close
BETA SITE

రూపాయే 

బక్కచిక్కిన రూపాయి! 
ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి  ముడిచమురు ధరలు, వాణిజ్య భయాలే కారణం

ముంబయి: రూపాయి మారకపు విలువ అంతకంతకూ తగ్గిపోతోంది. డాలర్‌తో పోలిస్తే, ఈ పతనం ఇంకా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆగస్టు 1న అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 68.43 స్థాయి వద్ద ఉండేది. సోమవారం ఇది 71.21 కి చేరింది. ఇప్పటివరకు రూపాయికి ఇదే అత్యంత కనిష్ఠస్థాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి మారకపు విలువ దాదాపు 10 శాతం క్షీణించగా, అందులో 4 శాతం ఒక్క ఆగస్టులోనే పడిపోవడం గమనార్హం. వర్థమాన మార్కెట్ల కరెన్సీలు బలహీన పడుతున్నందున, మన రూపాయి కూడా అదే బాటలో నడుస్తోందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఎందుకిలా..?: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటం, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, టర్కీ, అర్జెంటీనా దేశాల కరెన్సీలు దారుణంగా పతనమవడం వంటి అంశాలు మన విదేశీ మారకపు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే మన దేశానికి ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. వాణిజ్యలోటు, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం పెరిగేందుకు రూపాయి పతనం పరోక్షంగా దోహదపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏమవుతుంది?: రూపాయి క్షీణతతో దిగుమతులు భారమవుతాయి. చమురు, పసిడి దిగుమతుల వ్యయాలు పెరిగితే, దేశ వాణిజ్య లోటు అధికమవుతుంది. దిగుమతుల కోసం విదేశీ మారకపు నిల్వలను అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో, కరెంటు ఖాతా లోటు కూడా పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు, చదువుల ఖర్చులు భారమవుతాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో రవాణా వ్యయాలు పెరిగి సరకులు ప్రియమవుతాయి. అప్పుడు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో పారిశ్రామిక ప్రగతిపై నీలినీడలు కమ్ముకుంటాయి. పరోక్షంగా ఇది దేశ అభివృద్ధిని అడ్డుకుంటుంది. దీంతోపాటు డాలర్‌ బలపడుతున్నందున, విదేశీ మదుపర్లు దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తే, ఈక్విటీ మార్కెట్లు నష్టపోతాయి.

ఎగుమతుల వృద్ధిని అన్ని వేళలా పెంచదు: ఈఈపీసీ 
రూపాయి బలహీన పడితే, ఎగుమతులు పెరుగుతాయని భావిస్తుంటారు. అయితే అన్ని వేళలా ఇది జరగదని ఇంజినీరింగ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఈఈపీసీ) అభిప్రాయపడింది. జులైలో రూపాయి మారకపు విలువ 6.56 శాతం పతనమైనా, ఎగుమతుల్లో వృద్ధి 9.4 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో ఇది 14.17 శాతంగా నమోదైంది. ఆ నెలలో రూపాయి 5.19 శాతం పతనమైంది. అంటే రూపాయి విలువ క్షీణించినా, జులైలో ఎగుమతుల్లో వృద్ధి పెరగలేదని ఈఈపీసీ వివరించింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.