close
BETA SITE

జనగణనకు కసరత్తు 

పటాల తయారీ, ఆన్‌లైన్‌ నమోదుకు 2019 డిసెంబరు వరకూ గడువు 
2020లో ఇళ్లు, భవనాల లెక్కింపు 
కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు 
ఈనాడు - హైదరాబాద్‌ 

దేశవ్యాప్తంగా 2020-21 జనగణనకు ప్రాథమిక కసరత్తు మొదలయ్యింది. ప్రతీ గ్రామం, మండలం లేదా తాలుకా, జిల్లా జనగణన పటాలను సిద్ధం చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలిచ్చింది. వీటి ఆన్‌లైన్‌ నమోదుకు 2019 డిసెంబరు 31 గడువుగా నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన రెవెన్యూ గ్రామాల వారీగా జనాభా లెక్కల సేకరణ పరిధిని నిర్ణయిస్తారు. ప్రతీ 120 నుంచి 150 ఇళ్లకు ఒక గణకుడిని నియమించేలా పటాన్ని సిద్ధం చేయాలి. ప్రతీ పదేళ్లకో మారు కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో జన గణన జరుగుతుంది. ఈసారి వెనుకబడిన కులాల(బీసీ) వివరాలను సేకరించాలని కేంద్రం యోచిస్తోంది. దీనివల్ల సేకరణ వివరాలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా. ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ కులాల వివరాలనే తీసుకుంటున్నారు. 2020-21 జనగణనకు ఇప్పటి నుంచే  తెలుగు రాష్ట్రాల్లో పనులు ప్రారంభించారు.

తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా..:  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే జనగణన సంచాలకుల కార్యాలయం ఉంది. రెండు రాష్ట్రాలకు ఈ కార్యాలయ అంతర్గత విభజన పూర్తిచేసినా ఇంకా ఆదేశాలు రానందున కలిసే పనిచేస్తున్నారు. రెండు రాష్ట్రాలకు విడివిడిగా లెక్కలు సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని హైదరాబాద్‌ జనాభా లెక్కల సంచాలకుల కార్యాలయం ఇటీవల కేంద్ర హోంశాఖను కోరింది.

జనగణన పరిధి ఇలా ... 
ప్రతీ మండలం లేదా తాలుకా స్థాయిలో ఉండే తహసీల్దార్‌ను జనగణన అధికారిగా నిర్ణయిస్తారు. ఆ అధికారి పరిధిలో ఉండే రెవెన్యూ గ్రామాల పటాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. ప్రతీ 120 నుంచి 150 ఇళ్లకు ఒక గణకుడు, ప్రతీ ఆరేడు గణకులపై ఒక పర్యవేక్షకుడిని నియమిస్తారు. ఈ పనులు చేయడానికి ఉపాధ్యాయులను ఎక్కువగా వినియోగిస్తారు. వీరి గుర్తింపు వివరాలను సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని యోచిస్తున్నారు.

రెండు దశల్లో... 
జనగణన రెండు దశలుగా ఉంటుంది. తొలుత 2020 ఆరంభంలో ఇళ్లు, భవనాలు, ఇతర కట్టడాల వివరాలన్నీ సేకరిస్తారు. వీటిలో ప్రజలు నివసిస్తున్న ఇళ్లు ఎన్ని, ఖాళీగా ఉన్నవి ఎన్ని, ఇల్లు/కార్యాలయంగా కలిపి వాడుతున్నవి ఎన్ని, వాణిజ్య కట్టడాలెన్ని తదతర వివరాలన్నిటినీ సమగ్రంగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ లెక్కలన్నీ పక్కాగా తేలిన తరవాత అసలు అంకం ప్రజల వివరాలను సేకరించడం. ప్రతీ కుటుంబం, ప్రతీ వ్యక్తి వివరాలు వేర్వేరుగా సేకరిస్తారు.

సీఆర్‌ఎస్‌ అంటే... 
తెలుగు రాష్ట్రాల్లో 2016 ఆఖరునాటికే 8.85 కోట్లకు పైగా జనాభా ఉన్నట్లు పౌర నమోదు వ్యవస్థ(సీఆర్‌ఎస్‌) ద్వారా తేలింది. దేశంలో ప్రతీ జననం, మరణాన్ని అధికారికంగా నమోదు చేయడాన్ని సీఆర్‌ఎస్‌గా పిలుస్తారు. దీనిద్వారా ఏటా ఎంత జనాభా అదనంగా పెరుగుతోంది, నికరంగా ఎంత అనే ప్రాథమిక వివరాలను వెల్లడిస్తారు. 2021 ఏప్రిల్‌ తరవాత అధికారికంగా ప్రతీ ఒక్కరి వ్యక్తిగత వివరాలతో జనాభా లెక్కలు సేకరిస్తారు. అప్పటికి దేశ జనాభా 130 కోట్లకు, తెలుగు రాష్ట్రాల జనాభా 10 కోట్లకు చేరువలో ఉంటుందని అధికార వర్గాల అంచనా. ఆధునిక సమాచార సాంకేతిక (ఐటీ) పరిజ్ఞానాన్ని వినియోగించి జనాభా లెక్కల వివరాలను త్వరగా వెల్లడించాలని కేంద్రం సూచించింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.