close

సోమవారం, మే 28, 2018

తాజా వార్తలు

సర్వం సిద్ధం 

రేపటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు 
హాజరుకానున్న 34,998 మంది విద్యార్థులు 
నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ 
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 

సర్వం సిద్ధం 

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభమై.. మార్చి 16 వరకు జరగనున్నాయి. 107 కళాశాలకు సంబంధించి ప్రథమ సంవత్సరం 16,879 మంది, ద్వితీయ సంవత్సరం 18,119 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీటికి నిర్వహణకు సంబంధించి ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పరీక్ష కేంద్రాలు ఇవే 
జిల్లాలో నిర్వహించే ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 50 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్గొండలో 19, మిర్యాలగూడ 7, దామరచర్ల 1, హాలియా 2, నాగార్జునసాగర్‌ 1, కొండమల్లేపల్లి 2, దేవరకొండ 3, డిండి 1, మర్రిగూడ 3, నాంపల్లి 1, కంపసాగర్‌ 1, నార్కట్‌పల్లి 2, నకిరేకల్‌ 4, చింతపల్లి 1, చండూరులో 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

జిల్లాలో 10 సమస్యాత్మక కేంద్రాలు 
జిల్లాలో పది పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాలపై డీఐఈవోతోపాటు సిట్టింగ్‌.., ప్లయింగ్‌ స్క్వాడ్స్‌ తదితర అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. డీఐఈవోతోపాటు ముగ్గురు డీఈసీ సభ్యులు, ఒక హెచ్‌పీసీ సభ్యుడు, 6 ప్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌, ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి ఒకరు పరీక్షలను పర్యవేక్షించనున్నారు. వీరితో పాటు కలెక్టర్‌, ఎస్పీ తదితర అధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసే అవకాశముంది.

144 సెక్షన్‌ అమలు 
పరీక్షలు జరిగే కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ప్రతి కేంద్రం పరిధిలో పరీక్షకు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఆయా జిరాక్సు కేంద్రాలను అధికారులు మూసివేయనున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు ఉదయం 8.30 నిమిషాలకే కేంద్రానికి చేరుకోవాలని, 8.45 నిమిషాలకు పరీక్ష హాల్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఒక్క నిమిషం నిబంధనను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని కోరారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు 
ఇంటర్మీడియట్‌ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగినా, విద్యార్థుల హాల్‌ టిక్కెట్‌లో లోపాలున్నా, పరీక్ష కేంద్రాల్లో సమస్యలు ఏర్పడినా ఫిర్యాదు చేసేందుకు నల్గొండ డీఐఈవో కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. సమస్యలు ఉత్పన్నమైతే 08682-230058 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

ఏర్పాట్లు పూర్తి చేశాం 
హన్మంత్‌రావు, జిల్లా ఇంటర్మీడియట్‌  విద్యా అధికారి, నల్గొండ 
ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రతి పరీక్ష కేంద్రానికి ప్రశ్నపత్రాల పంపిణీ పూర్తయింది. పరీక్షల సమయంలో విద్యుత్తు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాం. పరీక్ష వేళల్లో రవాణా ఇబ్బందులు లేకుండా సరైన సమయాల్లో బస్సులు నడిచేలా ఆర్టీసీ అధికారులతో మాట్లాడాము. పరీక్ష కేంద్రాల్లో మంచినీరు, ఫ్యాన్లు, మూత్రశాలలు, బల్లలు తదితర సౌకర్యాలు కల్పించాం. పరీక్ష కేంద్రాల ముందు ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేయనున్నాం. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ప్రతి కేంద్రంపై పటిష్ఠమైన నిఘా పెడుతున్నాం. జిల్లాలో ఎక్కడైనా మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినట్లు తమ దృష్టికొస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు