close

శనివారం, అక్టోబర్ 20, 2018

తాజా వార్తలు

పదోతరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు 

72 కేంద్రాలు, 14,724 మంది విద్యార్థులు 
సీసీ కెమేరాలు అందుబాటులో ఉన్న కేంద్రాల్లో నిఘా 
తాగునీరు, వైద్య, ప్రయాణ సదుపాయాలు 
న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం 

పదోతరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు 

పరీక్ష కేంద్రాలు, విద్యార్థుల వివరాలు 
రెగ్యులర్‌ విద్యార్థుల పరీక్ష కేంద్రాలు : 69 
పరీక్షలకు హాజరుకానున్న రెగ్యులర్‌ విద్యార్థులు : 14,724 
ప్రైవేటు పరీక్ష కేంద్రాలు 3, హాజరయ్యే విద్యార్థులు : 539 
మరి కొద్ది రోజుల్లో జిల్లాలో ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఇప్పటికే పరీక్ష కేంద్రాల జాబితాలను సిద్ధం చేయడంతో పాటు వాటిల్లో కల్పించాల్సిన సదుపాయాలపై సంబంధిత శాఖల అధికారులు సమీక్ష నిర్వహించారు. సీసీ కెమేరాల మధ్య పరీక్షలు నిర్వహించాలన్న నిబంధనతో కొత్తగా వాటి ఏర్పాటు లేకున్నా గతేడాది వాటిని ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల కేంద్రాల్లో మాత్రం నిఘా మాటున పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. అయితే గతేడాది కంటే ఈసారి తక్కువ సంఖ్యలో విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మరో వైపు పరీక్షల నిర్వహణకు చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ అధికారులు, అదనపు డిపార్టుమెంటల్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలతో పరీక్షలు జరిగే రోజుల్లో చర్యలపై జిల్లా పాలనాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ సోమవారం కరీంనగర్‌లో సమీక్షించనున్నారు.
72 కేంద్రాల్లో పరీక్షలు : మార్చి 15 నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం మొత్తం 72 పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ గుర్తించింది. ఇందులో 69 కేంద్రాలు రెగ్యులర్‌ విద్యార్థుల కోసం, కరీంనగర్‌, హుజురాబాద్‌లలో 3 కేంద్రాలను ప్రైవేటు అభ్యర్థుల కోసం కేటాయించారు. మొత్తం ఈ సారి పరీక్షలకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల నుంచి 14,724 మంది హాజరుకానుండగా, ప్రైవేటు అభ్యర్థులు 539 మంది పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్‌ విద్యార్థుల కోసం ఎంపిక చేసిన మొత్తం 69 కేంద్రాల్లో 44 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో, 25 కేంద్రాలను ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నారు. కాగా కరీంనగర్‌లో మొత్తం 24 కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 20 కేంద్రాలు ప్రైవేటు పాఠశాలల్లోనే ఏర్పాటు చేయగా, నాలుగు కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. అయితే గతం కంటే భిన్నంగా ఈసారి ఈ కేంద్రాల్లో ఫర్నీచర్‌ కొరత లేకుండా జిల్లా యంత్రాంగం ముందస్తుగానే జాగ్రత్తలు చేపట్టింది. గత రెండు నెలల క్రితమే ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేసిన డ్యూయెల్‌ డెస్క్‌లను ఈ కేంద్రాలకు ముందుగా అందించేలా ప్రాధాన్యత కల్పించడంతో ఈ సారి విద్యార్థులకు ఫర్నీచర్‌తో ఇక్కట్లు తప్పనున్నాయి. యాజమన్యాల వారీగా విద్యార్థులు

సీసీ కెమెరాల నీడలో.. 
ఈసారి కొన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నీడలో పరీక్షలు జరుగనున్నాయి. పదో తరగతి పరీక్షల్లో చూచిరాతలు జరుగుతున్నాయని భావించిన హైకోర్టు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఇటీవల ఆదేశించింది. అయితే అన్నింట్లో వీటిని ఈ ఏడాది ఏర్పాటు చేయకపోయినా అందుబాటులో సీసీ కెమెరాలు గల కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించబోతున్నారు. గతేడాది జిల్లాలోని 5 కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసినా తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో చాలా వాటిల్లో అవి పనిచేయడం లేదు. ఈ సారి మాత్రం గతేడాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కరీంనగర్‌ సప్తగిరికాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జమ్మికుంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు జిల్లాలోని రెండు ఆదర్శ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమేరాల నీడన పరీక్షలు జరగనున్నాయి.. చూచిరాతను నివారించేందుకు ఈ పద్ధతిని అమలు చేస్తుండటంతో విద్యార్థులు వాటితో భయపడాల్సింది ఏమీ లేదు.

పర్యవేక్షణకు అధికారులు : పదో తరగతి పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులను నియమించారు. చీఫ్‌ సూపరింటెండెంట్లుగా 72, డిపార్టుమెంటల్‌ అధికారులుగా 72 మందిని, సీ కేంద్రాల కస్టోడియన్‌లు 18 మందిని, 18 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేస్తూ ఈ బాధ్యతలను సీనియర్‌ ప్రధానోపాధ్యాయులు, సీనియర్‌ స్కూల్‌అసిస్టెంట్లకు అప్పగిస్తూ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. పరీక్షల నిర్వహణకు కావాల్సిన ఇన్విజిలెటర్లను మరో రెండు మూడు రోజుల్లో నియమించే అవకాశం ఉంది.

విద్యార్థులకు సదుపాయాలు 
పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతితో పాటు వైద్యసిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుతో పాటు కేంద్రాల్లో పరీక్షల సమయంలో విద్యుత్తు సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి సకాలంలో కేంద్రాలకు విద్యార్థులు చేరుకునే వీలుగా ఆర్టీసీ బస్సులను పరీక్షల సమయానికి నడిపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల పరీక్షల ఏర్పాట్లపై కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సమీక్షలో జిల్లా సంయుక్త పాలనాధికారి సంబంధిత అధికారులకు వీటి ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు