close

బుధవారం, అక్టోబర్ 17, 2018

తాజా వార్తలు

రోడ్డెక్కిన అన్నదాతలు 

వట్టివాగు నీరందక వరి పొలాలు ఎండుతున్నాయని నిరసన 
రోడ్డెక్కిన అన్నదాతలు 

రెబ్బెన, న్యూస్‌టుడే : వట్టివాగు జలాశయం నీరందక పంట పొలాలు ఎండుతున్నాయని  రైతన్నలు రోడ్డెక్కారు. మంగళవారం మండలంలోని కైర్‌గాం, మోతుగూడ గ్రామాల రైతులు కైర్‌గాం గ్రామ సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న రెబ్బెన ఎస్‌ఐ దీకొండ రమేశ్‌, సంబంధిత శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. తమ సమస్య పరిష్కారం అయితేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. 
సంబంధిత అధికారులతో మాట్లాడిన ఎస్‌ఐ మూడు రోజుల్లో కాలువల్లో పేరుకుపోయిన తుంగ, మట్టిని, చెత్తాచెదారం తొలగించి పరిష్కరించాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ జలాశయం పరిధిలోని డి-6 నుంచి డి-8 వరకు ఉన్న కాలువలు పూర్తిగా పూడిక, తుంగతో శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. జలాశయాన్ని నమ్ముకొని వరి పంట సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పొట్ట దశలో వరి పంట ఉందని, నీళ్లు రాకపోవడంతో ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అప్పులు చేసి రూ.వేలు ఖర్చు చేసి వరి పంట సాగు చేసుకుంటున్నామని, చేతికి అందే సమయంలో పంట నాశనమవుతోందని వాపోయారు. పంటపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న తమ బతుకులు రోడ్డున పడనున్నాయని, న్యాయం చేయాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు సురేష్‌, సంతోష్‌, సత్తయ్య, ఇమామ్‌, శ్రీనివాస్‌, నరేష్‌, మహేష్‌,  సాగర్‌, సాంబయ్య, జనార్దన్‌, మల్లేష్‌, కార్తీక్‌, వెంకటేష్‌, తదితర రైతులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు