close

సోమవారం, మే 28, 2018

తాజా వార్తలు

ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తే..విజయం సొంతం 

ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తే..విజయం సొంతం 

చిత్తూరు (సంతపేట), చిత్తూరు (విద్య), న్యూస్‌టుడే : ‘పాలలో నెయ్యిని చూడలేం, నీటిలో విద్యుచ్ఛక్తి కన్పించదు, ప్రకృతి ధర్మాన్ని అనుసరించి..మానవుడు తన మేధస్సుతో పాలలోంచి నెయ్యిని, నీటి నుంచి విద్యుచ్ఛక్తిని సృష్టించగలిగాడు. ప్రకృతి ప్రతిఒక్కరికీ సమాన సామర్థ్యాల్ని అందిస్తుంది. సాధించాలనే బలమైన కోరికతో నిద్రాణమై ఉన్న శక్తికి సానబెట్టి లక్ష్యంపై దృష్టి సారించి సాగితే విజయాల్ని సాధించగలరు’ అని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ వర్లు పదోతరగతి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో ‘పరీక్షల పట్ల ఆందోళనలు-మార్గదర్శకాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ..భారమైన ఇనుముతో తయారయిన నౌకలు నీటిపై తేలుతూ ప్రయాణిస్తున్నాయి. ప్రకృతి ధర్మాన్ని నిజజీవితానికి ఆపాదించి ఇనుమును నీటిలో తేలియాడేలా మానవుడు చేయగలిగాడన్నారు. విజయానికి పక్షపాతం ఉండదన్నారు. దృక్పథం స్విచ్‌ లాంటిదని అది విజయానికి దారి చూపిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థి ఉన్నత జీవితానికి పునాది లాంటివి పదోతరగతి పరీక్షలన్నారు. భయం, సందిగ్ధాల్ని వదిలి ఆత్మవిశ్వాసంతో పరీక్షల్ని రాయడం ద్వారా మంచి ఫలితాలు సాధించొచ్చన్నారు. డీఈవో పాండురంగస్వామి మాట్లాడుతూ..విద్యార్థులు ఆత్మన్యూనతా భావాన్ని విడనాడి సానుకూల దృక్పథంతో పరీక్షలు రాయాలని తెలిపారు. కార్యక్రమంలో చిత్తూరు డీవైఈవో విజËయేంద్రరావు, సెక్టోరియల్‌ అధికారులు మోహన్‌, ప్రసాద్‌, ఆర్‌ఎంఎస్‌ఏ సహితవిద్య సమన్వయకర్త ఎస్సానుల్లా, ఇషా జిల్లా సమన్వయర్త రమేష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు