close

బుధవారం, సెప్టెంబర్ 26, 2018

తాజా వార్తలు

మహిళలకు అండగా, రక్షణగా సబల 

రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు జిల్లాలో ప్రారంభం 
మహిళాకమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి 
గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే 

మహిళలకు అండగా, రక్షణగా ఉండేలా రూరల్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు ‘సబల’ అనే కార్యక్రమం రూపొందించడం అభినందనీయమని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం పోలీసు కల్యాణ మండపంలో ‘సబల’ కార్యక్రమం ప్రారంభోత్సవ వేడుక వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిÅగా హాజరైన రాజకుమారి మాట్లాడుతూ ఇటీవల కాలంలో తండ్రి తన కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగట్టడం, అభం శుభం తెలియని చిన్నారులపై మృగాళ్లు అత్యాచారాలకు పాల్పడటంవంటి దురదుష్టకరమైన సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. ఊహించని ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసుల, ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు, చిన్నపిల్లల రక్షణకు వారికి అండగా ఉండేలా రాష్ట్రంలోనే తొలిసారిగా ‘సబల’ అనే బృహత్తర కార్యక్రమం రూపొందించడం ప్రశంసనీయమన్నారు. దీనికి తమ వంతు సహకారం ఉంటుందని తెలియజేశారు. రేంజ్‌ ఐజీ గోపాల్‌రావు మాట్లాడుతూ తన చిన్నతనంలో ఆడపిల్లలపై బాల్యం నుంచి తమ ఇళ్లల్లోనే వివక్ష చూపేవారని మగవారికి ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన ఎస్సైల్లో గుంటూరు జోన్‌కు 73 మంది వస్తే వారిలో 39 మంది, ఏలూరు రేంజ్‌లో 58 మంది ఎస్సైలు వస్తే వారిలో 50 మంది మహిళా ఎస్సైలు ఉన్నారన్నారు. కొంత కాలానికి పోలీసుశాఖలో పురుషులకంటే మహిళా పోలీసులే అధికమైనా ఆశ్చర్యపడక్కరలేదన్నారు. మహిళలు చెప్పుకోలేనటువంటి సమస్యలను తెలుసుకొని రహస్యంగా పరిష్కరించటానికి ‘సబల’ పోలీసు బృందాలు ఎంతగానో ఉపయోగపడతారన్నారు. రూరల్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ  సమాజంలో మహిళలు, చిన్నపిల్లలపట్ల జరుగుతున్న అకృత్యాలు తనను కలచివేశాయన్నారు. ఆ క్రమంలోనే సబల ఆలోచన తన మదిలో ఆవిర్భవించిందన్నారు. వారి రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికి అబలలకు అండగా ‘సబల’ అనే నినాదాన్ని తన సతీమణి కిరణË్మయి అందించారని ఆమెకు తన అభినందనలు తెలిపారు. 2017 అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు 81 కళాశాలలు, 51 పాఠశాలల్లో 160 సదస్సులు నిర్వహించి 4,410 మంది విద్యార్థులను సబల పోలీసులు కలుసుకొని అవగాహన కల్పించార]న్నారు. ఇప్పటి వరకు 100 మంది ఫిర్యాదులు అందించగా వాటిలో ముగ్గురిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగామన్నారు. ఇప్పటికే రెండు డీజీపీ అవార్డులు సబల పోలీసులకు వచ్చాయని తెలిపారు. బాల, బాలికలు, పాఠశాలలు, కళాశాలలు, గృహిణిలు, పనులు చేసే మహిళలు ఇలా అందరికి రక్షణ కల్పించడంతోపాటు అండగా ఉండేలా ‘సబల’ పనిచేస్తుందన్నారు. రూరల్‌ ఎస్పీ సతీమణి కిరణ్మయినాయుడు మాట్లాడుతూ తాను తొలిసారిగా ఇంతమంది మహిళా సబల పోలీసులను చూస్తున్నాని తనకు ఎంతో ధైర్యంగా ఉందని ఇలాగే జిల్లాలోని మహిళలకు, బాలికలకు, విద్యార్థినులకు ధైర్యం కలిగేలా పనిచేయాలన్నారు.  తన బాబుకు చిన్నతనం నుంచి తోటి బాలికలపట్ల, మహిళలపట్ల సోదరిబావంతో మెలగానే భావనతో పెంచుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అతిథులు.. సబల నోడల్‌ అధికారి డీఎస్పీ స్నేహిత, సీఐలు రాజేశేఖర్‌రెడ్డి, సుభాషిణిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటనారాయణ, సత్యనారాయణ, అజీజ్‌, నాగేశ్వరరావు, లక్ష్మయ్య, మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ సూరజ్‌, ఏపీ స్పిన్నింగ్‌మిల్లు అధ్యక్షులు బుచ్చయ్య, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

సబల దళాల చేతికి పెప్పర్‌స్ప్రే 
గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ‘సబల’ పోలీసు దళాల చేతికి లాఠీతోపాటు పెప్పర్‌స్ప్రేను అందించారు. సైకిళ్లతోపాటు ప్రత్యేకంగా తయారు చేసిన దుస్తులు, శిరస్త్రాణం, లాఠీలను అందించారు. విద్యార్థిణిలకు, మహిళలకు, గృహిణులకు, బాలికలకు ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా నిర్భయంగా 9440900866 నంబరుకి ఒక్క ఫోన్‌ చేస్తేచాలు వెంటనే సబల పోలీసులు వచ్చి వారి సమస్య పరిష్కరిస్తారు. ఈ సందర్భంగా సబల పోలీసు దళాల సైకిళ్ల ర్యాలీని, చైతన్య రథాన్ని మహిళాఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, ఐజీ గోపాల్‌రావు, ఎస్పీ వెంకట అప్పలనాయుడు చేతుల మీదగా ప్రారంభించారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు