close
BETA SITE

సంపాదకీయం

ఆరోగ్య భారతావనికి భరోసా?

ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అంటూ పిన్నలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం భారతీయ సంస్కృతి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుచేల సంతతి పోగుపడి ఉన్న ఇండియాలో- ఆత్మీయుల ఆసుపత్రి ఖర్చులు భరించలేక కోట్ల మంది ఏటా దుర్భర పేదరికంలోకి జారిపోతున్న దురవస్థ దశాబ్దాలుగా దేశాన్ని కుంగదీస్తోంది. ఆరోగ్య బీమాసేవలు దాదాపు పాతిక శాతం జనావళికే పరిమితమైన దశలో సాంక్రామిక, సాంక్రామికేతర, జీవనశైలి వ్యాధుల విజృంభణ సామాన్య నడిమి తరగతి ప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తూ అభద్ర భారతావనిని సాక్షాత్కరింపజేస్తోంది. ఈ అవ్యవస్థకు విరుగుడుగానంటూ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ స్వాస్థ్య సురక్షా మిషన్‌’కు మొన్న మార్చిలోనే ఆమోదం తెలిపిన మోదీ ప్రభుత్వం- ఆ ప్రతిష్ఠాత్మక పథకాన్ని రేపటి నుంచే పట్టాలకెక్కిస్తోంది. ఐరోపా జనాభా, లేదంటే అమెరికా, కెనడా, మెక్సికోల మొత్తం జనసంఖ్యతో సరిపోలేటంతగా 50 కోట్ల మందికి ప్రభుత్వ నిధులతోనే సమకూర్చే ఆరోగ్య రక్షణ ఛత్రం ప్రపంచంలోనే అతి పెద్దదని మోదీ ప్రభుత్వం సగర్వంగా చాటుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 8.03 కోట్లు, పట్టణాల్లో 2.33 కోట్ల నిరుపేద కుటుంబాలు ఈ ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి వస్తాయంటూ, ఒక్కో కుటుంబానికి ఏడాదికి అయిదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా రక్షణ బీదసాదలకు కొండంత అండ కానుందని చెబుతోంది. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆ పథకం అమలుకు సమ్మతించి కేంద్రంతో అవగాహన కుదుర్చుకోగా- తెలంగాణ, దిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, పశ్చిమ్‌ బంగ, తమిళనాడు వంటివి దానికి దూరంగా ఉన్నాయి. తాము అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీ కోటిన్నర జనాభా ప్రయోజనాలకు గొడుగుపడుతుండగా, ఆయుష్మాన్‌ భారత్‌ పరిధి 80 లక్షలకే పరిమితం అవుతోందంటూ తెలంగాణ వెనక్కి తగ్గగా, తనవంతు 40 శాతం వాటా భరించే స్థోమత లేదంటూ పంజాబ్‌ వెనకంజ వేసింది. ఆధార్‌, వసేప (జీఎస్‌టీ) అమలుకంటే సంక్లిష్టభరితమైనది, మరెన్నో సవాళ్లతో కూడుకొన్నదిగా ప్రతీతమైన ఆయుష్మాన్‌ భారత్‌ను విజయవంతం చెయ్యడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యదక్షతకు పెద్దపరీక్ష కానుంది!

ఏ దేశంలోనైనా సమర్థ మానవ వనరుల నిర్మాణంలో విద్య, వైద్యం ఎంతో కీలక భూమిక పోషిస్తాయి. పాతికేళ్లకు పైబడిన ఆర్థిక సంస్కరణల శకంలోనూ విద్య వైద్య రంగాలపై ప్రభుత్వాలు శీతకన్నేయడం, వాణిజ్యపర వ్యూహాలతో ప్రైవేటు రంగం వాటిని గణనీయంగా విస్తరించినా, నిరుపేద భారతావనికి అవి అందని ద్రాక్ష కావడం- దేశాభివృద్ధి వేగాన్ని మందగింపజేస్తున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ అమలుకోసం ఇరవై ప్రత్యేక విభాగాల (స్పెషాలిటీస్‌) కింద వెయ్యి రూపాయల నుంచి లక్షన్నర దాకా వ్యయం కాగల 1,354 చికిత్స ప్యాకేజీలను కేంద్రం సిద్ధంచేసింది. 2011 నాటి సామాజిక, ఆర్థిక కుల జనాభా గణన ప్రాతిపదికన, ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య సేవలందుకొంటున్నవారి వివరాల ఆధారంగా అర్హుల్ని నిర్ధారించి- కేవలం గుర్తింపు కార్డు చూపించి పైసా ఖర్చు చెయ్యకుండా వైద్యం చేయించుకొని వెళ్లే వీలు కల్పిస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌- పేదలకు అక్షరాలా ఆపద్బంధు అనడంలో మరోమాట లేదు. కానీ, దేశ ఆరోగ్య రంగాన పెను సంక్షోభాన్ని కళ్లకు కడుతున్న అనేక దురవస్థలపై దృష్టి సారించకుండా ఇంతటి బృహత్‌ యత్నాన్ని సఫలం చెయ్యడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు దూసుకొస్తున్నాయిప్పుడు! ప్రతి 10,189మందికి ఓ అల్లోపతి వైద్యుడు, 2,046 మందికి ఓ ఆసుపత్రి పడక, 90,346 మందికి ఓ ఆసుపత్రి కనాకష్టంగా ఉన్న దేశం మనది. ఏడున్నర లక్షల మందికి పైగా డాక్టర్ల కొరత, 20 శాతానికి పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, 30 శాతం దాకా సామాజిక ఆరోగ్య కేంద్రాలకు లోటు పీడిస్తున్న వేళ- ఆ అవ్యవస్థను సరిదిద్దకుండా మెరుగైన ఆరోగ్య సేవలు సాధ్యపడేదెలా?

ఆయుష్మాన్‌ భారత్‌ను సమర్థంగా పట్టాలకెక్కించేందుకు 15 వేల దాకా ఆసుపత్రులు సంసిద్ధంగా ఉన్నాయంటున్న నీతి ఆయోగ్‌, అందులో సగం ప్రైవేటు ఆసుపత్రులేనని స్పష్టీకరించింది. కనీసం పది పడకలున్న ఆసుపత్రుల్నీ ఈ పథకం అమలులో అంతర్భాగం చెయ్యడం మెచ్చదగిందే అయినా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) కంటే 15-20 శాతం తక్కువ రేట్లనే చికిత్సలకు నిర్ధారించడం- రోగుల భద్రతనే ప్రమాదంలోకి నెట్టేస్తుందని భారతీయ వైద్యసంఘం ఆందోళన వ్యక్తీకరించింది. సిజేరియన్లకు తొమ్మిది వేల రూపాయలేనని నిర్ధారించడం అసంబద్ధమంటూ, అందులోనే భోజనం, వసతి, మందులు సాధ్యమేనా అన్న వైద్యుల సూటి ప్రశ్నకు సమాధానం చెప్పేవారేరీ? పేరున్న ఆసుపత్రులన్నీ ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి రాకపోవడం- చికిత్సలకు రేట్ల నిర్ధారణ సక్రమంగా లేదన్న వాస్తవాన్నే పట్టిస్తోంది. పేదలకు వైద్యసేవలు ఉచితంగానే కాదు- నాణ్యంగా, సముచితంగా అందేలా చూడటం తాజా పథకం మౌలిక ఉద్దేశం కావాలి. దేశవ్యాప్తంగా ప్రతి అయిదు వేల జనాభాకు ఒకటి చొప్పున 2022 నాటికి లక్షన్నర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటును మోదీ ప్రభుత్వం లక్షిస్తోంది. ప్రాథమిక దశలోనే వైద్యసేవలు, పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తీవ్రమైన జబ్బులను తొలిదశలోనే గుర్తించి నయం చేసే ఈ రక్షణ వ్యవస్థకూ కేంద్రం శ్రీకారం చుడుతోంది. ఆయుష్మాన్‌ భారత్‌ వల్ల రోగులు అత్యధికంగా ఉండే చిన్నచిన్న పట్టణాల్లోకీ వైద్యసేవల విస్తృతి ఇక ఊపందుకొంటుందనీ విశ్వసిస్తోంది. బీమా ఆధారిత ఆరోగ్య సేవల సాఫల్యంపై సందేహగత జీవుల అనుమానాలు పటాపంచలయ్యేలా, నిరుపేదలకు నిజమైన వరమై భాసించేలా ఆయుష్మాన్‌ భారత్‌ను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ చిత్తశుద్ధితో అమలు చెయ్యడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విహిత విధి!

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.