close
BETA SITE

రెండంకెల వృద్ధి 

అదే ఇప్పుడు మన ముందున్న సవాల్‌ 
ఆ దిశగా చర్యలు చేపడతాం 
  సమాఖ్య స్ఫూర్తితో సహకారాత్మక అడుగు 
  రాష్ట్రాలకు ఈ ఏడాది రూ. 11 లక్షల కోట్లు 
  జమిలి ఎన్నికలే ఉత్తమం 
  నీతి ఆయోగ్‌ భేటీలో ప్రధాని నరేంద్రమోదీ 

భారత జట్టు (టీమ్‌ ఇండియా)గా సంక్షిష్ట సమస్యలకు పరిష్కారం చూపడంలో నీతి ఆయోగ్‌ కీలకపాత్ర పోషిస్తోంది. సహకార స్ఫూర్తి, పోటీతో కూడిన సమాఖ్య తత్వంతో ఒకే జట్టుగా ముందడుగు వేద్దాం. లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలనే ప్రతిపాదనపై సమగ్ర చర్చ అవసరం. జమిలి ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుంది. వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ పెట్టుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీనిని మార్చడానికి రాష్ట్రాలు తగిన విధానాలను రూపొందించాలి. భారత ఆర్థిక రంగం అతి త్వరగా 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలని ప్రపంచం ఆశిస్తోంది.

- నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ

దిల్లీ

దేశ ఆర్థిక వృద్ధి రేటును రెండంకెలకు తీసుకువెళ్లడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాల్‌ అనీ, దీని కోసం అనేక ముఖ్యమైన చర్యలు చేపట్టనున్నామనీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగో సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2017-18 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో భారత ఆర్థిక రంగం- ఆరోగ్యకరమైన రీతిలో 7.7% వృద్ధిని సాధించిందనీ, దీనిని ఇక రెండంకెలకు చేర్చడమే మిగిలిందని ప్రారంభోపన్యాసంలో ప్రధాని చెప్పారు. 2022 నాటికి సరికొత్త భారతావనిని తీర్చిదిద్దటానికి కొన్ని ముఖ్యమైన చర్యలు అవసరమవుతాయన్నారు. దేశాభివృద్ధిలో చరిత్రాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు పాలకమండలి ఒక వేదికగా నిలుస్తుందని చెప్పారు. వరద బాధిత రాష్ట్రాలకు కేంద్రం బాసటగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సహకార స్ఫూర్తి, పోటీతో కూడిన సమాఖ్య తత్వంతో ఒకే జట్టుగా ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు. జీఎస్టీ సజావుగా అమల్లోకి రావడం దీనికొక ఉదాహరణ అని చెప్పారు. స్వచ్ఛభారత్‌, డిజిటల్‌ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో ముఖ్యమంత్రులతో వేసిన ఉప బృందాలు, ఉప సంఘాలు కీలక భూమిక పోషించి, విధానాల రూపకల్పనకు దోహదపడ్డాయని కొనియాడారు. ఈ బృందాలు చేసిన సిఫార్సుల్ని వివిధ మంత్రిత్వ శాఖలు అమల్లోకి తెస్తున్నాయని చెప్పారు.

వనరులకేమీ లోటు లేదు 
ఆయుష్మాన్‌ భారత్‌ కింద దేశంలో 1.5 లక్షల ఆరోగ్య/ స్వస్థత (వెల్‌నెస్‌) కేంద్రాలను నిర్మిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఏటా రూ.5 లక్షల పరిమితితో దాదాపు 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. సమగ్ర శిక్షా అభియాన్‌ పేరుతో విద్యారంగం కోసం ఒక దృక్పథంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ‘ముద్రా యోజన, జన్‌ధన్‌ యోజన, స్టాండప్‌ ఇండియా వంటి పథకాలు పెద్దస్థాయిలో ఆర్థిక సమ్మిళితానికి దోహదపడుతున్నాయి. ఆర్థిక అసమానతలను సరిచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మానవ అభివృద్ధి ప్రామాణికాలను 115 ఆశావహ జిల్లాల్లో మెరుగుపరచాలి. పథకాల అమలుకు సరికొత్త ఆదర్శంగా గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ నిలుస్తుండడంతో దీనిని ఆశావహ జిల్లాల్లోని 45 వేల గ్రామాలకు విస్తరించాం. దక్షత, సామర్థ్యం, వనరుల పరంగా మనకెంత మాత్రం లోటు లేదు. మునుపటి సర్కారు హయాంలో చివరి ఏడాది రాష్ట్రాలకు వచ్చిన మొత్తం కంటే రూ.6 లక్షల కోట్లు ఎక్కువగా- రూ.11 లక్షల కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇవ్వబోతున్నాం’ అని మోదీ వివరించారు.

ఏకకాల ఎన్నికలపై చర్చ జరగాలి 
లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలనే ప్రతిపాదనపై సమగ్ర చర్చ అవసరమని మోదీ మరోసారి అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుందనీ, వనరుల సమర్థ వినియోగానికి వీలుంటుందనీ చెప్పారు. సాయంత్రం సమావేశ ముగింపు సందర్భంగానూ మోదీ ప్రసంగించారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక నివాసాలు, వీధి దీపాల్లో ఎల్‌ఈడీ బల్బులను వాడాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనలను మున్ముందు విధాన నిర్ణయాల సమయంలో తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రాలు ప్రస్తావించిన అంశాలపై కార్యాచరణ గురించి మూడు నెలల్లో అనుశీలన చేయాలని నీతిఆయోగ్‌కు సూచించారు. జాతిపిత 150వ జయంతి నాటికి సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని సాధించాలని కూడా ప్రధాని పిలుపునిచ్చారు. సరళతర వ్యాపార నిర్వహణకు పెద్దపీట వేసేలా రాష్ట్రాలతో ఒక సమావేశాన్ని నిర్వహించాలని నీతి ఆయోగ్‌కు సూచించారు. 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక లెఫ్టినెంట్‌ గవర్నర్‌, పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒడిశా, జమ్ముకశ్మీర్‌, దిల్లీ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాలేదు.

ఏపీ హామీలను నెరవేరుస్తాం: ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తు.చ. తప్పకుండా పాటిస్తామని ఈ సమావేశంలో ప్రధాని హామీ ఇచ్చినట్లు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2022 నాటికి నవభారత్‌ను తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని ఒక పత్రాన్ని రూపొందిస్తామని చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.