close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

నమో నారసింహా! 

ధర్మపురి, న్యూస్‌టుడే: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం అంకురార్పణ, మృత్‌సంగ్రహణ కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభం కాగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం దేవస్థానంలో యాజ్ఞికాచార్యులు శ్రీమాన్‌ కందాలై పురుషోత్తమాచార్యుల ఇంటికి దేవస్థానం పాలకమండలి వారు, ఆలయ అధికారులు వెళ్లి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రధాన ఆలయంలో వేద పండితులు, అర్చకులు వాసుదేవ పుణ్యాహవాచనం, అంకురార్పణ, కలశ స్థాపనల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చకులకు బ్రహ్మోత్సవాల దీక్షా వస్త్రాలను సమర్పించారు. స్వామివారి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళలో వేద పండితులు, అర్చకులు మంత్రాలను పఠిస్తుండగా, బ్రహ్మోత్సవాల్లో మొదటి యోగ, ఉగ్ర, శ్రీవేంకటేశ్వరస్వాములకు ప్రత్యేక పూజలను జరిపారు. 6 గంటలకు మంగళవాయిద్యాల నడుమ శ్రీలక్ష్మీనరసింహస్వామి, వేంకటేశ్వరస్వాముల సేవలను పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం యాజ్ఞికాచార్యులు కందాలై పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో, ఆలయ వేద పండితులు బొజ్జా రమేష్‌శర్మ, శ్రీనివాసాచార్యులు తదితరులు ధర్మపురి మృత్‌ సంగ్రహణంలో పుణ్యాహవాచనం, ప్రత్యేక పూజలు, మంగళహారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పుణ్యాహవాచనంతో పూజించిన చోట మట్టిని సేకరించి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలకు తీసుకుని వెళ్లారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి సేవను తితిదే పురాతన ధర్మశాల వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఈఓ ఎన్‌.సుప్రియ, జడ్పీటీసీ సభ్యురాలు బాదినేని రాజమణి, ధర్మకర్తలు నటరాజ్‌శర్మ, గంగాధర్‌, వెంకటేశ్వరరావు, సునీల్‌, లింగన్న, తిరుపతి, శ్రీనివాస్‌, రమాదేవి, భాగ్యలక్ష్మి, సర్పంచి సంగి సత్తెమ్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు