close

బుధవారం, మే 23, 2018

తాజా వార్తలు

ప్రత్యేక హోదా రాకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే! 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ, సీపీఎం ధ్వజం 

ప్రత్యేక హోదా రాకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే! 

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోతే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, పి.మధు హెచ్చరించారు. రాష్ట్రానికి  తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ బెటర్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో అలంకార్‌ ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విభజన హామీలను అమలు చేయకుండా గత నాలుగేళ్లగా కేంద్రం కాలయాపన చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టకపోగా తన స్వప్రయోజనాల కోసం హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారని విమర్శించారు. నాడు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి నేడు హోదా కోసం పారాడడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. త్వరలో దిల్లీలో జరిగే ధర్నాలో సత్తా చూపిస్తామన్నారు. శాసన మండలి సభ్యుడు బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా పేరుతో నాటకాలు ఆడుతున్న ద్రోహులకు గుణపాఠం చెప్పాలన్నారు. బాప్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా దక్కకపోతే కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే భాజపా, తెదెపాలకు పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజలకు వివరించేందుకు బెటర్‌ ఆంధ్రప్రదేశ్‌ త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు నిర్వహిస్తామన్నారు. బాప్‌ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ భాజపా, తెదేపాలు ప్రజలను దారుణంగా వంచించాయన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రారంభంలో బైక్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొద్ది సేపు ఉద్రికత్త ఏర్పడింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు, సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ జలీల్‌, బ్రాహ్మణ సమాఖ్య గౌరవాధ్యక్షుడు టీవీకేఎస్‌ శాస్త్రి, దళిత ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు నత్తా నాగేశ్వరరావు, అమరావతి అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు నీలం దుర్గారావు, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షురాలు నీలం స్వరూపారాణి, మారుతీ మహిళా సంఘం అధ్యక్షురాలు లక్కంరాజు సునీత, వెనుకబడిన తరగతుల సంఘం ప్రధాన కార్యదర్శి టి.చక్రవర్తి, గఫూర్‌, దుర్గారావు, వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు