close
BETA SITE

పూత పూస్తే వాతే! 

చలువ చేస్తుందని స్టెరాయిడ్‌ పూతమందుల వాడకం 
విచ్చలవిడి వాడకంతో దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు 
ఫంగస్‌, బ్యాక్టీరియాలకూ సొంత వైద్యం 
నేరుగా ఔషధ దుకాణాల నుంచి కొనుగోలు 
నవంబరు 1 నుంచి నేరుగా కొనుగోళ్లు నిషేధం 
కేంద్రం ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: దురదగా ఉందని నేరుగా ఔషధ దుకాణాలకెళ్లి పూతమందును కొనుగోలు చేయడం ఇకనుంచి చెల్లుబాటు కాదు. వచ్చే నవంబరు 1వతేదీ నుంచి వైద్యుల చీటీరాత లేకుండా వీటిని అమ్మడానికి వీల్లేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఫంగస్‌, బ్యాక్టీరియాలకు వినియోగించే పూత మందుల్లో హానికారక ‘స్టెరాయిడ్‌’ ఉంటుందనీ, విచ్చలవిడి వాడకం వల్ల దీర్ఘకాలంలో అనర్థాలు జరిగే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం తాజాగా ‘గెజిట్‌ ప్రకటన’ వెలువరించింది. ఫలానా పూతమందు వాడితే మేని ఛాయ పెరుగుతుందనీ, ఫలానా లేపనాన్ని రాసుకుంటే ముఖవర్ఛస్సులో మార్పు కనిపిస్తుందని ప్రకటనలొస్తుంటాయి. ఎండాకాలంలో బయటకు వెళ్లేముందు కొన్ని రకాల పూతమందుల్ని వినియోగిస్తే.. చలువ చేస్తుందనీ, ముఖం నల్లబడకుండా కాపాడుతుందని ప్రకటనల్లో చెబుతుంటారు. దురదతో బాధపడుతున్నారా? ఈ పూతమందు వాడితే ఉపశమనం కలుగుతుందనీ ప్రకటనలు గుప్పిస్తుంటారు. వీటిల్లో కొంత వాస్తవం ఉంటుంది. కానీ వివిధ కారణాలతో లేపనాలను పూసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకీ తాజా ఆదేశాలు?: కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వినియోగించాల్సిన సాధారణ ఔషధాల జాబితాను ప్రకటించి, వాటి ధరలను 2013లో నిర్ణయించింది. అప్పట్లో ‘బీటా మిథజోన్‌ డై ప్రొపియోనేట్‌’తో కూడిన పూతమందును దురదకు వినియోగించేవారు. ఈ ఔషధంలోనూ స్టెరాయిడ్‌ ఉన్నా.. తక్కువ మోతాదులో ఉండటం వల్ల ఎక్కువ హానికరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ ధరల స్థిరీకరణలో దురద కోసం వినియోగించే ఈ ఔషధానికి గరిష్ఠ చిల్లరధరను రూ.10గా నిర్ణయించడంతో.. ఇది ఔషధఉత్పత్తిసంస్థలకు ఎక్కువ లాభసాటిగా లేకుండా పోయిందనేది నిపుణుల విశ్లేషణ. ఈక్రమంలో ఔషధ ఉత్పత్తి సంస్థలు దురద కోసం ‘క్లో బిటోజాల్‌ ప్రొపియోనేట్‌’ అనే ఔషధంతో కూడిన పూతమందును విపణిలోకి ప్రవేశపెట్టాయి. దీనిధర రూ.50-60వరకూ నిర్ణయించాయి. ఇందులో స్టెరాయిడ్‌ మోతాదు అధికంగా ఉందని నిపుణులుగుర్తించారు. అప్పటివరకూ పూతమందును ‘షెడ్యూల్‌-హెచ్‌’ పరిధిలోకి తీసుకురాలేదు. దేశం మొత్తమ్మీద ఏటా రూ.500-600 కోట్ల మేర పూతమందుల వ్యాపారం జరుగుతుందని అంచనా.

ఏమిటీ నష్టం? 

* స్టెరాయిడ్‌ ఎక్కువగా ఉన్న పూతమందు, లేపనాలను వినియోగించడం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది. చర్మం పలుచబడుతుంది. పులిచారికల్లా ఏర్పడతాయి. కొందరిలో మొటిమలు వస్తాయి.
* ఫంగస్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి తువ్వాళ్లు, దుప్పట్లు వంటి వాటిని వాడటం ద్వారా వ్యాపిస్తాయి. 
* గతంలో చిన్నపిల్లల్లో ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చేవి కావు. ఇటీవల వారిలోనూ విజృంభిస్తున్నాయి. పిల్లల ఎదుగుదలపై దుష్ప్రభావం చూపుతుంది.

* రెండు మూడు వారాల్లో తగ్గే ఇన్‌ఫెక్షన్లకు మూణ్నాలుగు నెలలు ఔషధాలను వినియోగించాల్సి వస్తుంది. 
* కంట్లో నీటికాసుల వ్యాధి వస్తుంది.

డబ్బాపైనే ముద్రించాలి 

కేంద్రం ఇటీవలే ఆదేశాలిచ్చినా.. ఉత్పత్తి సంస్థల విజ్ఞప్తి మేరకు అక్టోబరు 31 వరకూ వాటికి గడువిచ్చాయి. వచ్చే నవంబరు 1 నుంచి వైద్యుల సూచనలు, చీటిరాత లేకుండా స్టెరాయిడ్‌తో కూడిన పూతమందులను విక్రయించడానికి వీల్లేదు. ఇలాచేస్తే చట్టరీత్యా నేరమవుతుంది. ఉత్పత్తి సంస్థలు ఔషధ డబ్బాపైనే ప్రముఖంగా కనిపించేలా ఎర్రరంగుతో ఈ విషయాన్ని ముద్రించాలి. ప్రకటనలు ఇవ్వకూడదు. 
-డాక్టర్‌ రజిత, చర్మవ్యాధి నిపుణులు
విచ్చలవిడి వాడకంతో అనర్థాలు 

స్టెరాయిడ్‌తో కూడిన పూతమందుల్ని విచ్చలవిడిగా వాడడం వల్ల నష్టమే ఎక్కువ. ఈ విషయంపై అఖిల భారత స్థాయిలో మా సంఘం తరఫున పోరాడాం. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. చివరకు న్యాయస్థానానికి విన్నవించాం. ముందుగాసుప్రీంకోర్టులోకేసు దాఖలు చేయగా.. ఇలాంటి కేసు దిల్లీ హైకోర్టులో నడుస్తుండటంతో.. అక్కడికి బదిలీచేశారు. వైద్యుల చీటిరాత లేకుండా స్టెరాయిడ్‌ పూతమందుల్ని విక్రయించకూడదనే మా వినతిని న్యాయస్థానం సమ్మతించింది.
-డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, చర్మవ్యాధి నిపుణులు

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.