close

ప్ర‌త్యేక క‌థ‌నం

విశ్వసనీయత కోసం.. వస్తోంది వీవీప్యాట్‌ 

అనుమానాలన్నింటికీ విరుగుడు! 
అపోహలన్నింటికీ సమాధానం!!

ఓటు ఎవరికేశామో తెలిసేందుకు ఈవీఎంలకు అనుసంధానంగా కొత్త యంత్రం 
తొలిగా ప్రస్తుత 5 రాష్ట్రాల ఎన్నికల్లో అమలు 
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

నిన్నమొన్నటి వరకూ.. ఎన్నికలంటే పెద్ద ప్రహసనం. పెద్ద బ్యాలెట్‌ పేపరు.. దానిమీద బోలెడన్ని గుర్తులు.. వాటి మీద ఓటు ముద్రవేసి, మడతేసి పెట్టెలో వేయటం.. మళ్లీ అవన్నీ తెరిచి.. గంటల తరబడి లెక్కేయటం.. ఇదో సుదీర్ఘ తతంగం! దశాబ్దాల ఈ ఇబ్బందులకు విరుగుడుగా అందుబాటులోకి వచ్చిందే అత్యాధునిక ఈవీఎం!  ఓట్ల ప్రక్రియ మొత్తాన్నీ సులభతరం చేసి, క్షణాల్లో ఫలితాలు చెప్పేసే ఈ యంత్రం.. ఎన్నికల రంగంలో పెను విప్లవం! అయినా కూడా ఈ యంత్రాల మీద తరచూ అనుమానాలు. పార్టీల నుంచి ప్రజల వరకూ వీటిపై ఎన్నో అపోహలు. అందుకే ఈ యంత్రాలపై నమ్మకంతో ఓటు వేసుకునేందుకు వీలుగా సరి కొత్తగా మన ముందుకొస్తోంది.. వీవీప్యాట్‌! వేసిన ఓటు.. మనం అనుకున్న పార్టీకే పడిందా? లేదా? అన్నది సెకన్లలో చూసుకుని, కచ్చితంగా ధ్రువీకరించుకునే వీలుండటమే ఈ యంత్రం ప్రత్యేకత! 

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం.. సంక్షిప్త రూపంలో ఈవీఎం. ఎన్నికల్లో పోలింగ్‌ నుంచి లెక్కింపు వరకు మొత్తం ప్రక్రియను ఎంత సులభతరం చేసిందో.. అంతేస్థాయిలో ఈ యంత్రం చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. 1984లో కేరళ శాసనసభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా ఈవీఎంలను వినియోగించింది. ఆశించిన ఫలితాలు రావడంతో క్రమేపి ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 2004 ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలను వినియోగించారు. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వీటి పనితీరుపై పలు రాజకీయ పార్టీలు అపనమ్మకాన్ని వ్యక్తం చేశాయి. నాలుగు నెలల కిందట జరిగిన గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో సైతం రాజకీయపార్టీలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం సందేహాలు లేవనెత్తాయి. ఈ యంత్రాలను ట్యాంపరింగ్‌ చేయవచ్చని కొందరు అంటారు. మరికొందరేమో ఏ పార్టీకి ఓటు వేసినా.. ఆ ఒక్క పార్టీకే ఓట్లు పడుతున్నాయంటారు. అసలు ఈవీఎంలే వద్దు.. మళ్లీ బ్యాలెట్‌ పేపర్‌ విధానానికి వెళ్లిపోవాలంటాయి కొన్ని పార్టీలు. వీటన్నింటికి ముగింపు పలికేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయోగించిన అస్త్రమే వీవీప్యాట్‌ (ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌). ఈ యంత్రాలను బెంగళూరుకు చెందిన బెల్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ నిపుణులు తయారు చేశారు. ఓటు వేసిన తర్వాత ఆ ఓటు మనం వేసిన పార్టీకే పడిందా లేదా అనేది కాగితం ముక్క మీద చూసుకునే సౌలభ్యం ఉండడమే ఈ యంత్రం ప్రత్యేకత. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా వీటిని వినియోగిస్తున్నారు. ఓటింగ్‌ ప్రక్రియలో మొత్తం మూడు యంత్రాలు ఒకదానితో ఒకటి అనుంసధానమై పనిచేస్తాయి. అవి కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌,  వీవీప్యాట్‌.

ఎం-3 కంట్రోల్‌ యూనిట్‌ 
ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఎం-3 శ్రేణికి చెందిన కంట్రోల్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎం-2 శ్రేణికి చెందినవి వాడారు. వీటికి కేవలం నాలుగు బ్యాలెట్‌ యూనిట్లను మాత్రమే అనుసంధానం చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఎం-3 శ్రేణికి 24 బ్యాలెట్‌ యూనిట్లను అనుసంధానం చేయవచ్చు. దీని వల్ల పోటీలో ఎంత ఎక్కువ మంది ఉన్నా పెద్ద ఇబ్బంది ఉండదు.

పదిహేను గుర్తులతో బ్యాలెట్‌ 
ఎన్నికల్లో వినియోగిస్తున్న బ్యాలెట్‌ యూనిట్‌లో పదిహేను గుర్తులతో పాటు అదనంగా నోటా మీట ఉంటుంది. 2004 ఎన్నికల నుంచి దీనినే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వాటిలో అభ్యర్థుల ఫొటోను సైతం పొందుపరిచే ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతా సరిచూశాకే పోలింగ్‌ 
ముందుగా కంట్రోల్‌ యూనిట్‌కు బ్యాలెట్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ను అనుసంధానం చేస్తారు. తర్వాత కంట్రోల్‌ యూనిట్‌ను ఆన్‌ చేస్తారు. ఆ తర్వాత బ్యాలెట్‌ యూనిట్‌ను, వీవీప్యాట్‌ యంత్రాలను ఆన్‌ చేస్తారు. ఇదంతా పోలింగ్‌ కేంద్రం ఏజెంట్ల సమక్షంలోనే జరుగుతుంది. అప్పుడు నమూనా పోలింగ్‌ నిర్వహించి అంతా సరిగా ఉందని నిర్ధరించిన తర్వాతే ఓటింగ్‌ ప్రారంభిస్తారు.

ఓటింగ్‌ విధానం 
ఓటరు మొదటగా బ్యాలెట్‌ యూనిట్‌లో తనకు నచ్చిన గుర్తుకు ఓటు వేస్తారు. తర్వాత తాను ఏ గుర్తుకు ఓటు వేశానో వీవీప్యాట్‌లో కనిపించిన కాగితాన్ని చూసి నిర్ధరించుకుంటారు. తరువాత కాగితం దానిలోనే పడిపోతుంది. అనంతరం ఎప్పుడైనా యంత్రం పనితీరుపై అభ్యర్థి అనుమానం వ్యక్తం చేస్తే న్యాయస్థానం అనుమతితో ఆ కాగితపు ముక్కలను కూడా లెక్కించే సౌలభ్యం ఉండటం ఈ విధానం ప్రత్యేకత.

యంత్రమూ సరిచూసుకుంటుంది 

కంట్రోల్‌ యూనిట్‌ ద్వారా బ్యాలెట్‌ యూనిట్‌కు అనుసంధానం చేసి.. వీవీప్యాట్‌ను ఆన్‌ చేయగానే మొదటగా దానికదే కొన్ని స్వీయ పరీక్షలు (సెల్ఫ్‌ చెకింగ్‌) చేసుకుంటుంది. ఈ పరీక్షలు 5 రకాలుగా ఉంటాయి. ఓటు నిర్ధరణ కాగితం ముక్క పొడవు, కాగితం కనిపించే సమయం, గుర్తు ముద్రణ, ముద్రణకు వినియోగించే రంగులు, బ్యాటరీ సామర్థ్యం.. వీటన్నింటినీ వీవీప్యాట్‌ స్వయంగా తనిఖీ చేసుకుంటుంది. 

ఆషామాషీ ఫిర్యాదులకు జైలే

‘‘ఈవీఎంలో ఏ మీట నొక్కినా ఒక పార్టీకే ఓటు పడుతోంది’’ 
ఇటీవలి కాలంలో ఎన్నికల వేళ ఈ తరహా ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇలాంటి అనుమానాలకు చెక్‌ చెప్పడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం నూతనంగా వీవీప్యాట్‌లను తీసుకొచ్చింది. ఇకపై ఎవరైనా ఓటరు పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు వస్తూ తాను ఫలానా పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడిందని ఫిర్యాదు చేస్తే వెంటనే పోలింగ్‌ను నిలిపివేస్తారు. పార్టీల ఏజెంట్ల సమక్షంలో ప్రిసైడింగ్‌ అధికారి ఒక ఓటు వేసి పరీక్షిస్తారు. అది సక్రమంగానే ఉందని తేలితే ఫిర్యాదులో వాస్తవం లేదని నిర్ధరణకు వస్తారు. పోలింగ్‌ను కొనసాగిస్తారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తారు. ఒకవేళ ఫిర్యాదు నిజమేనని తేలితే ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా దీనిపై నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైతే అక్కడ మరో రోజు రీపోలింగ్‌ నిర్వహించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

తప్పనిసరిగా నమూనా పోలింగ్‌ 
సాధారణంగా పోలింగ్‌ ప్రారంభానికి ముందు పార్టీ ఏజెంట్ల సమక్షంలో నమూనా పోలింగ్‌ నిర్వహిస్తారు. చాలా చోట్ల ఈ ప్రక్రియ నామమాత్రంగానే జరుగుతోంది. ఈసారి వీవీప్యాట్‌లు ఉన్నందున పక్కాగా నమూనా పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలో తప్పనిసరిగా 50 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా పడ్డాయా లేదా అన్నది అధికారులు పరిశీలిస్తారు. అంతా సక్రమంగానే ఉంటేనే పోలింగ్‌ ప్రారంభిస్తారు.

- ఈనాడు సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

 

మరిన్ని

జిల్లా వార్తలు
Ad Space

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.