close
BETA SITE

ప్ర‌త్యేక క‌థ‌నం

పిల్లల చోదన.. పెద్దలకు వేదనే! 

వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు పాల్పడుతున్న మైనర్లపై ట్రాఫిక్‌ పోలీసుల నజర్‌ 
ఇటీవల నలుగురు తండ్రులకు జైలు శిక్ష 

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘వాహనాలు నడుపుతూ మైనర్లు పోలీసులకు దొరికిపోతే వారిపై కేసు నమోదు చేయడంతోపాటు తల్లిదండ్రులు(వాహన యజమాని) జైలుకు వెళ్లాల్సి వస్తుంది’’ అని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. హెచ్చరికలతో వదిలిపెట్టకుండా కోర్టులో వారిపై అభియోగపత్రాలను నమోదు చేస్తున్నారు. న్యాయస్థానం పోలీసుల నివేదికలకు పరిశీలించి తల్లి లేదా తండ్రికి జైలు శిక్ష విధిస్తోంది. గత పదిహేను రోజుల వ్యవధిలో నలుగురు తండ్రులకు ఇలా జైలు శిక్ష పడింది. హైదరాబాద్‌లో మైనర్‌ డ్రైవింగ్‌ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు, చోదక అనుమతి లేకుండా వాహనాలు నడిపేవారిని పట్టుకునేందుకు భవిష్యత్తులో ప్రత్యేక డ్రైవ్‌లు సైతం నిర్వహించనున్నారు.

ప్రేమ.. కడుపుకోత.. 
పిల్లలపై ప్రేమతో తల్లిదండ్రులు వారికి కొత్త వాహనాలు కొనిస్తున్నారు. కొందరైతే మైనర్లకే ఖరీదైన స్పోర్ట్స్‌బైకులు, కార్లను ఇస్తున్నారు. వీరిలో చాలా మంది ప్రమాదకరంగా వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్నారు. ఒకరు, ఇద్దరు మాత్రమే వెళ్లే బైక్‌లపై ముగ్గురు, నలుగురు వెళ్తున్నారు. వేగంగా వెళ్లే క్రమంలో నియంత్రణ కోల్పోయి రహదారులపై పడిపోతున్నారు. ఇక కార్లు నడిపే యువకుల్లో చాలా మందికి జాతీయ రహదారులపై ఎలా నడపాలో తెలియదు. తాత్కాలిక ఆనందం కోసం తల్లిదండ్రులు మైనర్లకు ఇచ్చే ఇలాంటి బహుమతులు వారికి కడుపుకోత మిగుల్చుతున్న సందర్భాలు అనేకం.

మత్తు.. రేసులు.. 
రాజధానిలో ఖరీదైన బైకులు, కార్లున్న మైనర్లలో 60 శాతం మంది వారాంతాల్లో మద్యం పార్టీలు చేసుకుంటున్నారని పోలీసుల పరిశీలనలో తేలింది. అర్ధరాత్రి దాటాక మత్తులోనే వాహనాలను నడుపుకొంటూ ఇళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపై ప్రమాదాలు చేస్తున్నారు. మరికొందరు మైనర్లు అర్ధరాత్రి వేళల్లో రేసుల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకూ 2257 కేసులు నమోదయ్యాయి.

మైనర్లను జువైనల్‌ హోంకు పంపుతాం 
- ఎ.వి.రంగనాథ్‌, డీసీపీ ట్రాఫిక్‌ 
వాహనచోదక అనుమతుల్లేకుండా మైనర్లు కార్లు, బైకులు నడుపుతున్నారు. మైనర్‌ వాహనాన్ని నడిపితే అతడితో పాటు తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేస్తున్నాం. కొద్దిరోజుల వ్యవధిలో బహదూర్‌పురా, ఎన్‌ఎండీసీ ప్రాంతాల్లో మైనర్‌ డ్రైవింగ్‌ వల్ల ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఈ అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లి చట్టపరిధిలో శిక్షలు విధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాం. మా అభ్యర్థనను మన్నించి మేజిస్ట్రేట్‌లు శిక్షలు విధిస్తున్నారు. మైనర్లు రెండోసారి పట్టుబడితే జువైనల్‌ హోంలకు తరలించనున్నాం.

మరిన్ని

జిల్లా వార్తలు
Ad Space

దేవ‌తార్చ‌న

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.