close
BETA SITE

నిజాం మ్యూజియంలో భారీ చోరీ 

వజ్రాలతో కూడిన బంగారు టిఫిన్‌ బాక్స్‌ మాయం 
బంగారు చెంచా.. కప్పు సాసరూ అపహరణ 
తాడుతో గ్యాలరీలోకి ప్రవేశించి దొంగతనం 

ఈనాడు, హైదరాబాద్‌ -న్యూస్‌టుడే, చార్మినార్‌: నగరంలో దొంగలు తెగబడుతున్నారు. గృహాలు.. కార్యాలయాలు.. ఏటీఎంలు.. ఇలా ఎక్కడపడితే అక్కడ యథేచ్ఛగా దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేసి నిజాం కాలం నాటి సువర్ణ, వజ్ర ఖచిత పురాతన వస్తువులను దొంగిలించారు. ఈ ఘటన పలువురిని నివ్వెరపోయేలా చేసింది.  దుండగులు ఎంతో పక్కాగా, సీసీ కెమెరాలకు చిక్కకుండా చోరీకి పాల్పడ్డారు. 
హైదరాబాద్‌ పాతబస్తీలోని పురానీహవేలి మస్రత్‌ మహల్‌లోని నిజాం మ్యూజియంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి మ్యూజియంలోకి చొరబడి పురాతన కళాఖండాల్ని అపహరించారు. సుమారు రెండు కిలోల బరువుతో వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్‌ బాక్స్‌, చెంచా, కప్పుసాసరును ఎత్తుకెళ్లారు. చోరీ అయినవి పురాతన వస్తువులు కావడంతో వీటి విలువ రూ.కోట్లలోనే ఉంటుందని భావిస్తున్నారు. దుండగులు మ్యూజియం మొదటి అంతస్తులోని వెంటిలేటర్‌ ఇనుప కడ్డీలను తొలగించి లోపలికి ప్రవేశించారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సుమారు 20 అడుగుల తాడు సహాయంతో లోపలికి దిగి చోరీ పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

సీసీ కెమెరాలకు చిక్కకుండా.. 
మ్యూజియం భద్రతను గ్రూపులైన్‌ సంస్థకు చెందిన ఎనిమిది మంది భద్రతాసిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. పగలు ముగ్గురు, రాత్రి అయిదుగురు కాపలాగా ఉంటారు. ఎప్పటిమాదిరిగానే ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు మ్యూజియానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం మ్యూజియం గ్యాలరీ తలుపు తెరిచేసరికి విలువైన వస్తువులు కనిపించలేదు. గ్యాలరీ వెంటిలేటర్‌ నుంచి తాడు వేలాడుతూ కనిపించింది. దీన్ని గమనించిన భద్రతాసిబ్బంది ఎతేషామ్‌, రజ్వీ, ఫరీద్‌, లియాకత్‌.. మ్యూజియం పరిపాలనాధికారి షౌకత్‌కు విషయాన్ని తెలిపారు. షౌకత్‌ విషయాన్ని మ్యూజియం పెవిలియన్‌ ట్రస్టు కార్యదర్శి రఫత్‌ హుస్సేన్‌కు చెప్పడంతో ఆయన సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మ్యూజియం లోపల పది సీసీ కెమెరాలున్నాయి. ఒక కెమెరాలో మాత్రం దుండగుడు తచ్చాడిన దృశ్యం నమోదైంది. అతడి వీపు మాత్రమే కనిపిస్తుండటంతో స్పష్టత లేకుండా పోయింది. ఇతనికి 25-30 మధ్య వయస్సుంటుందని గుర్తించారు. మరోవైపు దుండగులు సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మ్యూజియం సమీపంలో వెంటిలేటర్‌ను చిత్రీకరించేలా ఉన్న కెమెరా దిశను దుండగులు మార్చేశారు. వెంటిలేటర్‌ నుంచి లోపలికి దిగే క్రమంలో దుండగుడు సీసీ కెమెరా పైనే కాలు వేయడంతో అది ధ్వంసమైంది.

పది బృందాలతో వేట 
చోరీ విషయం తెలిసిన వెంటనే నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఘటనాస్థలికి చేరుకున్నారు. సుమారు 2 గంటలపాటు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఘటనపై ఆరా తీశారు. పది బృందాలతో వేట సాగిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. డబీర్‌పురా, మలక్‌పేట రైల్వేస్టేషన్‌ నుంచి పారిపోయి ఉంటారా? అని పరిశీలించారు. ఘటనపై ఆలస్యంగా సమాచారం అందించడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మ్యూజియానికి సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా దుండగులకు అందించి ఉంటారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

చివరి నిజాం బహుమతుల ప్రదర్శన 
నిజాం మ్యూజియం చార్మినార్‌ సమీపంలోని పురానీహవేలిలో ఉంది. గతంలో ఇది నిజాంల ప్యాలెస్‌గా ఉండేది. అనంతరం నిజాం ట్రస్టు ఆధ్వర్యంలో 2000 ఫిబ్రవరి 18న మ్యూజియంగా మార్చారు. చివరి నిజాం మిర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహుదూర్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు 1936లో జరిగాయి. ఆ సమయంలో నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌లోని జూబ్లీహాలులో సామంతులు, నవాబులు ఆయనకు విలువైన బహమతులను అందించారు. వాటిని ఈ మ్యూజియంలో ప్రస్తుతం ప్రదర్శనకు ఉంచారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.