close
BETA SITE

6న ముందస్తు కేబినెట్‌! 

చర్చించాల్సిన అంశాలేమిటో చెప్పండి 
అన్ని శాఖలకు సీఎస్‌ ఆదేశాలు 
శాసనసభ రద్దుకు సిఫార్సు 
చేయవచ్చని తెరాస వర్గాల అంచనా 
ఉద్యోగుల మధ్యంతరభృతిపై నేడో రేపో నిర్ణయం 
ఈనాడు - హైదరాబాద్‌ 

తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఈ నెల 6న నిర్వహించే అవకాశం ఉంది. కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒకసారి, శాసనసభను రద్దు చేసే తీర్మానం చేయడానికి ఇంకోసారి మంత్రిమండలి  సమావేశం కానుందని ప్రచారం జరిగినా.. చివరికి ఒక సమావేశమే ఉండొచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఆదివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ, రెండు, మూడు రోజుల్లో మళ్లీ సమావేశమవుదామని మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి.. మంత్రిమండలిలో చర్చించాల్సిన అంశాలపై మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలలోగా సమాచారం అందించాలంటూ అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులను ఆదేశించారు. నాలుగో తేదీ సాయంత్రం మళ్లీ సమావేశం జరగవచ్చని ప్రచారం జరిగినా భేటీ లేదని ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఉద్యోగులకు మధ్యంతర భృతి అంశం ప్రధానమైంది. దీనికి మంత్రిమండలి ఆమోదం అవసరం లేదని, ప్రభుత్వం ఉత్తర్వు (జీవో) జారీ చేయవచ్చని అధికారవర్గాలు అంటున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ 5వ తేదీన ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే అదే రోజు ఐఆర్‌ ఉత్తర్వు జారీ అయ్యే వీలుంది. ఐఆర్‌ అంశం తేలిపోయాక 6న మంత్రిమండలి సమావేశంలో దాన్ని ఆమోదించే అవకాశం ఉంది. అదే రోజు శాసనసభ రద్దుకు సిఫార్సు చేయవచ్చని తెరాస ఉన్నతస్థాయి వర్గాలు భావిస్తున్నాయి.

భృతిపై ఉద్యోగ సంఘాల ఆశలు 
ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణ నేపథ్యంలో మధ్యంతర భృతి(ఐఆర్‌)పై రాష్ట్ర సర్కారు కసరత్తును వేగవంతం చేసింది. ఒకటి రెండ్రోజుల్లో మధ్యంతర భృతిని ప్రకటించే అవకాశాలున్నాయని ఉద్యోగవర్గాలు భావిస్తున్నాయి. ఐఆర్‌ కనీసం 25 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఎంత శాతం ఇస్తే ఏ మేరకు వ్యయం అవుతుందనే అంశంపై ఆర్థిక శాఖ గణాంకాలు సిద్ధం చేసింది. ఒక శాతం ఇస్తే ఏడాదికి సుమారు రూ.265 కోట్లు అదనంగా వ్యయం అవుతుందని ఆర్థికశాఖ విశ్లేషించింది. వివిధ శాతాలతో గణాంకాలను ప్రభుత్వానికి అందజేసింది. మధ్యంతర భృతి కనీస మొత్తం 25 శాతంగా ఉంటుందని భావిస్తుండగా గతంలో పదో పీఆర్సీ 27 శాతం ఇచ్చిందనే అంశాన్ని ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే వార్తలతో మధ్యంతర భృతి అంచనాలకు మించి ఉంటుందని కొన్ని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అతి త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుదని భావిస్తున్నారు. అంతకుముందే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశమై చర్చిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.