close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

స్ఫూర్తి... ప్రతిభకు ఊపిరి 

అవార్డుల ప్రదానోత్సవ సభలో ఉపసభాపతి బుద్ధప్రసాద్‌ 

స్ఫూర్తి... ప్రతిభకు ఊపిరి 

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: సమాజంలో ఉండే ప్రతిభావంతులను గుర్తించి పురస్కాలిస్తూ ప్రోత్సహించటం వల్ల ఆ స్ఫూర్తితో సమకాలీన యువత ముందుకు సాగగలుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు. గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్ఫూర్తి అవార్డుల ప్రదానోత్సవ సభ ఆదివారం రాత్రి జరిగింది. సభలో ఆయన విశిష్ట గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు అలహాబాద్‌ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి అంబటి లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ సృజనాత్మకమైన, కళాత్మక విద్యా విధానం ఉండాలని, బట్టీ పట్టే విధానం శ్రేయస్కరం కాదన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ ప్రతి సంవత్సరం ప్రతిభావంతులను ఎంపిక చేసి అవార్డులనిచ్చి సత్కరించటం ఆనందదాయకమన్నారు. అలాంటి పురస్కార గ్రహీతలలో తెలుగు భాషా సంస్కృతుల ప్రచారం కోసం అమెరికా దేశంలో విశేష కృషి చేస్తున్న కూచిబొట్ల ఆనంద్‌ ఉండటం పురస్కారాల విలువను తెలుపుతోందన్నారు. ఈసందర్భంగా తెలుగు సాహిత్యంలో ప్రముఖ రచయిత్రి ఓల్గాకు, విద్యారంగంలో సిలికానాంధ్ర యూఎస్‌ఏ ఛైర్మన్‌ కూచిబొట్ల ఆనంద్‌కు, గ్రామీణాభివృద్ధి రంగంలో వరంగల్లు సోపార్‌ బాలవికాస వ్యవస్థాపకురాలు బాలథెరిసా సింగారెడ్డి జింగ్రాస్‌కు, సామాజిక సేవ రంగంలో ఆర్‌బీఐ కార్యకర్త కె.ఎం.యాదవ్‌ (ఉత్తరప్రదేశ్‌)కు రూ.3 లక్షల నగదు, వెండి జ్ఞాపిక, శాలువాలతో నిర్వాహకుల పక్షాన భారత సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ అంబటి లక్ష్మణరావు, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిలు సత్కరించారు. ఊటుకూరి నాగేశ్వరరావు వందన సమర్పణ చేశారు. పురస్కార గ్రహీతలు తమ స్పందనను స్ఫూర్తిదాయకంగా వివరించారు.

మనబడి సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది: కూచిబొట్ల ఆనంద్‌ 
మచిలీపట్నంలో దిగువ మధ్య తరగతి కుంటుంబంలో జన్మించిన నేను విశ్వవిద్యాలయ విద్య కోసం అమెరికా వెళ్లాను. అక్కడే ఓ విశ్వవిద్యాలయాన్ని స్థాపించే స్థితికి నేను ఎదగటానికి సహకరించింది మనవాళ్లే. మనబడి కార్యక్రమం ద్వారా అనేక దేశాల్లో వేలాది మందికి తెలుగును నేర్పుతున్నాను. ప్రస్తుతం మనబడి నుంచి బయటికొచ్చిన విద్యార్థులు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాష అన్నీ బాగా నేర్చుకొని ఛందోబద్ధంగా కంద పద్యాన్ని రాసే స్థాయికి ఎదిగారు. అమెరికాలో ఏదైనా తరగతిలో ప్రవేశం కావాలంటే ఏదో ఒక కళ తెలిసుండాలి. అక్కడ కళలకు అంత గొప్ప ప్రోత్సాహం ఉంది. ప్రోత్సాహాన్ని గమనించి మనబడి ద్వారా తెలుగు భాషా సంస్కృతులను ప్రచారం చేస్తున్నాం.

ఏది రాసినా స్త్రీల కోసమే రాశా: ఓల్గా 
నాకు గుంటూరంటే ఎంతో ఇష్టం. పాతికేళ్లు ఇక్కడే హాయిగా గడిచిపోయింది. సెయింట్‌ జోసెఫ్స్‌ స్కూల్‌, ఏసీ కళాశాల, నల్లపాడు పీజీ సెంటర్‌లలో నా చదువు సాగింది. ఇక్కడికి దగ్గరలో ఉన్న యడ్లపాడు గ్రామంలో మాతండ్రి పోపూరి వెంకటసుబ్బారావు, పంటపొలాన్ని బడి కట్టేందుకు దానమిచ్చి ఎందరికో చదువు నేర్చుకొనేందుకు వీలు కలిగించారు. చలం, కృష్ణశాస్త్రి లాంటి రచయితల పుస్తకాలను తెచ్చి నాచేత చదివించారు. ఆనాడు అమ్మా నాన్న ఇచ్చిన స్ఫూర్తి నన్ను రచయిత్రిగా నిలబెట్టింది. ఏది రాసినా స్త్రీల కోసమే రాశాను. స్త్రీల చైతన్యం కోసం మా మిత్ర బృందం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది.

యువతలో చైతన్యం: కె.ఎం.యాదవ్‌ 
గ్రామీణ ప్రాంతాల యువతలో సమాచార హక్కు చట్టం గురించి చైతన్యం తెచ్చాను. ముందుగా ఆ చట్టం గురించి అవగాహనను నేను పొంది ప్రస్తుతం వేలాది మంది కార్యకర్తలతో గ్రామ గ్రామాన సహ చట్టం గురించిన విజయాలను సాధించాను. గ్రామాల్లోని ప్రజలు అక్షరాస్యులైతే కలిగే ప్రయోజనాన్ని, సహ చట్టం శక్తిని స్వయంగా చూసి ఆనందించగలుగుతున్నా.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు