close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

ధీమా ఇవ్వని బీమా! 

చనిపోయిన జీవాలకు సక్రమంగా అందని పరిహారం 

ధీమా ఇవ్వని బీమా! 

పాల్వంచ గ్రామీణం, బోనకల్లు, న్యూస్‌టుడే : అవగాహనలేమికి అలసత్వం తోడై లబ్ధిదారులు నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన గొర్రెల్లో చాలా మృత్యువాత పడ్డాయి. వాటికి బీమా(ఇన్సూరెన్స్‌) సదుపాయం ఉన్నప్పటికీ ఆ సొమ్ము సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం అందజేసిన జీవాల్లో ఇప్పటివరకు రెండు నుంచి మూడు వేల వరకు చనిపోయాయి. అందులో బీమా కేవలం 315 గొర్రెలకు మాత్రమే రావడం గమనార్హం. చిన్నవి చాలా వరకు చనిపోగా వాటికి బీమా సౌకర్యం లేకపోవటం మరింత ఇబ్బందిగా మారింది.
భద్రాద్రి కొత్తగూడెంలో 23 మండలాల్లో యాదవ, కురుమలకు ఆర్థిక చేయూతనివ్వడానికి రాయితీపై 5524 గొర్రెల యూనిట్లు కేటాయించారు. అందులో 4,962 యూనిట్లు అందించారు. ఖమ్మం జిల్లాలో 16,324 యూనిట్లకు 7422 యూనిట్లను పంపిణీ చేశారు. పెద్ద  మొత్తంలో జీవాలు అవసరం కావటం, సమయాభావం లాంటి కారణాలతో కొన్ని అనార్యోగంగా ఉన్నా వాటిని పంపిణీ చేశారన్న విమర్శలున్నాయి. మొత్తంగా పలు కారణాలతో చాలా జీవాలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల యూనిట్‌ ధర రూ.1,25,000 కాగా అందులో లబ్ధిదారుడి వాటా రూ.31,250. మిగిలిన రూ.1.11లక్షల్లో బీమా, రవాణాకు రూ.14వేలు మినహాయించి మిగిలిన మొత్తానికి ఒక పొట్టేలు, 20 గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. గొర్రెల పంపిణీలో ఉద్యమంగా జరగడంతో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. లభ్యత తక్కువగా ఉండటంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల వారికి అనారోగ్యంతో ఉన్న వాటినిచ్చారు. ఉచితంగానే వస్తున్నాయి కదా అని లబ్ధిదారులు సైతం ప్రశ్నించలేదు. బీమా ఉంది కదా కొన్ని బతికినా చాలు అనుకున్నారు. కానీ పరిస్థితి అడ్డం తిరిగింది.

అధికారుల్లోనూ స్పష్టత లేదు.. 
ఉమ్మడి జిల్లాల్లో లబ్ధిదారులకు ఇచ్చిన వాటిలో 2,800 గొర్రెలు మృత్యువాతపడ్డట్లు పశుసంవర్థక శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. వీటి బీమా కింద డబ్బులు కట్టినా ఆ ప్రక్రియ సక్రమంగా సాగలేదు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కేవలం 315 జీవాలకు మాత్రమే బీమా సొమ్ము వచ్చింది. పొట్టేలుకు రూ.7వేలు, గొర్రె ఒక్కదానికి రూ.5200 చొప్పున పరిహారం ఆయా జిల్లాల పాలనాధికారుల ఖాతాల్లో మంజూరయ్యాయి. గొర్రె కింద గొర్రె ఇవ్వాలా? లేక బీమా సొమ్ము అందించాలా? అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులకు సైతం ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.

సమాచార లోపంతో.. 
ఆన్‌లైన్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేయడంలో నిర్లక్ష్యం జరుగుతుంది. భద్రాద్రికొత్తగూడెంలో 1700 గొర్రెలు చనిపోగా ఇప్పటికి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసింది కేవలం 700 మాత్రమే. ఖమ్మంలో 1,100 మృత్యువాతపడగా నాలుగు నుంచి అయిదు వందల వివరాలే అప్‌లోడ్‌ చేసినట్లు సమాచారం. అధికారులేమో తీరిక లేకుండా ఉండటం, లబ్ధిదారులు నుంచి సరైన సమాచారం అందకపోవడం ఇబ్బందిగా మారుతుందని సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు. మరోపక్క సొమ్ము చెల్లింపులో బీమా కంపెనీలు సైతం జాప్యం చేస్తున్నాయి. ట్యాగులు తెగాయని, ఫొటోలు సరిగా లేవంటూ తీవ్ర జాప్యం చేస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు బీమా సొమ్ముకోసం పశుసంవర్థక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గొర్రెలు మృతి చెందాయని సంబంధిత ఫొటోలు వివరాలన్నీ అందజేసినా రెండు నెలలు నుంచి బీమా సొమ్ము రావట్లేదని గొల్లగూడెం, పాండురంగాపురం, యానంబైలు లబ్ధిదారులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన సొమ్ము ఇప్పించాలని కోరుతున్నారు.

అవగాహన లేక... 
లబ్ధిదారులకు పథకంపై పూర్తి అవగాహన లేక కొంత నష్టపోతున్నారు. ట్యాగులు వేసేప్పుడు ఏ సమయంలోనైనా వాటిని తొలగించవద్దని ఆదేశాలు జారీ చేసినా కొందరు పుండ్లు పడుతున్నాయని తొలగిస్తున్నారు. ఫలితంగా అవి చనిపోతే బీమా వర్తించట్లేదు. ప్రమాదవశాత్తు గొర్రెలు మృత్యువాత పడితే స్థానిక పశువైద్యుడికి సమాచారం అందించాలి. చనిపోయిన జీవం ఫొటో, ట్యాగు, దాని నెంబర్‌ కనిపించేలా చిత్రాలు తీసి సంబంధిత వెబ్‌సైట్లో 15రోజుల్లోపు అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం ట్యాగు, ఫొటోలు కొరియర్‌ ద్వారా బీమా ఏజెన్సీలకు పంపిస్తే ముందస్తుగా అప్‌లోడ్‌ చేసిన ట్యాగ్‌ చిత్రం, కొరియర్‌ ద్వారా వచ్చిన ట్యాగు ఒక్కటేనని ధ్రువీకరించిన అనంతరం బీమా చెల్లిస్తారు. ఈ ప్రక్రియపై అవగాహన లేని కొందరు ట్యాగులు తొలగిస్తూ నష్టపోతున్నారు. ఏ కారణం చేతనైన వాటిని తొలగిస్తే వైద్యుల్ని సంప్రదించి మళ్లీ పొందవచ్చు. కొందరైతే గొర్రె చనిపోయిన రెండు, మూడు రోజులకు వైద్యులకు సమాచారం అందిస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరికొందరు కనీసం ఫొటోలు సైతం తీసుకోవట్లేదు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిల్లో బీమాపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

ట్యాగులుంటేనే బీమా 
బోడేపూడి శ్రీనివాసరావు (ప్రత్యేకాధికారి), గొర్రెల పంపిణీ పథకం జిల్లా ఈడీ 
గొర్రెలకు ట్యాగులుంటేనే బీమా వర్తిస్తుంది. పుండ్లు పండుతున్నాయని తొలగించవద్దు. వాటిని మాన్పడానికి రూ.450 విలువ చేసే మందుల కిట్లు అందించాం. గొర్రెలు చనిపోతే తక్షణం పశు వైద్యులకు సమాచారం అందించండి. కొనుగోళ్లలో వైద్యులు నిమగ్నమై ఉండటంతో పరిహారం విషయంలో ఆలస్యమవుతోంది.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు