close

కొనుగోళ్లకు ఇది సదవకాశమే 

మార్కెట్‌ పడినా.. మరో 5-10% లోపే 
ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు ఆకర్షణీయం
ఆర్‌బీఐ కీలక రేట్లు పెంచకపోతేనే మంచిది 
సార్వత్రిక ఎన్నికల ప్రభావంపై ఆందోళనక్కర్లేదు 
ఇంటర్వ్యూ మార్క్‌ మొబిస్‌ వ్యవస్థాపక భాగస్వామి, మొబిస్‌ కేపిటల్‌ 

‘భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రస్తుత స్థాయిల నుంచి మరింత దిద్దుబాటు కాకపోవచ్చు. ఒకవేళ పడినా అది 5-10 శాతం లోపే ఉండొచ్చు. అందువల్ల కొనుగోళ్లకు ఇదే మంచి అవకాశమ’ని అంటున్నారు లండన్‌కు చెందిన  మొబిస్‌ కేపిటల్‌ మార్కెట్స్‌ వ్యవస్థాపక భాగస్వామి మార్క్‌ మొబిస్‌. ముఖ్యంగా ద్రవ్య లభ్యత సమస్య ప్రభావంతో గణనీయంగా పడిపోయిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని చెప్పారు. మున్ముందు ఈ రంగ షేర్లు రాణించేందుకు అవకాశం ఉందని  అభిప్రాయపడ్డారు. కోజెన్సిస్‌ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించి పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఇలా..

? ప్రస్తుతం భారత స్టాక్‌ మార్కెట్‌ పరిస్థితిపై మీ అంచనా ఏంటి 
దిద్దుబాటుకు అవకాశం ఉందని మేమూ భావిస్తున్నాం. అయితే ఆయా పరిణామాల ప్రతికూల ప్రభావం ఇప్పటికే చాలా వరకు ఈక్విటీలపై పడింది. ద్రవ్యలభ్యత సంక్షోభ పరిణామంపై అందరికీ అవగాహన ఉంది. ఇప్పటికే చాలా వరకు షేర్లు అమ్మేసి బయటపడ్డారు కూడా. అందువల్ల స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు పరిమితంగానే ఉండొచ్చు. మరో 5-10% లోపే ఉండొచ్చని అనుకుంటున్నా. అందుకే నా ఉద్దేశంలో షేర్ల కొనుగోలుకు ఇదే మంచి సమయం. భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. పెట్టిన పెట్టుబడిపై మంచి ప్రతిఫలం పొందేందుకు భారత్‌లో అపార అవకాశాలున్నాయి.

? ఇటీవల విదేశీ మదుపర్లే ఎక్కువగా షేర్లు అమ్మారు. దేశీయ మదుపర్లు కూడా వీరిని అనుసరిస్తారని భావిస్తున్నారా 
కీలక రేట్లపై ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయం మీద ఇది ఆధారపడి ఉంది. ఇదే అసలైన సమస్య. పరిస్థితిని మరింత జఠిలం చేస్తుంది కూడా. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచదనే అనుకుంటున్నాను. నిధుల లభ్యత సమస్య ఉన్నప్పుడు..నిధుల లభ్యతను ఎలా పెంచాలా అని ఆలోచించాలి. కేపిటల్‌ మార్కెట్ల నిబంధనలను సరళీకృతం చేయడం ద్వారా మరిన్ని పెట్టుబడులు వచ్చేలా వీలు కల్పించాలి.

? ప్రస్తుత ద్రవ్యలభ్యత సంక్షోభంపై మీ అభిప్రాయమేంటి 
ఈ సంక్షోభం వాస్తవమే. ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలి. ఇందుకు వ్యవస్థలోకి మరిన్ని నిధులను తీసుకొనిరావడం ముఖ్యం. ప్రభుత్వం చేయగలిగేది ఇదే. ఇదే సమయంలో వడ్డీ రేట్లను మరీ ఎక్కువగా పెంచకూడదు. అధిక వడ్డీ రేట్లు ఈక్విటీలకు అతిపెద్ద ముప్పుగా తయారవుతాయి.

? అత్యంత ఆకర్షణీయ వర్ధమాన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. ఇప్పుడు ఆ విషయంపై మీ అభిప్రాయమేమైనా మారిందా 
పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌ను ఇప్పటికీ ఆకర్షణీయ ప్రాంతంగానే మేం చూస్తున్నాం. మేం అత్యంత ప్రాధాన్యం ఇచ్చే వర్ధమాన విపణులు భారత్‌, బ్రెజిల్‌.

? భారత స్టాక్‌ మార్కెట్లో ఏయే షేర్లను మీరు కొంటున్నారు 
చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లను ఎక్కువగా కొంటున్నాం. ప్రస్తుతం ఇవే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. భారత్‌ వైవిధ్యభరిత దేశం. వృద్ధికి అనేక అవకాశాలుండటం వల్లే ఇక్కడ మేం అడుగుపెట్టాం. వినియోగ ఆధారిత కంపెనీలు, ఆర్థిక రంగ కంపెనీలు, సూక్ష్మ రుణ సంస్థల షేర్లను కొనుగోలు చేస్తున్నాం. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి.

? అన్ని రంగాల్లోనూ దిద్దుబాటు ఉండటంపై మీరు ఏం చెబుతారు 
ఈ సమయంలో కొనుగోళ్లు చేస్తోంది అందుకే మరి. ప్రస్తుతం మూలాలకు సంబంధించిన సమస్య ఉందని మేం అనుకోవడం లేదు. మున్ముందు ఈ రంగాలన్నీ చాలా చాలా కీలకం. అందుకే వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నాం.

? స్టాక్‌ మార్కెట్‌పై సార్వత్రిక ఎన్నికల ప్రభావం ఎలా ఉండొచ్చు 
ఎలాంటి ప్రభావం ఉండదనే అనుకుంటున్నాను. అధికారంలోకి ఎవరొచ్చినా సంస్కరణలు కొనసాగిస్తారు. ఈ విషయంపై ఇక్కడి ప్రజలకు బాగానే అవగాహన ఉంది.

? రూపాయి క్షీణత, ముడి చమురు ధరలు, భౌగోళిక రాజకీయ ఆందోళనల సమస్యలు మరింత తీవ్రమయితే భారత స్టాక్‌ మార్కెట్‌లో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందని అనుకుంటున్నారు 
బ్యారెల్‌ చమురు ధర 100 డాలర్ల స్థాయికి వెళ్లే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే భారత దిగుమతి బిల్లు మరింత పెరుగుతుంది. అందువల్ల ఎగుమతులపై భారత్‌ దృష్టి పెట్టాలి.

? మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియోను ఎలా తయారుచేసుకోవాలి 
మన దగ్గరున్న పెట్టుబడినంతా ఒకటే కంపెనీ షేరులో పెట్టేయకూడదు. వైవిధ్యమనేది చాలా చాలా కీలకం. వివిధ కంపెనీ షేర్లలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ స్టాక్‌ మార్కెట్లలోనూ పెట్టుబడులు పెట్టడంపైనా దృష్టి పెట్టొచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారత్‌ మార్కెట్‌ ఒక్కటి మాత్రమే అత్యుత్తమం కాదు. అలాంటివి మరికొన్నీ ఉన్నాయి. గత 20 ఏళ్లుగా చూసుకుంటే.. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఏ దేశ స్టాక్‌ మార్కెటైనా ఆ తరహా అద్భుత పనితీరును రెండేళ్లకు మించి కొనసాగించిన దాఖలాలు లేవు. అందువల్ల పెట్టుబడుల విషయంలో వైవిధ్యానికి తప్పక ప్రాధాన్యం ఇవ్వాలి.

- ముంబయి

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.