close
BETA SITE


రివ్యూ: పంతం

రివ్యూ: పంతం

సినిమా పేరు: పంతం

నటీనటులు: గోపీచంద్‌, మెహరీన్‌, పృథ్వీ, తనికెళ్ల భరణి, ‘మిర్చి’ సంపత్‌, జయప్రకాశ్‌, ముఖేశ్‌ రుషి, ప్రభాస్‌ శ్రీను, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు

సంగీతం: గోపీ సుందర్‌

సినిమాటోగ్రాఫర్‌: ప్రసాద్‌ మూరెళ్ల

నిర్మాత: కేకే రాధామోహన్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.చక్రవర్తి

విడుదల తేదీ: 05-07-2018

కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు గోపీచంద్‌. ఆయన నుంచి ఏదన్నా సినిమా వస్తోందంటే..కచ్చితంగా అందులో ఏదో విషయం ఉంటుందనే అనుకుంటారు అభిమానులు. ‘ఆక్సిజన్‌’ చిత్రం నిరాశపరచడంతో తన తర్వాతి చిత్రంతో ఎలాగైనా అభిమానులను మెప్పించాలనే ‘పంతం’తో ఉన్నారు. మరి ఈ చిత్రంతో గోపీచంద్‌ కెరీర్‌ మళ్లీ ట్రాక్‌లో పడినట్లేనా? ‘పంతం’లో నెగ్గారా?

కథేంటంటే: విక్రాంత్‌(గోపీచంద్) మంత్రులు దాచుకుంటున్న సొమ్మును తన తెలివితేటలతో కాజేస్తుంటాడు. ఆ సొమ్మును దుర్గాదేవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కి పంపిస్తుంటాడు. ఆ ట్రస్ట్‌ ద్వారా ఎంతో మందికి సాయం అందుతుంది. అంతేకాదు.. తాను నివాసం ఉంటున్న కాలనీని కూడా బాగుచేస్తాడు.

విక్రాంత్‌ వల్ల నష్టపోయిన మంత్రులు జయేంద్ర(సంపత్‌), ఆరోగ్యరావు(జయప్రకాశ్‌). ఈ మంత్రులకు విక్రాంత్‌కి ఉన్న సంబంధం ఏంటి? వీళ్లనే ఎందుకు విక్రాంత్‌ టార్గెట్‌ చేశాడు? అసలు విక్రాంత్‌ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అన్నదే కథ.

రివ్యూ: పంతం

ఎలా ఉందంటే: ఉన్నవాడి దగ్గర దోచుకుని లేనివాడికి పెట్టడం అనే రాబిన్‌హుడ్‌ తరహా కథ ఇది. ఎప్పుడూ కొత్త తరహా కథలను ఎంచుకునే గోపీచంద్‌ తన 25వ సినిమా కోసం ‘కిక్’‌, ‘శివాజీ’ వంటి రొటీన్‌ కథను ఎంచుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాను ఒక ఇంటెలిజెంట్‌ థ్రిల్లర్‌గా మలిచే అవకాశం ఉంది. దొంగతనాలు చేసే విధానం, పోలీసుల నుంచి తప్పించుకునే సందర్భాలు, విలన్‌లను బురిడీ కొట్టించడాలు..ఇలాంటి సన్నివేశాల్లో తెలివితేటలు చూపించగలిగితే బాగుండేది.

కానీ కథానాయకుడు డబ్బులు ఎత్తుకుపోవడం లాంటి సన్నివేశాలను కూడా చాలా రొటీన్‌ పద్ధతిలోనే తెరకెక్కించాడు. కథానాయిక పాత్రకి, ఆమెతో నడిచే ప్రేమ కథకి ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోవడంతో వారి మధ్య నడిచే సన్నివేశాలు కూడా విసుగు తెప్పిస్తాయి. అయితే ద్వితీయార్థంలో దర్శకుడు కాస్త కోలుకున్నాడు. విక్రాంత్‌ ఫ్లాష్‌బ్యాక్‌, తాను దొంగగా మారడానికి దారితీసిన పరిస్థితులు, అతని లక్ష్యం ఇవన్నీ సమంజసంగానే అనిపిస్తాయి. కోర్టు సన్నివేశాలు, పలికే సంభాషణలు ఆలోచనలో పడేస్తాయి. అవినీతి, లంచగొండితనం, ప్రభుత్వ పథకాలు అందవలసిన వారికి సరిగ్గా అందకపోవడం వంటి పాయింట్లపై గోపీచంద్‌ పలికిన సుదీర్ఘమైన సంభాషణలు రచయితగా దర్శకుడిలో ఉన్న ప్రతిభను చూపిస్తాయి.

పతాక సన్నివేశాల్లో రొటీన్‌గా యాక్షన్‌ జోలికి పోకుండా డైలాగులతో సరిపెట్టేశారు. కాకపోతే కథ, కథనం ఏమాత్రం లాజిక్‌కు అందకపోవడం నిరాశపరుస్తుంది. పాత సినిమాల ఛాయలు పడకుండా దర్శకుడు కొత్తగా ప్రయత్నిస్తే బాగుండేది.

రివ్యూ: పంతం

ఎవరెలా చేశారంటే: యాక్షన్‌ హీరోగా గోపీచంద్‌కు మంచి పేరుంది. అతనికి సరిపడే కథ ఇది. కానీ ఆ కథలో కొత్తదనం లేకపోవడంతో గోపీచంద్‌ నటన కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ద్వితీయార్థంలో చాలా స్టైలిష్‌గా  కనిపించాడు. కోర్టు సన్నివేశాల్లో సుదీర్ఘమైన సంభాషణలు బాగా పలికాడు. మెహరీన్‌కు ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర దక్కింది. గోపీచంద్‌ పక్కన మరీ బొద్దుగా కనిపించింది. ‘మిర్చి’ సంపత్‌, జయప్రకాశ్‌, ముఖేశ్‌ రుషి, తనికెళ్ల భరణి ఇలా ఎవర్ని తీసుకున్నా వారి పాత్రలకు తగిన న్యాయం చేశాడు దర్శకుడు.

శ్రీనివాస్‌రెడ్డి, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను నవ్వించే ప్రయత్నం చేశారు. పాటలు గుర్తించుకోదగినవిగా లేవు. ఎడిటింగ్‌లో ఒక పాట పూర్తిగా తీసేశారు. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. దర్శకుడు కొన్ని సన్నివేశాలను, సంభాషణలను బాగా రాసుకున్నాడు. కానీ ప్రేక్షకుడిని పూర్తిస్థాయిలో అలరించగలిగే దమ్ము ఈ కథకు లేకుండా పోయింది.

బలాలు:

+కోర్టు సన్నివేశాలు

+యాక్షన్‌ సీన్లు

+కొన్ని సంభాషణలు

బలహీనతలు:

- రొటీన్‌ కథ

- హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ

చివరగా: హిట్టుకొట్టాలన్న ‘పంతం’ నెరవేరలేదు

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 

తాజావార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.