close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

నేడు న్యాయవాదుల భారీ ర్యాలీ 

చిన్నచౌకు (కడప), న్యూస్‌టుడే: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని రాయలసీమ న్యాయవాదుల సంఘం ఐకాస కన్వీనర్‌ మస్తాన్‌ వల్లీ అన్నారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ కడప కోర్టు ఎదుట న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం 34వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు ఏర్పాటు చేయడమనేది ఎప్పటి నుంచో వస్తున్న నినాదమన్నారు. కొత్తగా ఏమి అడగడం లేదని చెప్పారు. హైకోర్టు వస్తే సీమ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం సీమ వెనుకబడి ఉందన్నారు, అందులోనూ కడప జిల్లా మరీ వెనుకంజులో ఉందని తెలిపారు. అధికారం రాష్ట్ర నలుమూలలా విస్తరించాలని, అప్పుడే రాష్ట్ర అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. 80 ఏళ్ల కిత్రమే శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే అప్పుడే నిర్ణయించారని చెప్పారు. మన పాలకులు ఒక్కసారి చరిత్రను తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సీమ వాసి అయినప్పటికీ ఎందుకో సీమ పట్ల నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సీమలో హైకోర్టు ఏర్పాటు విషయంలో చొరవ చూపాలని కోరారు. దీక్షల్లో కూర్చున్న న్యాయవాదుల్లో ప్రమోద్‌కుమార్‌రెడ్డి, ఉమాదేవి, శ్రీనివాసులు, ఎంఎన్‌.నారాయణరాజులున్నారు. కార్యక్రమంలో రాయలసీమ న్యాయవాదుల ఐకాస నాయకులు సంపత్‌కుమార్‌, గుర్రప్ప, రాజగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, నాగేశ్వర్‌రాజు, నిరంజన్‌కుమార్‌, రవిచక్రవర్తి, ఆనంద్‌కుమార్‌, సుబ్రమణ్యం, శారద, శాతం, చంద్రవదనతో పాటు పలువురు ఉన్నారు.
న్యాయవాదుల దీక్షలకు మద్దతుగా సోమవారం కడపలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ రాజకీయ, కార్మిక, కర్షక, మహిళా, ప్రజా, విద్యార్థి తదితర సంఘాల వారు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలో ఆయా సంఘాల వారు బ్యానర్లను ఏర్పాటు చేసుకోవచ్చునని న్యాయవాదులు తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు