ప్రాంతమైతే బాగుంటుందనుకున్నారు. హత్య అనంతరం కొద్ది రోజుల తరువాత మానవతా హృదయంతో వితంతువును వివాహమాడటానికి వచ్చిన యుగ పురుషుడుగా మా ఇంటికి వస్తావు. ఇంట్లో వారిని కలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పిస్తావు, పైగా ఇద్దరిది ఒకే కులం కాబట్టి, బాధల్లో ఉన్నందున అడ్డు చెప్పే పరిస్థితి ఉండదని సరస్వతి ప్రియుడికు వివరించింది.


బెంగళూరులోనే చంపేస్తే 
వాస్తవానికి గౌరీశంకర్‌ను బెంగుళూరులో ఉంటుండగానే చంపేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడైతే ఎవరికీ ఎటువంటి అనుమానం రాదన్న ఆలోచనతో బెంగుళూరులో ఒక ముఠాకు రూ.25 వేలు డబ్బులు అడ్వాన్సుగా ఇచ్చారు. అయితే హంతక ముఠా చంపడం దేనికని, మీరిద్దరూ పారిపోయి వెళ్లి పోతే సరిపోతుంది కదా అని చెప్పినా సరస్వతి, శివ అందుకు అంగీకరించలేదు. మీ వల్ల కాకపోతే చెప్పండి.. వేరే వాళ్లతో మాట్లాడుకుంటామని అనడంతో సరేనని ఒప్పుకున్నారు. బెంగుళూరులో హత్య చేద్దామని ప్రయత్నించినా కుదరకపోవడంతో శ్రీకాకుళంగాని, విజయనగరంలోగాని లేపేస్తామని ముఠా హామీ ఇచ్చింది. తీరా వాళ్లు వారి చరవాణిలు స్విచ్ఛాప్‌ చేసేయడంతో, విశాఖపట్నంలో మరో గ్యాంగ్‌ను కలిసి వారితో పథకాన్ని అమలు చేయించారు.
ఫేస్‌బుక్‌లో  పరిచయం 
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలానికి చెందిన సరస్వతి విద్యాభ్యాసం (బీఎస్సీ) నిమిత్తం 2016లో విశాఖపట్నం వెళ్లింది. అక్కడ రోలుగుంటకు చెందిన ఫొటోగ్రాఫర్‌ మడ్డు శివతో ముఖపుస్తకంలో (ఫేస్‌బుక్‌)లో పరిచయం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి తిరిగారు. ఇంతలో సరస్వతికి తన గ్రామానికి చెందిన వరుసకు మేనమామ అయిన యామక గౌరీశంకర్‌తో పెళ్లి ఖాయమైంది. ఈయన కర్నాటకలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గౌరీశంకర్‌ను పెళ్లి చేసుకోవడం సరస్వతికి ఇష్టం లేదు. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పింది. ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందామంటే వద్దని, తనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. హత్యకు పథకాన్ని రచించి వివరించింది. దాని అమలుకు ఆర్థికపరమైన సాయంతో పాటు నేర చరిత్ర ఉన్న వారితో మాట్లాడే బాధ్యత శివ తీసుకున్నాడు. గతంలో మరొక అమ్మాయిని ప్రేమించిన శివ ఆమెను ఇంటికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు చూపించగా, వాళ్లు మందలించడంతో ఆమెను వదిలేశాడు. ఆ తరువాత సరస్వతి పరిచయమైంది.

వారం రోజుల ముందే 
గౌరీశంకర్‌ను హత్య చేయడానికి వారం రోజుల ముందే శివ పార్వతీపురం చేరుకున్నాడు. గుమ్మలక్ష్మిపురంలో వివాహం ఉందని, వెళ్తున్నాని చెప్పి బయలుదేరి వచ్చేశాడు. సుపారీ గ్యాంగ్‌తో ఎప్పటికప్పుడు హత్యకు సంబంధించిన పథకాన్ని వివరిస్తూ వచ్చాడు. 7వ తేదీ రాత్రి గౌరీశంకర్‌ని మరికొద్దిసేపులో లేపేస్తారనుకునే సమయానికి పార్వతీపురం నుంచి బయలుదేరి అనకాపల్లి వెళ్లిపోయాడు.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.