close

బుధవారం, సెప్టెంబర్ 26, 2018

తాజా వార్తలు

గజిబిజిగా బదిలీలు   

గందరగోళంగా వెబ్‌ కౌన్సెలింగ్‌ 
ఒకే పోస్టుకు ఇద్దరు, లేని పోస్టుకు ఒకరు స్థానచలనం 
సాఫ్ట్‌వేర్‌ లోపంతో ఎటూతేలని పలువురి భవితవ్యం 
న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం 
 

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీల్లో జరుగుతున్న తప్పిదాలు వారిని బిత్తరపోయేలా చేస్తున్నాయి. తొలిసారిగా ప్రభుత్వం బదిలీలను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా చేపడుతుండటంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే నాటి నుంచి బదిలీ ఉత్తర్వులు అందేవరకు ఏదో ఒక రకంగా లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. ఒకే పోస్టుకు ఇద్దరిని బదిలీ చేయడం, ఎన్‌సీసీ యూనిట్లు ఉన్నా లేనట్లు చూపించడం వంటి పలు రకాల తప్పిదాలు జాబితాల్లో వస్తుండటంతో జిల్లా విద్యాశాఖ అధికారులే కాదు ఉపాధ్యాయులు కూడా తల పట్టుకుంటున్నారు. వెబ్‌ ఆప్షన్ల ఎంపిక ఎంపిక సందర్భంగా సీనియారిటీ జాబితాలు, ప్రత్యేక కేటగిరీ వంటి వాటిల్లోని లోపాలు గుర్తించి వాటిని సవరించాలని జిల్లా విద్యాశాఖ రాష్ట్ర అధికారులకు తెలిపినా ఫలితం లేకుండా పోయింది. బదిలీ ఉత్తర్వులను చూస్తున్న పలువురు ఉపాధ్యాయులు ఈ లోపాలను చూసి ఆందోళన చెందుతుండగా, మరి కొందరికి అన్యాయం జరుగుతోంది. ఇప్పటి వరకు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీల ఉత్తర్వులను విద్యాశాఖ వెల్లడించగా వాటిల్లో పలు లోపాలు బయటపడ్డాయి.

లేని పోస్టుకు ఒకరు.. ఒక పోస్టుకు ఇద్దరు 
ఉమ్మడి జిల్లాలో ఆదివారం రాత్రి విద్యాశాఖ వెబ్‌సైట్లో స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీల జాబితాను పెట్టింది. ఇందులో పాఠశాలలో పోస్టు లేకున్నా అందులో నియమించడం, ఒకే పోస్టుకు ఇద్దరిని బదిలీ చేయడం వంటివి జరిగాయి. ప్రధానోపాధ్యాయుల బదిలీల్లో ఇలాంటిదే జరిగినా విద్యాశాఖ సరిచేయడంతో సమస్య సద్దుమణిగింది. అలాగే ఎన్‌సీసీ పోస్టులు గల పాఠశాలల్లో అర్హతలేని ఏడుగురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అవడంతో పలువురి బదిలీలపై అనిశ్చితి నెలకొంది.

హుజురాబాద్‌ మండలం బోర్నపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టు ఒకటే ఉండగా, దానికి ఇద్దరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు పెట్టారు. దీంతో ఎవరు అక్కడ విధుల్లో చేరాలన్నది అంతుబట్టడం లేదు. వెబ్‌ కౌన్సెలింగ్‌ సందర్భంగానే ఈ తప్పును జిల్లా విద్యాశాఖ గుర్తించి రాష్ట్ర అధికారులకు సరిచేయాలని కోరినా చేయలేదన్నట్లు తెలుస్తోంది.

ధర్మారం మండలంలోని కొత్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ పోస్టు ఖాళీ లేనప్పటికీ ఒక ఉపాధ్యాయుడిని అక్కడికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. సాఫ్ట్‌వేర్‌ లోపంతో తలెత్తిన ఈ తప్పిదంతో అక్కడికి బదిలీ అయిన ఉపాధ్యాయుని పరిస్థితిపై అనిశ్చితి నెలకొందని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పేర్కొంటున్నారు.

ఎన్‌సీసీ యూనిట్లు గల పాఠశాలలకు ఉపాధ్యాయుల బదిలీ గందరగోళంగా నిలుస్తోంది. బదిలీల ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఈ పాఠశాలల్లో జరుగుతున్న తప్పిదాలపై అర్హులైన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. తప్పుడు ఎన్‌సీసీ ఉన్నట్లుగా దరఖాస్తుల్లో పేర్కొని సవరించాలని కోరిన వారికీ అధికారులు ముందస్తుగా న్యాయం చేయలేకపోయారు.

ఎన్‌సీసీ శిక్షణ పొంది, ప్రస్తుతం ఆ యూనిట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎన్‌సీసీ యూనిట్లు గల పాఠశాలలకు బదిలీ చేయాలన్నది నిబంధన. అయితే కరీంనగర్‌లోని రెండు పాఠశాలల్లో ఈ యూనిట్లు కలిగి ఉండి పోస్టులు  ఖాళీగా ఉన్నా వెబ్‌ ఆప్షన్లలో అవి కనిపించలేదని ఉపాధ్యాయులు తెలిపారు. ఇందులోని ఒక పాఠశాలకు ఎన్‌సీసీ అర్హతలేని స్కూల్‌ అసిస్టెంట్‌ను బదిలీ చేశారు.

మరో ఏడుగురు ఉపాధ్యాయులు ఎన్‌సీసీ ఉన్నట్లుగా అవగాహన లోపంతో దరఖాస్తుల్లో పేర్కొన్నా వెంటనే వాటిని సవరించాలని జిల్లా, రాష్ట్ర విద్యాశాఖలకు విజ్ఞప్తులు చేశారు. ఈ పనిని పూర్తి చేయకుండానే ఇలాంటి ఏడుగురు ఉపాధ్యాయులను ఆ పోస్టుల్లోకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. తప్పిదాన్ని గ్రహించిన జిల్లా విద్యాశాఖ సోమవారం వారి బదిలీ ఉత్తర్వులను తాత్కాలికంగా పక్కనపెట్టింది. ఈ ఏడుగురి స్థానాల్లో బదిలీ అయిన వారు, వీరి స్థానాల్లోకి వచ్చేందుకు ఇతర పాఠశాలల నుంచి బదిలీ అయినవారి ఉత్తర్వులను కూడా తాత్కాలికంగా జిల్లా విద్యాశాఖ పక్కనబెట్టింది.

దీంతో దాదాపు 15 మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ సోమవారం సాయంత్రం వరకు ఎటూ తేలలేదు. జిల్లా విద్యాశాఖ తుదకు సోమవారం సాయంత్రం వారందరినీ బదిలీ చేస్తూ వారిని విధుల నుంచి రిలీవ్‌ చేయాలని సూచించింది.

ఎన్‌సీసీ యూనిట్లు గల పాఠశాలలకు బదిలీ అయిన ఏడుగురు ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుండగా, వారికి ఇతర పాఠశాలల్లో పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. జిల్లా విద్యాశాఖ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..

బదిలీల్లో ఇలాంటి తప్పిదాలను సరిచేస్తూ ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లను అందిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు